పచ్చదనానికి ప్రతీక ఆకుపచ్చ అమ్మ

  2019 పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సందర్భముగా 35 మంది ఉపాధ్యాయ కవి మిత్రులు రాసిన కవితల సమూహరమే ‘ఆకుపచ్చ అమ్మ’. గత మూడు సంవత్సరాలుగా వరుసగా ఎస్‌ఎస్‌సి స్పాట్ వాల్యుయేషన్ సమయంలో ఉపాధ్యాయ కవులు రాసిన కవితలు అన్నింటిని ఏ సంవత్సరము ఆ సంవత్సరంలో కవితా సంకలనం తీసుకురావడం గొప్ప విషయం. అందులో మొట్టమొదటగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉపాధ్యాయులు రాసిన తొలి కవితా సంకలనం ‘ఒక సందర్భం’ కాగా , ‘మలి కవితాసంకలనం’ […] The post పచ్చదనానికి ప్రతీక ఆకుపచ్చ అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2019 పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సందర్భముగా 35 మంది ఉపాధ్యాయ కవి మిత్రులు రాసిన కవితల సమూహరమే ‘ఆకుపచ్చ అమ్మ’. గత మూడు సంవత్సరాలుగా వరుసగా ఎస్‌ఎస్‌సి స్పాట్ వాల్యుయేషన్ సమయంలో ఉపాధ్యాయ కవులు రాసిన కవితలు అన్నింటిని ఏ సంవత్సరము ఆ సంవత్సరంలో కవితా సంకలనం తీసుకురావడం గొప్ప విషయం. అందులో మొట్టమొదటగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉపాధ్యాయులు రాసిన తొలి కవితా సంకలనం ‘ఒక సందర్భం’ కాగా , ‘మలి కవితాసంకలనం’ ఒక జ్ఞాపకం’ వెలువడింది. ఇప్పుడు ముచ్చటగా మూడవ పుస్తకం ‘ఆకుపచ్చ అమ్మ’ ఆవిష్కృతమైంది.

సాధారణంగా పదవ తరగతి మూల్యాంకనం సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఒకచోట చేరి జవాబు పత్రాలు దిద్దడం సహజం.  తీరిక దొరికితే చాలు ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేయడం చాలా కాలం నుండి జరుగుతున్న విషయమే. కానీ గత మూడు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ సంప్రదాయానికి చరమగీతం పాడి సరికొత్త ఆలోచనలతో సాహిత్యంపై ఆసక్తి కలిగిన, సామాజిక స్పృహ కలిగిన చైతన్యవంతమైన ఒకరిద్దరు ఉపాధ్యాయుల ఆలోచన సరళీ నుండి ఉద్భవించిన సరికొత్త ఆలోచనే ఈ రకమైన కవితా సంకలనాలు వెలువడడం జరుగుతుంది.

తెలంగాణలో ఏదో ఒక చోట స్పాట్ సందర్భంగా ఇటువంటి ఆలోచనలతో కవితా సంకలనాలు రావడం జరిగేది. అదే పద్ధతిన నల్గొండ జిల్లాలో కూడా కవులైన ఉపాధ్యాయ మిత్రులు కలిసి ‘ఆకుపచ్చ అమ్మ’ కవితాసంకలనం ఈ సంవత్సరం తీసుక రావడం జరిగింది. ఇది మూడో ప్రయత్నంగా ఒకే వస్తువు మీద కవిత్వం రాసే టట్టు ప్రోత్సహించి వివిధ ఉపాధ్యాయులు కవుల నుండి కవితలు సేకరించి, వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకు రావడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన అక్షర యజ్ఞం గా భావించాలి. ఆ తోవలో జరిగిన ప్రయత్నమే ఇది. ఆ ప్రయత్న సాధకులు పెరుమాళ్ళ ఆనంద్, సాగర్ల సత్తయ్య, మండల స్వామి వీరు సంపాదక మండలి సభ్యులుగా ఏర్పడి పచ్చదనానికి ప్రతీకగా ఈ *ఆకుపచ్చ అమ్మ* ను మన ముందుకు ముఖ్యంగా సాహితీలోకానికి అందించడం జరిగింది.

ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలలో అతి ముఖ్యమైనది పర్యావరణం. ఇది సమతూకంలో లేదన్న విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే సమస్య పరిష్కారం నిమిత్తము దేశవ్యాప్తంగా మరియు మన రాష్ట్రమైన తెలంగాణలో కూడా ప్రకృతి పచ్చదనం చేసే విధంగా అనేక చర్యలు ప్రభుత్వం తీసుకున్న సంగతి మనమంతా ఎరిగినదే. హరితహారం కార్యక్రమం లో కోట్ల మొక్కలు నాటే యజ్ఞం మొదలయింది. దానికి మరింత చేదోడువాదోడుగా బలం చేకూర్చి, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరంగా సమస్యలు లేకుండా చేసే ఉద్దేశంతో కవులు రచయితలు, పర్యావరణ ప్రేమికులు సమాజంలో చైతన్యం తీసుకు వచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లా చేయు అంశాలలో భాగంగా ఆకుపచ్చ అమ్మ పేరుతో విభిన్న కవితలు సామాజిక స్పృహతో రాయగా ఈ ఈ సంకలనం పురుడు పోసుకుంది.

ఈ ఆకుపచ్చ అమ్మ కవితా సంకలనం లో మొత్తం 35 కవితలున్నాయి. అందులో వచన కవితలు ఎక్కువగా ఉన్నాయి. వచన కవితలతో పాటు, పద్య కవితలు గేయాలు కవితలు కూడా ఉన్నాయి. ఒకే కేంద్రిత వస్తువు మీద కవిత్వము అంటే ప్రకృతి పచ్చదనం పెంచడానికి, చెట్లు నరకకుండా చెట్టు ని ఎట్లా కాపాడుకోవాలో తెలియజేస్తూ ఇందులో రకరకాల కవితలు ఉన్నాయి. ఈ భూగోళాన్ని హరిత మయం చేయడం, కాలుష్యం లేని వాతావరణాన్ని ముందు తరాలకు అందించాలన్న దృఢ సంకల్పమే ఈ ఆకుపచ్చ అమ్మ ఆవిర్భావము. ఈ సంకలనంలో ముందుమాట రాసిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి… ఆధునిక కాలపు కవిత్వానికి ఇది ఒక దర్పణం అన్నారు. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయ కవులను, సంపాదక మండలి సభ్యులను అభినందించడం అంటే ఈ పుస్తకం యొక్క గాఢత, నాణ్యత అర్థం చేసుకోవచ్చు.

అదేవిధంగా డాక్టర్ బెల్లి యాదయ్య…, రాదనుకున్న వాన, కవిత శీర్షికలో ‘ పెరగవలసిన సుందర వనాలకోసం/ ఆకుపచ్చ కొండ్రా వేద్దాం/ తలకు పది వృక్షాలై నేల తల్లికి ప్రణమిల్లు దాం ‘ అంటూ తన కవి వాక్కు తెలియజేస్తూ మొక్కలు నాటి పెంచాల్సిన ఆవశ్యకత ను తెలియజేస్తూ పిలుపునిచ్చారు. అదేవిధంగా గతంలో నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి గా పనిచేసిన పాలడుగు సరోజినీ దేవి… ‘ఆకుపచ్చ అమ్మవు నీవు/ నీవు లేకుంటే మాకు శ్వాసే లేదు‘ చెట్టమ్మ… /ఓ చెట్టమ్మా… / నీ ఆకులు మాకు ఒక ఔషధమమ్మా…. అని *నీవు లేని భూగోళం* అనే కవితలో చెట్ల ప్రాధాన్యత తెలుపుతూ జీవకోటికి చెట్లే ప్రాణవాయువు అని ఎరుక చేసింది. చెట్లు లేకుంటే మనుగడే లేదన్న స్పృహ తెలియజేసింది.

ఆకుపచ్చ అమ్మ లోని మొదటి కవిత’ ధ్వంసమైన వసంతం, లో ‘ కూల్చిన… కొమ్మల్ని చెట్ల మొండాలకు / అతికించికపోతే/ శూన్యాన్ని సృష్టించుకోవాలి‘ అందుకే…. పాదాల కింద ఎడారులు కదులుతున్నా/ పచ్చదనం కోసమే ప్రయాణించాలి‘. అని భోగ బాల సుబ్రహ్మణ్యం చెట్లు లేకుంటే మన బతుకు ఎడారి మయమే అని హెచ్చరించినట్లు గా తన అక్షరాల్ని కవిత రూపంలో ఎక్కు పెట్టిండు. అదేవిధంగా‘ తల్లి వేరు‘ కవితా లో భాను శ్రీ కోత్వాల్’ నా లో గిళ్ళ కొచ్చి/ మీరు ఊరికే వెళ్ళొద్దు/ ఆఖరికి విత్తు గా నైనా/ నన్ను హత్తుకోండి‘ అని చెట్టు నెనరు ఎంత గొప్పదో విశదపరుస్తుంది. ‘ నేను మహావృక్షాన్ని‘ అనే ఇంకొక కవితలో… నేను మహావృక్షాన్ని/ పరోపకారం చేసేదాన్ని/ ఎన్నిసార్లు గండ్ర గొడ్డలితో/ నరికి మోడు చేసిన/ మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంట/ గుండె లోతుల్లోంచి జీవం / పోసుకుంటూ నే ఉంట… మట్టిలో పుట్టిన మహిమను రా/ తోడుగా నిలిచే తోబుట్టువును రా/ నరక కూ రా నరుడా నన్ను…. ‘ అంటూ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి వృక్షము ఎట్లా సకల జీవులకు ఉపయోగపడుతుందో తెలుపుతూ చెట్ల గురించి అందరూ సోయి తెచ్చుకునే విధంగా చక్కగా వివరించండి.‘

