కాశ్మీరియత్.. తెలంగాణ నియత్..

ఎంత ధర్మరాజుకైనా ధర్మాన్ని పాక్షికంగా తప్పకుండా యుద్ధాన్ని గెల్వడం కుదరలేదు. ధర్మాన్ని కాపాడటానికి కొద్దిల బేత అటిటు తప్పినా ఫర్వాలేదని అందుకు ధర్మరాజే పైకి అశ్వత్థామ అని కిందికి ఏనుగు అని అబద్ధమాడినా తప్పులేదనేది మహాభారత యుద్ధనీతి. అంతేకాదు.. ధర్మరక్షణ కోసం ధర్మం తప్పవలసిందేననేది గీతాచార్యుని ఉవాచ. ఇక్కడ దీన్ని ప్రస్తావిస్తున్నామంటే భారతం, భాగవతం చెప్పిన సూత్రాలన్నింటినీ ఆమోదించదలుచుకున్నమా.? యుద్ధాన్ని ప్రేమను గెలవడానికి ఏమైనా చేయొచ్చనే అతివాద నీతికి ఆమోద ముద్రవేయ దలుచుకున్నమా.? అంటే కాకపోవచ్చు.. కానీ, […] The post కాశ్మీరియత్.. తెలంగాణ నియత్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎంత ధర్మరాజుకైనా ధర్మాన్ని పాక్షికంగా తప్పకుండా యుద్ధాన్ని గెల్వడం కుదరలేదు. ధర్మాన్ని కాపాడటానికి కొద్దిల బేత అటిటు తప్పినా ఫర్వాలేదని అందుకు ధర్మరాజే పైకి అశ్వత్థామ అని కిందికి ఏనుగు అని అబద్ధమాడినా తప్పులేదనేది మహాభారత యుద్ధనీతి. అంతేకాదు.. ధర్మరక్షణ కోసం ధర్మం తప్పవలసిందేననేది గీతాచార్యుని ఉవాచ. ఇక్కడ దీన్ని ప్రస్తావిస్తున్నామంటే భారతం, భాగవతం చెప్పిన సూత్రాలన్నింటినీ ఆమోదించదలుచుకున్నమా.? యుద్ధాన్ని ప్రేమను గెలవడానికి ఏమైనా చేయొచ్చనే అతివాద నీతికి ఆమోద ముద్రవేయ దలుచుకున్నమా.? అంటే కాకపోవచ్చు.. కానీ, బతుకు యుద్ధంలో తనను తాను కాపాడుకోటానికి ఎంతటి నీతిమంతుడైనా హతః కుంజరః అనకుండా ఉండడం కుదరదనేది మాత్రం వాస్తవం.

ధర్మం తప్పడం ధర్మాన్ని కాపాడడం అనే అంశాలు ఇక్కడ చర్చనీయాంశమే అయినా… సమయాభావం వల్ల చర్చలోపలికి పోవుడు కుదురుతలేదు. కానీ… అంతిమంగా ధర్మాన్ని రక్షించడం ఎలా అనేదే ఇందులో అంతస్సూత్రం. ఈ నేపథ్యంలోంచి వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు.. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న కశ్మీర్ వ్యవహారాన్ని అర్థం చేసుకోవాల్సి వుంటది. ఇప్పుడు కశ్మీర్ సమస్య తీరిందా మొదలైందా అనే మేధావులకు సంబంధించిన ప్రశ్నను పక్కనపెడితే.. 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తి హక్కులను హరించింది మోడీ ప్రభుత్వం అనే విమర్శలను పరిగణనలోకి తీసుకోని కూడా పక్కకు పెడితే.. చట్టబద్ధమైన చారిత్రక ఒప్పందాలను కాలరాయడం ధర్మమేనా.? అనే వాస్తవాలను కూడా పక్కకు పెడితే… ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత బిజెపి అమిత్ షా, మోడీ ద్వయం ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడం లో భాగమే 370 ఆర్టికల్ రద్దు అనే విషయంలో వాస్తవమున్నా… దాన్నీ కాసేపు పక్కకు పెడితే…

అదేంటి అన్నిటీని పక్కకు పెట్టమంటున్నారు అని అడుగుదామనుకుంటున్నరా.? మీకు ఆ ఆలోచన రావడంతో తప్పులేదు… ఎందుకంటే ఇక్కడ పక్కకు పెడుదామని చెప్పిన ప్రతి అంశమూ ధర్మబద్ధమైందే… కాదనలేం..పక్కకు పెట్టలేం. కానీ పెట్టాల్సిందే. ఎందుకంటే… జరిగింది వొక్క కశ్మీర్‌కు మాత్రమే కాదు అట్లా ఈశాన్య రాష్ట్రాలు ఇంకా ఇతర ప్రాంతాలున్నాయి. వాటిల్లో తెలంగాణ ముఖ్యమైనది. తెలంగాణ బిడ్డగా నా దేశానికి జరిగిన అధర్మాన్ని ఈ సందర్భంగా కనీసం గుర్తు చేయవలసి వున్నది.

హైదరాబాద్ సంస్థానికి నేడు కశ్మీర్‌కు జరిగినట్టే విలీనం సమస్య దేశానికి స్వాతంత్య్ర సమయంలనే నాడే జరిగింది.. అయాల కశ్మీర్ రాజు హరిసింగ్ మాదిరే నిజాం రాజు కూడా తన సంస్థానాన్ని ప్రత్యేక దేశంగానే కొనసాగించడానికి ప్రయత్నించిండు. తేడా అల్లా ఏందంటే… కశ్మీరేమో పాకిస్తాన్ బార్డర్ల వున్నది తెలంగాణేమో లేదు.. గంతే. మరి నాడు తెలంగాణ పట్ల అధర్మంగా వ్యవహరించిన్రు అనే వాదనను మనం తెద్దామా.? వందలాది దేశాల్లో రాయబారులను కలిగి వుండి ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధిని కలిగి వుండి సొంత కరెన్సీ వుండి… వొక స్వతంత్ర దేశంగా దేదీప్యమానంగా వెలుగొందిన తెలంగాణను ఎందుకు పక్కకు పెట్టిండ్రు అని అడుగుదామా.?

నేడు కశ్మీరియత్ ను విలీనం చేసుకున్నట్టే (హైద్రాబాద్ సంస్థానం) తెలంగాణ అస్తిత్వాన్ని విసిరికొట్టలేదా.? నాదేశాన్ని నాకు కాకుండా చేయడమే కాకుండా…. నన్ను తీస్కపోయి మంది రాష్ట్రంలో కలపలేదా.? కనీసం వొక రాష్ట్ర హోదానన్న ఇవ్వకుండా పక్కకు పెట్టలేదా.? ఆనాడు ధర్మం తప్పలేదా ఈ భారతదేశం.? నన్ను బలవంతంగా తనలో విలీనం చేసుకోలేదా.? అక్కడితోనే ఆగకుండా నన్ను తీస్కపోయి ఆంధ్రలో విలీనం చేయలేదా.? అనే ప్రశ్నలను ఇప్పుడు ముందలేసుకుందామా.? ఆనాడు ఏడపోయినయీ ధర్మపన్నాగాలు..ఈ మేధావుల పలవరింతలు.? నేడు భారత్‌లో విలీనమైన కశ్మీరయత్ గురించి బాధపడుతున్న మేధావులకు నాడు స్వచ్ఛందంగా భారత్‌లో కలిసిన తెలంగాణ నియత్‌ను ఎందుకు ప్రశంసిస్తలేరు.? నాడు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తరా అని అడిగుతున్నవాల్లు నాడు ఇదే తెలంగాణకు కేటాయించిన 371 ఆర్టికల్ స్ఫూర్తిని ఆగం పట్టిచ్చిన సంగతిని ఎందుకు అడుగలేదు.? అని ఎవలైనా అడిగితే సమాధానాలు ఎవలు చెప్తరు.?

నిజమే.. తెలంగాణ బిడ్డ ఈ దేశంలో భాగస్వామ్యం కావడానికి ఏనాడూ వెనకంజ వేయలేదు. భారత దేశంలో భాగమై తన తెలంగాణ నియత్‌ను కాపాడుకున్నడు. తన దేశాన్ని స్వచ్ఛందంగా వదులుకోని భారతమాత బిడ్డగా గర్వంగా బతుకుతున్నడు. తను ఏనాడూ ప్రత్యేక జెండా కోసం పాకులాడలే.. తన అజెండాను వదులుకోని భారత మాత జండాను తన గుండెల మీద మోస్తున్నడు.

అది ఎందుకంటే… భారతదేశం అనే దేశానికి వొక సంపూర్ణత సాధించడం.. కోసం. బ్రిటీష్ కన్నా ముందు వందలాది దేశాలుగా కొనసాగిన భారతీయ.. బ్రిటీష్ వారి ఏలుబడిలో వొక రూపం తీసుకున్నది. బ్రిటీష్ అనంతర కాలంలో వొక సార్వభౌమత్వాన్ని సంతరించుకున్నది. సర్వ సత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ పటం మీద నిలిచింది. అట్లా నిలిచింది అంటే… నయాన్నో భయాన్నో అందరినీ వొక్క తాటి మీదికి తెచ్చుకోవడం వల్లనే సాధమైంది. బలంతం వున్నకాడ ఎదుటివారి మనోభావాలు దెబ్బ తింటయి కూడా కానీ కొన్ని తప్పవు.. అనేది ఇక్కడ నీతి. అంటే.. నేడు కాశ్మీరియత్ విషయంలోనైనా నాడు తెలంగాణ నియత్ విషయంలోనైనా.. నాటి కాంగ్రెసయినా నేటి బిజెపి అయినా.. భారత ప్రభుత్వాలు.. అశ్వత్థామ హతః కుంజరః అంటూ ధర్మం తప్పిన మాట వాస్తవమే. అది భారత దేశం కోసమే అనుకుంటే మనుసు కుదుటపడుద్ది.

అయితే.. ఇట్లా భారత దేశం ఏకత కోసం తాము కోల్పోయిన సంస్థానాల అస్తిత్వాల నేపథ్యంలోంచి ఇక్కడ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మనువాద శక్తులు చెప్తున్న జాతీయత, జాతీయ వాదం అనే విషయం మీద మరో లోతైన చర్చ లేవనెత్తవలసిన అవసరమున్నది. అసలు జాతీయవాదం అంటే ఏంది.? ఈ దేశ సంస్క్రతి ఏంది.? అది మనువాద బ్రాహ్మణీయ జాతీయ వాదమా.. లేక మూలవాసి సబ్బండ జాతీయ వాదమా..? ఆర్యన్ ద్రావిడ జాతీయవాదమా..? దక్షిణ భారత జాతీయ వాదమా.? అనే వాటి గురించి చర్చించవలసి వున్నది.

 

ఈ దేశంలోని విలువలు నూటికి తొంభై శాతంగా వున్న శూద్ర బహుజన ఉత్పత్తి మానవ సంబంధాలను అణచి వేసే ఆధిపత్య మనువాద విలువలు సంప్రదాయాలు.. ఇదా జాతీయ వా దం.. అని ప్రశ్నించవలసి వున్నది. అయితే ప్రస్తుతానికి ఈ అంశాన్ని కూడా తర్వాత చర్చించడానికి పక్కకు పెట్టి .. నీకున్న భిన్నాభిప్రాయాలను కూడా పక్కకు పెట్టి.. వొక్క పని మాత్రం చేయవలసి వున్నది. అది ఏందంటే…. భారత రాజ్యాంగాన్ని తుచ తప్పకుండా ఆచరించడం… భారత జాతీయత కు కట్టుబడి వుండడం. ఇందులో ఎటువంటి రొండో మాటకు తావు లేదు. భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా అమలు పరచడం.. కశ్మీర్‌లో కూడా భారత జండా ఎగరడం.. అవసరం. భిన్నత్వంలో ఏకత్వం సాదృష్యమవ్వడం. ఇది జరగాల్సిందే. అందుకు ఏ ఆర్టికలునయినా రద్దు చేసేందుకు… నాడు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోనైనా అంటే.. అశ్వత్థామ హతః కుంజరః అనడంలో తప్పేమీ లేదు. మరి.. పైన పక్కకు పెట్టమన్న అంశాల సంగతేంది..? వాటి గురించి ఎప్పడికీ అడుగొద్దా..? అని అడుగుతారా… ఎందుకడుగొద్దు.. ముందు మీరు భారతీయత జాతీయవాదం అనే అంశాలకు కట్టబడి వుండాలె. భారత రాజ్యాంగం పట్లా పార్లమెంటరీ వ్యవస్థల పట్ల మీకు గౌరవాన్ని కలిగి వుండాలె.. అట్లయితేనే మీరు చర్చకు అర్హత వున్నట్టు..

భారత జాతీయతకు కట్టుబడి గనుక చర్చచేస్తే… చాలా అద్భుతాలు జరుగుతయి. అసలైన వాస్తవాలు బయటకొస్తయి. అవియేమంటే… అస లు ఈ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి మోడీ, అమిత్ షా చెప్తున్న జాతీయ వాదం నిజ జాతీయవాదం కాదని… నిజ జాతీయవాదం సబ్బండ కులాల ఉత్పత్తి సంబంధాల నుంచి వచ్చిన జంబూద్వీపపు సాంస్క్రతిక సామాజిక సింగిడి రంగుల సమ్మోహన సహ జీవనంలో ఉన్నదని అర్తమైతది. దేశాలుగా వెలుగొంది బ్రిటీష్ అనంతర భారతంలో రాష్ట్రాలుగా విడివడి భారత రాజ్యాంగానికి కట్టుబడి వున్న భారత జన పదాల విభిన్న సాంస్క్రతిక జీవన విధానాలను గౌరవించడంలో భారత దేశ సార్వభౌమత్యం ఇమిడి ఉన్నదని అర్థమైతది.

ప్రపంచ సంస్కృతికి ఆది మూలమైన భారతీయ మేధో సంపత్తికి ఎనగర్రయిన గంగా జమునా తహజీబ్ అర్థమైతది. ఏ ప్రాణికీ హాని తలపెట్టకుండా మహానందంతో కలిసికట్టుగా జీవించడం ఎట్లనో నేర్పిన జైనం, బౌద్ధంలోంచి మొలకెత్తిన ఈ దేశపు మట్టి చేతులతో చేయి చేయి కలిపి నడిస్తే అర్థమైతది… భారత జాతీయత. ఈ భూమి మీద పుట్టిన వేదాల, పురాణాల సమస్త జ్ఞానాల తాత్విక కోణాలను రంగరించి వాటిలోని విద్వేషపు పంటికింది రాల్లను ఏరివేసి పుటం పెట్టి రంగరించి రసం తీసి వాటి అంతస్సారాన్ని జీర్ణం చేసుకోవడంలో వున్నది భారత జాతీయతావాదం. రేపటి కోసం వొక శిశువుకు పురుడుపోసే మంత్రసానితనంతో భావి భవిష్యత్తుకు పురుడుపోయడంలో వున్నదీ భారత జాతీయతావాదం. ప్రేమిచండంలో వున్నది వేధించడం లో ద్వేషించడంలో కాదు.. అని అర్థమైద్ది అసలైన చర్చలోకి దిగితే.

మరి ఈ చర్చను ఎవరు చేయాలె.. ఎవరు చేయాలంటే.. ఉత్పత్తి సంబంధాలతోని పని లేని లీజర్ క్లాస్ కాదు.. ఆధిపత్య కులాల నుంచి వచ్చిన రాజకీయ మేధావి వర్గం అంతకన్నా కాదు… సబ్బండ ఉత్పత్తి కులాల సాంస్కృతిక జ్ఞాన తాత్వికనుంచి ఉద్భవించిన మేధో రాజకీయ సమూహాలు మాత్రమే చేయగలిగే చర్చ ఇది. భారత జాతీయత గురించిన అసలైన చర్చను కొనసాగించాల్సిన బాధ్యత… ప్రపంచానికి వసుధైక కుటుంబం అనే భావనను అందించగలిగే బాధ్యత.. ఆధిపత్య కులాలది వర్గాలది మనువాద హిందువులది కాదు.. దేశ సంపదకు మూలమైన మూలవాసి ఆది జాంబ సబ్బండ వర్ణాల హిందువులది. జై తెలంగాణ/ జై కశ్మీర్ / జయహో భారత్.

article 370 jammu and kashmir

 రమేశ్ హజారి, 9390919090

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాశ్మీరియత్.. తెలంగాణ నియత్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.