వారసత్వం నుంచి పౌరసత్వానికి

  కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు నడుపుతున్నదని, రాహుల్ గాంధీ వారసుడుగానే రాజకీయాల్లోకి వచ్చాడని నిన్నటి వరకు విమర్శలు సంధించిన కమలనాథులు ఇప్పుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ భారత పౌరుడేనా? ఇన్నేళ్లుగా ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందా? వంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు పౌరసత్వం ఉందో లేదో నిరూపించవలసిన బాధ్యత ఎవరిది? పౌరసత్వం లేకపోతే భారతప్రభుత్వం ఏం చేస్తోంది? ఆయన పార్లమెంటు సభ్యుడిగా లోక్ సభలో అడుగుపెట్టి ప్రధానిని […] The post వారసత్వం నుంచి పౌరసత్వానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు నడుపుతున్నదని, రాహుల్ గాంధీ వారసుడుగానే రాజకీయాల్లోకి వచ్చాడని నిన్నటి వరకు విమర్శలు సంధించిన కమలనాథులు ఇప్పుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ భారత పౌరుడేనా? ఇన్నేళ్లుగా ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందా? వంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు పౌరసత్వం ఉందో లేదో నిరూపించవలసిన బాధ్యత ఎవరిది? పౌరసత్వం లేకపోతే భారతప్రభుత్వం ఏం చేస్తోంది? ఆయన పార్లమెంటు సభ్యుడిగా లోక్ సభలో అడుగుపెట్టి ప్రధానిని వాటేసుకుని ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ విషయం అడగలేదు? ఆయన భారతపౌరుడు కాకపోతే ఆ విషయం నిరూపించి, ఆయన్ను పంపించేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఒక వ్యక్తికి పౌరసత్వం ఉందో లేదో నిరూపించలేని స్థితిలో భారత ప్రభుత్వం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఐదేళ్ళుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే, తాను సాధించిన ప్రగతి గురించి చెబుతుందని అందరూ అనుకుంటారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించిందో చెబుతుందని, ఎంత ప్రగతి సాధించిందో చెబుతుందని భావిస్తారు. కాని బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశం పెట్టి చేసిన గొప్ప పని ఏమంటే రాహుల్ గాంధీ భారత పౌరుడు అవునో కాదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడం. తాను పోటీ చేస్తున్న పూరీలో ఫణి తుఫాను బీభత్సం గురించి భయాలు అలుముకుంటున్నప్పుడు దాని గురిం చి ఒక్క ముక్క మాట్లాడని సంబిత్ పాత్రా రాహుల్ గాంధీ భారత పౌరుడు అవునో కాదో తేల్చాలని పట్టుబట్టాడు. సిటిజన్ షిప్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని సంబిత్ పాత్రా అంటున్నాడు. ఆయన అధికార బిజెపి పార్టీకి అధికార ప్రతినిధి. క్లారిఫికేషన్ కోసం ఆయనే రాహుల్ గాంధీని అడుగుతున్నాడు. ఇదొక విచిత్రం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారంటూ బిజెపి ఎంపి సుబ్రమణ్యం స్వామి చేసిన ఫిర్యాదుకు కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ అంశంలో వాస్తవ పరిస్థితిని వివరించాలని రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, రాహుల్ గాంధీకి బ్రిటీషు పౌరసత్వం ఉందో లేదో నిరూపించడం భారత ప్రభుత్వానికి కష్టమా? ఈ ఆరోపణలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ పిటీషన్ను తిరస్కరించింది.
బ్రిటన్‌లో 2003లో రిజిస్టర్ అయిన బ్యాకప్స్ లిమిటెడ్ అనే సంస్థలో రాహుల్‌గాంధీ ఒక డైరెక్టర్‌గా ఉన్నారని సుబ్రమణ్య స్వామి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌గాంధీ పౌరసత్వంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని 2015లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అదే ఏడాది నవంబర్ 30న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అమితవరాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ వ్యవహారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ వద్దకు కూడా వెళ్ళింది. ఈ ఫిర్యాదును 2016లో ఆమె ఎల్‌కె అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీకి ఇచ్చిన సమాధానంలో రాహుల్‌గాంధీ తనకు ఎప్పుడూ బ్రిటిష్ పౌరసత్వం లేదని, తాను భారతీయుడినేనన్నారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. అసలు రాహుల్ గాంధీ జన్మతః భారతీయుడు కాబట్టి హోంశాఖ ఇచ్చిన నోటీసు పెద్ద ఫార్సు వంటిదని దుష్యంత్ దవే లాంటి సీనియర్ లాయర్లు చెబుతున్నారు. అమేథీలో నామినేషన్ వేసినప్పుడు కూడా ఈ వివాదం వచ్చింది. అక్కడ నామినేషన్ ఆమోదించారు. వాయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. అక్కడ కూడా స్వీకరించారు. రాహుల్ గాంధీకి భారత పౌరసత్వం లేనట్లయితే ఆయన నామినేషన్ ఆమోదించిన రిటర్నింగ్ అధికారులు నేరం చేసినట్లే అవుతుంది. రాహుల్ గాంధీకి ఓటు హక్కు ఇచ్చింది ఎన్నికల సంఘమే.
పౌరసత్వంలేని వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చిన ఎన్నికల సంఘం కూడా బోనులో నిలబడవలసిందే. రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి మాట్లాడే ముందు ఆయన ఓటు హక్కు గురించి కూడా మాట్లాడాలి. కాని రాహుల్ గాంధీ ఓటు హక్కు గురించి బిజెపి నేతలు మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ పదేళ్ళ పాటు పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. ఇందులో ఐదేళ్ళ కాలం ఎన్‌డిఎ అధికారంలో ఉన్నప్పుడే ఎం.పి.గా ఉన్నాడు. ఇంతకాలం ఈ ప్రభుత్వం ఏం చేసింది, బ్రిటన్‌తో మనకు స్నేహ సంబంధాలే ఉన్నాయి. బ్రిటన్‌లో రాహుల్ గాంధీకి పౌరసత్వం ఉందో లేదో బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా? అలాగే దేశంలో పౌరసత్వ వ్యవహారాలు చూసేది ఎవరు? కేంద్ర హోం శాఖే కదా రాజ్ నాథ్ సింగ్. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో హోం మంత్రి. ఈ ఐదేళ్ళ కాలం ఒక పౌరసత్వం లేని వ్యక్తి లేదా అనుమానాస్పద పౌరసత్వం ఉన్న వ్యక్తి లేదా పౌరసత్వం ఉందో లేదో హోం శాఖకు స్పష్టంగా తెలియని వ్యక్తి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? దేశభద్రతకు ప్రమాదం కాదా? ఈ ప్రశ్న భారత ప్రజలు అడగరన్న ధీమా బిజెపి నాయకులది.
ఒక్కసారి గత చరిత్రను గుర్తు చేసుకుంటే, యుపిఎ గెలిచిన మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు సోనియాగాంధీ ప్రధాని అవుతారన్న ప్రచారం జరిగింది. ఆమె విదేశీ వనిత అని విమర్శతో బిజెపి నాయకులు విమర్శలతో హోరెత్తించారు. సోనియాగాంధీ విదేశీ వనిత అనే సమస్య ఎంత తీవ్రరూపం ధరించిందంటే, చివరకు కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. శరద్ పవార్, సంగ్మా, తారిక్ అన్వర్ కాంగ్రెస్ వదిలి కొత్త పార్టీ పెట్టుకున్నారు. అదే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి విదేశీ అనేది నేడు కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. రాహుల్ పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నారని, ఉగ్రవాదులకు బిరియానీ తినిపించే నాయకుడని, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తుకడే గ్యాంగుకు మిత్రుడని జరుగుతున్న ప్రచారం ఒక ప్రతిపక్షనాయకుడిని జాతి వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం. ఇంకా విచిత్రమైన విషయమేమంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని చెబుతున్న సుబ్రహ్మణ్యం స్వామి 2013లో రాహుల్ గాంధీ ఇటలీ పౌరుడని చెప్పాడు. అసలు కన్ఫ్యూజన్, అయోమయం అంతా సుబ్రహ్మణ్యస్వామి సృష్టిస్తున్నారు. సంబిత్ పాత్రా అందుకే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడా? భారతపౌరుడా? ఇటలీ పౌరుడా? సోనియాగాంధీ పౌరసత్వం గురించి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. కోర్టులో ఈ కేసును స్వీకరించి విచారణ కూడా జరిపింది. 1983లో సోనియాగాంధీ భారత పౌరసత్వం స్వీకరించారు. ఆమె నేచురలైజ్డ్ సిటిజన్ షిప్ ద్వారా పౌరసత్వం పొందారు. ఈ కేసును ఉత్తరప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ముంబయి మిర్రర్ పత్రిక ఈ ఆరోపణలపై పరిశోధన చేసింది. సుబ్రహ్మణ్యం స్వామి చెప్పిన బ్రిటన్ అడ్రసులో ఇంతకుముందు బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ సోదరుడు అజితాబ్ బచ్చన్ ఉండేవాడని తెలిసింది. బచ్చన్ కుటుంబం ఒకప్పుడు ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉంది. బ్యాకాప్స్ కంపెనీలో రాహుల్ డైరెక్టర్ గా ఉన్నమాట కూడా వాస్తవమేనని తేలింది. కాని అక్కడ రిజిష్టరైన ఓటరుగా ఆయన పేరు ఎన్నడూ లేదని కూడా తేలింది. అజితాబ్ బచ్చన్ కుటుంబం పేర్లు అక్కడ రిజిష్టర్డ్ ఓటర్ల జాబితాలో గతంలో ఉండేవి. ఇలాంటి మరెన్నో వివరాలు ముంబయి మిర్రర్ బయటపెట్టింది. ఒక పత్రిక ఇన్ని వివరాలు సంపాదించగలిగినప్పుడు, భారతప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నిద్ర పోయింది.

Ariticle on Rahul Gandhi citizenship

The post వారసత్వం నుంచి పౌరసత్వానికి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.