రియల్ ఎస్టేట్ దాష్టీకానికి/ నాయకుల తోవల వెడల్పు లకు/ కూలబడ్డ అస్తిత్వ పరివేదన ను/ కూల్చే చేతులకు గత జ్ఞాపకాలు లేవు/ ఆవిష్కృతం మే ఓ జ్ఞాపకంగా/ నన్ను ఉండనివ్వు‘ అని చెట్టు తపనను “కూల్చిన జ్ఞాపకం‘ కవితలో పున్న దామోదర్ ఎంతో హృద్యంగా తెలిపాడు. గోవర్ధనా చారీ అనే ఉపాధ్యాయుడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే కవితా అంశంలో‘ సృష్టికి ప్రతి సృష్టి చేయు మానవుడు/ తెలుసుకోవాలి అభివృద్ధి మాటున వస్తున్న ఆపదను‘ అని పద్య రూపంలో ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు ఎంత విజ్ఞానం సాధించినప్పటికీ, చెట్ల నరికివేత వల్ల దాగి ఉన్న ప్రమాదాల్ని పసిగట్టలేకపోతున్నారని అన్న భావనను మొత్తం చేశాడు. అదేవిధంగా లింగంపల్లి హేమలత ‘చెట్ల సందేశం‘ అను కవిత అంశంలో వృక్షజాతి ని రక్షించుకొమ్మంటూ మానవ జాతిని వేడుకుంటున్న సందేశాన్ని వ్యక్తం చేసింది. ‘ఆకుపచ్చ ఆనందం‘ అనే కవితలో దాసరి లింగస్వామి‘ వృక్షాలే సృష్టి వృద్ధి ప్రదాతలు/ వృక్షాలే నరుని రక్షణ కవచాలని ‘ పేర్కొన్నాడు. మానవ వృక్షం అనే కవితలో ‘ చెట్టమ్మ చె ట్టమ్మ చెట్టమ్మా……. నీ చెలిమంటే మాకు ముద్దమ్మా ‘ అంటూ డాక్టర్ పాండాల మహేశ్వర్ గేయ రూపంలో చెట్టు ప్రాముఖ్యత గురించి వివరించాడు.‘ హరితాంజలి ‘ అనే కవితలో కూల్చిన, నేలపై కొరిగి కొత్తగా మొక్కగా అంకురింతు వు లే / చీల్చిన, కట్టె గా నిలిచి చేతువు సాయం వస్తు రూపమై‘ అంటూ చెట్టు ది దయాగుణం అని పద్యాల రూపంలో ఎంతో మధురంగా రాసినాడు.

చెట్టు తల్లి శీర్షికన పగిడిపాటి నరసింహ చెట్టు వల్ల పండ్లు, పూలు, కూరలు, ఆకులు, కాయలు, పనిముట్లు మొదలైనవి ఎట్లా పొందుతున్నామో వివరించాడు. ‘ చెట్టమ్మ…? / నీ నవ్వు ఏదమ్మా…?అనే కవితలో ఉప్పల పద్మ‘ తనువంతా త్యాగ పరిమళాన్ని ఆదుకుని / పరోపకారమే పరమ ధర్మంగా ఉన్న దానివి‘ అంటూ చెట్టు ఎందుకో చిన్నబోయింది అని ప్రశ్నిస్తుంది. కనక టి రామకృష్ణ‘ అమ్మ నైతిని‘ అనే ఇంకొక కవితలో‘ మట్టికి పరిమళాన్ని అద్దిన / మౌన సంగీతమే నేను‘ అంటూ చెట్టు అమ్మతనాన్ని వివరిస్తూ నరక వద్దన్నా సందేశాన్ని ఇచ్చాడు. ఆకుపచ్చ అమ్మను మాట్లాడుతున్నా… అను కవితలలో సహచరి (కస్తూరి ప్రభాకర్) చల్లదనం కోసం ఏసీ ల ను/ మానవాళి విధ్వంసం కోసం/ అను బాంబుల్ని సృష్టించ చూస్తున్నారు/ బిడ్డ! నేను మీ ఆకుపచ్చ అమ్మను మాట్లాడుతున్న… జర జాగ్రత్త.. అంటూ పర్యావరణాన్ని పాలకులు ఎట్లా విధ్వంసం చేస్తున్నారో అంటూ తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది.

అదేవిధంగా సరితా నరేష్‘ నేను సైతం/ నాగిల్లి సైదులు- నేను చెట్టును/ సాగర్ల సత్తయ్య- గ్రీన్ పోయెట్రీ కవితలో చెట్టును ఎన్నో రకాలుగా వర్ణించారు. ఇంకా మండల స్వామి- మీకోసం/ నకిరేకంటి సీనయ్య- నేనొక తరిగిపోతున్న జాతిని/ గడ్డం సీనయ్య- చెట్టును రా… / నీలం శేఖర్- చెట్టు తల్లికి వందనం/ మాద గాని శంకరయ్య- ఆత్మ నివేదన/ అనుమల వాణి- నీవు పచ్చగా ఉంటేనే/ చిలుముల బాల్ రెడ్డి- ఆకుపచ్చ అమ్మకు జై/ మద్దోజు సుధీర్ బాబు- నేను నేనే/ సుతారం వెంకట్ నారాయణ- హరితహారం/ అయితే ఫోన్ వెంకటేశ్వర్లు- పచ్చని చెట్టు త్యాగం ఇదే/ పెరుమాళ్ళ ఆనంద్- చెట్టు నా జనని/ నెమలి శ్రీదేవి- కాపాడుకోండి/ సారంగి వెంకన్న- తోబుట్టువులు/ ఎస్కే రజియా- ప్రాణదాతలు ఇలా మొదలగువారు వివిధ కవితలలో చెట్ల ప్రాధాన్యత, వాటిని ఎట్లా కాపాడుకోవాలి?, అదేవిధంగా పర్యావరణాన్ని హరి కట్టించుకునే విధానం పై పలు కవితలు రాశారు.

ఇలా *ఆకుపచ్చ అమ్మ* కవితా సంకలనం లో ప్రతి కవిత సందేశాత్మకంగా, ఆలోచించే విధంగా ఉన్నవి. కొన్ని కవితలు గాఢత కలిగిన, వస్తుపరంగా, శిల్పపరంగా అద్భుతంగా ఉన్నాయి. మరికొన్ని కవితలు పేలవంగా, తప్పులు కూడా ఉన్నాయి. మొత్తం మీద అలతి అలతి పదాలతో సులభంగా పండితుల తో పాటు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా కవితలు చోటుచేసుకున్నాయి. మొదటిసారి రాసిన కవులు ఇంకా సరిదిద్దుకునే విధంగా ఈ సంకలనం దోహదం కాగలదని అనుకోవచ్చు. మొత్తం మీద 80 పేజీలతో కూడిన ఈ ఆకుపచ్చ అమ్మ సంకలనానికి ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ముఖచిత్రం అని చెప్పాలి. దీన్ని గీసింది మిర్యాలగూడ కు చెందిన 8వ తరగతి చదివే చిలుకూరి హరిచందన. చాలా చక్కగా గీసి అందించినందుకు ఆ చిన్నారికి ఆశీస్సులు అందిస్తూ, అదేవిధంగా ఎంతో వ్యయప్రయాసలకు గురై, ఆలస్యమైనా, ఓ అమృతం లాంటి ’ఆకుపచ్చ అమ్మ’ను అందరికీ అందించిన సంపాదక మండలి సభ్యులకు, పర్యావరణ స్పృహతో కవితలు రాసిన నా లాంటి ఉపాధ్యాయులైన కవి మిత్రులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, పుస్తకాన్ని అన్ని పాఠశాలల గ్రంథాలయాలకు అందించే విధంగా విద్యాశాఖ అధికారులు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను.

Article about Aaku pacha Amma book

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పచ్చదనానికి ప్రతీక ఆకుపచ్చ అమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: