కార్యాచరణే అ.ర.సం. భవిత

  తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) ఆవిర్భవించిన 1943 తరవాత ఒక దశాబ్దానికి కానీ ఆయన జన్మించలేదు. ఆయన నడక నేర్చుకునే నాటికి అ.ర.సం. కార్యకలాపాలు మందగించాయి. మరో పదిహేనేళ్లకు అ.ర.సం. పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటి నుంచీ ఆయనకు ఆ సంఘంతో సంబంధం ఉంది. అది అనుబంధంగా మారింది. జీవితంలో, ముఖ్యంగా సాహితీ రంగ ప్రస్థానంలో విడదీయరాని భాగం అయింది. ఆయన ఆర్.వి. రామారావు. మార్చి 9-,10 తేదీల్లో వరంగల్‌లో జరిగిన అ.ర.సం. మహాసభల్లో తెలంగాణ […]

 

తెలుగునాట అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) ఆవిర్భవించిన 1943 తరవాత ఒక దశాబ్దానికి కానీ ఆయన జన్మించలేదు. ఆయన నడక నేర్చుకునే నాటికి అ.ర.సం. కార్యకలాపాలు మందగించాయి. మరో పదిహేనేళ్లకు అ.ర.సం. పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటి నుంచీ ఆయనకు ఆ సంఘంతో సంబంధం ఉంది. అది అనుబంధంగా మారింది. జీవితంలో, ముఖ్యంగా సాహితీ రంగ ప్రస్థానంలో విడదీయరాని భాగం అయింది. ఆయన ఆర్.వి. రామారావు. మార్చి 9-,10 తేదీల్లో వరంగల్‌లో జరిగిన అ.ర.సం. మహాసభల్లో తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సాహిత్య విమర్శకుడిగా, పత్రికల్లో సంపాదకీయాల రచయితగా, సమకాలీన సామాజిక, రాజకీయ పరిణామాల విశ్లేషకుడిగా ఆర్.వి.ఆర్. గా సుపరిచితుడు. అభ్యుదయ రచయితల సంఘం ఏడున్నర దశాబ్దాల ప్రస్థానం ముగించుని 76వ ఏట ప్రవేశించిన దశలో అ.ర.సం. అధ్యక్షుడు ఆర్.వి.ఆర్.తో మాటా ముచ్చట.

ప్రశ్న: అ.ర.సం. ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉంది. తెలుగు సాహిత్యాన్ని శాసించింది. ఇప్పుడు అంత ప్రభావం ఉందా?

ఆర్.వి.ఆర్: అ.ర.సం. అనేక ఎగుడు దిగుళ్లు ఎదుర్కున్న మాట నిజం. 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఆవిర్భవించిన ఈ సంఘం పుష్కరకాలంపాటు ఉధృతంగా పని చేసింది. ఆ తరవాత మరో పదిహేనేళ్లు స్తబ్దత నెలకొంది. అయితే ఈ మధ్య కాలంలోనూ అభ్యుదయ సాహిత్యం అపారంగా వెలువడింది. అ.ర.సం. ఏర్పడకముందు అభ్యుదయ సాహిత్యం ఉన్నట్టే సంఘం ఉధృతి తగ్గిన తరవాత ఉద్యమ ప్రభావం తగ్గలేదు. ఆ మాటకొస్తే పెరిగింది. 1970లో పునర్నిర్మాణ ప్రయత్నాలు మొదలై 1972-73 నాటికి నిర్దిష్ట రూపం వచ్చింది. ఆ సంవత్సర కాలంలో అభ్యుదయ రచయితల సంఘం పక్షాన 80 పుస్తకాలు వెలువడ్డాయి. ఇది సంఘం ప్రభావమే కదా. అ.ర.సం. వ్యవస్థా రూపానికి పరిమితమయ్యేది కాదు. అది ఒక ఉద్యమం. సంఘ నిర్మాణ స్వరూపంతో సంబంధం లేకుండా ఉద్యమ ప్రకంపనలు కొనసాగాయి. కొనసాగుతాయి. గజ్జెల మల్లా రెడ్డి 1959లో కవితా రచన మొదలు పెట్టే నాటికి అ.ర.సం. క్రియాశీలంగా లేదు. కానీ ఆయన కవిత్వంలో ఆ భావధార ఉందిగా. ఇది ఉదాహరణ మాత్రమే.

సంఘం చురుకుగా లేకపోయినా ప్రభావం ఉంటుందంటారా?

అ.ర.సం., వి.ర.సం., జనసాహితివంటి సంస్థలు కేవలం రచయితల కూటములు కావి. వాటికి ఒక నిర్దిష్ట దృక్పథం, భావజాలం ఉంటాయి. వ్యవస్థాపరంగా ఒడిదుడుకులున్నా ఆ భావం ప్రభావం చూపుతూనే ఉంటుంది. సంఘం ఏర్పాటు చేసినంత మాత్రాన సాహిత్యం వెలువడదు. సంఘం రచయితలను సంఘటితం చేస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది. ఉద్యమ ప్రభావం సంఘం పని చేసినా, తగ్గినా ఉంటుంది.

అ.ర.సం. అప్పటి యువతరాన్ని ముందుండి నడిపించింది. ఇప్పటి యువతరానికి ఆ పేరే తెలియదు. కారణం?

మధ్యలో స్తబ్ధత నెలకొనడమే కారణం. పునర్నిర్మాణం ఫలితంగా యువతరాన్ని ఆకట్టుకుందిగా! మేమంతా ఆ దశలోనే అ.ర.సం. తో క్రియాశీలంగా కలిసి పని చేశాం. ఆ క్రమంలో సవ్యంగా ఆలోచించడం అలవర్చుకున్నాం. మళ్లీ క్రియాశీలంగా లేకపోవడంవల్ల తాజా తరానికి ఆ పేరు తెలియకపోవచ్చు. కాని ఆ ఆలోచనా ధోరణి తెలుసు. ప్రగతి శీల భావాలున్న వారిలో భిన్నాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. ఇతర సంఘాలు ఏర్పడి ఉండవచ్చు. అయితే భిన్న ధోరణి అనుసరిస్తున్న రచయితల సంఘాల విధానాలకు మూలం అరసమే కదా. మార్పు ఉండొచ్చు. కాదనడం లేదు.

ప్రగతిశీల రచయితలు భిన్నమైనదారులు అనుసరించడానికి సిద్ధాంతపరమైన తేడాలే కారణమా?

సమాజాన్ని అవగాహన చేసుకునే క్రమంలోనే సిద్ధాంత విభేదాలు వస్తాయి. అవగాహనా క్రమం సిద్ధాంతంలో తేడాలకు కారణం కావచ్చు. ఇది సహజం. అంతెందుకు అ.ర.సం.లోనే ఈ మార్పు కనిపిస్తుంది. 1943లో తెనాలిలో ఆమోదించిన ప్రణాళిక 1973 గుంటూరు మహాసభ నాటికి మారింది. 2008లో కడప మహాసభలో మళ్లీ కొత్త ప్రణాళిక వచ్చింది. ఇప్పుడు అమలులో ఉన్నది అదే. సమాజంలో మార్పు అనివార్యం కనక దృక్పథమూ మారక తప్పదు.

వి.ర.సం. ఏర్పడ్డ తరవాత అ.ర.సం. దారి మారిందా?

అలా కాదు. అ.ర.సం. పునర్నిర్మాణ యత్నాలు జరుగుతున్న క్రమంలోనే వి.ర.సం అస్తిత్వంలోకి వచ్చింది. అప్పుడే ఆరుద్ర, అనిశెట్టి మొదలైన వారు మరో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేశారు. ఒంగోలులో మహాసభ కూడా నిర్వహించారు. ఆ తరవాత ఆ సంఘం జాడే కనిపించలేదు. ప్రసిద్ధ రచయితలు అందరూ ఆ సంఘంలోకే వెళ్లారు. అక్కడ ఏమీ లేకపోవడంతో మాతృ సంస్థలో చేరారు. వి.ర.సం., జన సాహితి క్రియాశీలంగానే ఉన్నాయి.

ఈ మూడు సంఘాల లక్ష్యంలో తేడాలు లేవు. మరి విభేదాలెందుకు?

ఆ మాట నిజమే. లక్ష్యంలో సామ్యాలే ఎక్కువ. అనుసరించే మార్గంలో కొంత భిన్నత్వం ఉంది. ఉమ్మడి లక్ష్య సాధనకు కలిసి పని చేయడానికి అరసానికి ఏ అభ్యంతరమూ లేదు.

అస్తిత్వవాదం, మైనారిటీవాదం, స్త్రీవాదం మీద అ.ర.సం. వైఖరి ఏమిటి?
ఈ వాదాలన్నింటికీ నిర్దిష్టమైన నేపథ్యం ఉంది. ఈ వాదాల ఛాయలు గతంలో అభ్యుదయ సాహిత్యంలో లేక పోలేదు. ఆ సమస్యలూ అభ్యుదయ రచయితలు ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ వర్గాల అక్షరాస్యత, చైతన్య స్థాయి పెరిగింది. తమ సమస్యలను తామే ప్రస్తావిస్తున్నారు. దీనికి ఎవరైనా ఎందుకు అభ్యంతరపెట్టాలి?
గతంలో నవల మీద ఖమ్మంలో, భాష మీద విశాఖపట్నంలో, సాహిత్య విమర్శ మీద కడపలో అ.ర.సం. సదస్సులు నిర్వహించింది.

అలాంటి కార్యక్రమాలేమైనా చేపడ్తారా?
అ.ర.సం. చేయదగ్గ కార్యక్రమాలు అపారంగా ఉన్నాయి. తప్పకుండా చేస్తుంది. ప్రధానంగా కొత్త తరానికి తెలియజెప్పాల్సిన అంశాలున్నాయి. గతంలో అ.ర.సం. సాహిత్య పాఠశాలలు నిర్వహించింది. దాన్ని పునరుద్ధరిస్తాం.

ఇప్పుడు తెలంగాణలో అ.ర.సం. చురుగ్గా లేదుగా?
అది పూర్తిగా సత్యం కాదు. వరంగల్ శాఖ క్రియాశీలంగానే ఉంది. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. మిగతా చోట్ల కూడా చెదురుమదురుగా కొనసాగుతున్నాయి. జిల్లా శాఖలను ఏర్పాటు చేసి క్రియాశీలం చేయడం ప్రస్తుత కర్తవ్యం. ఆ పని త్వరలోనే చేస్తాం.

కొత్త తరం రచయితలను అ.ర.సం. వైపు ఆకర్షించే కార్యాచరణ ఏమైనా ఉందా?
సంఘం చురుగ్గా ఉంటే అది సులభ సాధ్యమే. నేటి తరం రచయితలలో చాలా మంది అభివ్యక్తి బ్రహ్మాండంగా ఉంటోంది. కొందరి సామాజిక దృక్పథంలో తేడాలు ఉండవచ్చు. ఆ లోటు పూడ్చడానికి ప్రయత్నిస్తాం. రచయిత పిండి ముద్ద కాదు. అందరికీ అభిప్రాయాలుంటాయి. వాటిని సరైన దిశకు మళ్లించడమే అ.ర.సం కర్తవ్యం. అప్పుడు యువ రచయితలు ఆకర్షితులవుతారు.
అ.ర.సం.లో మీరు సుదీర్ఘ కాలంగా ఉన్నారు. పెద్ద తరాన్ని దగ్గరగా చూశారు. ఆ అనుభవం చెప్పండి.

అ.ర.సం. పునర్నిర్మాణ దశలోనే మాలాంటి వాళ్లం సాహిత్య రంగంలోకి వచ్చాం. అ.ర.సం. ప్రభావమే లేకపోతే మేం సవ్యంగా ఆలోచించగలిగే వాళ్లం కాదేమో. రాంభట్ల కృష్ణ మూర్తి, గజ్జెల మల్లా రెడ్డి, బూదరాజు రాధా కృష్ణ, రారా,ఏటుకూరి ప్రసాద్ తో నిరంతర సంబంధాలు మా తరానికి బాగా ఉపయోగపడ్డాయి. చాసో, ఆవంత్స సోమసుందర్, రోణంకి అప్పలస్వామి, బొల్లిముంత శివరామ కృష్ణ, శెట్టి ఈశ్వర రావు లాంటి అనేకమందితో సాన్నిహిత్యం మా తరాన్ని దిద్ది తీర్చింది. అదే మాకు ఎడ్యుకేషన్. అంపశయ్య నవీన్, కేతు విశ్వనాథ రెడ్డి, జాతశ్రీ వంటి వారు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించేవారు. ఈ జాబితా చాలా పెద్దది.

మీరు సాహిత్య విమర్శ రంగంలోనే ఎక్కువ కృషి చేశారు. అది అరసానికి ఉపయోగపడ్తుందా?
సాహిత్య విమర్శ సాహిత్య రంగానికి ఉపయోగపడాలి. ఏ మేరకు ఉపయోగపడ్తుందో ఆ పని చేసేవాళ్ల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సద్విమర్శ ఉత్త మ సాహిత్యానికి దోహదం చేస్తుంది. రా.రా., కె.వి.ఆర్. లాంటి చాలా మంది అలాగే ఉపయోగపడ్డారు.

దేవులపల్లి కృష్ణ శాస్త్రిలాంటి వారికీ అ.ర.సం.తో సంబంధం ఉండేది కదా?
1946లో రాజమండ్రి మహాసభకు ఆయనే అధ్యక్షులు. కాకినాడలో విద్యార్థి సమాఖ్య మహాసభ జరిగినప్పుడు ఆయన ‘విప్లవం‘ అనే గేయం రాశారు. అంతెందుకు విశ్వనాథ సత్యనారాయణ కూడా కొన్ని సార్లు సమాజాభ్యుదయాన్ని కోరే సాహిత్యం సృజించారు. అభ్యుదయోద్యమ ప్రభావం అలాంటిది మరి. సామాజిక ఆర్థిక పరిస్థితులు సవ్యంగా ఆలోచించగలిగే వారందరినీ ప్రభావితం చేస్తాయి.

జాతీయ స్థాయిలో 1936లో అ.ర.సం. ఏర్పడ్డనాటి పరిస్థితులు ఇప్పుడూ కనిపిస్తున్నాయి కదా!
అవును. మొదటి ప్రపంచ యుద్ధం సృష్టించిన కల్లోలం 1930 నాటి ఆర్థిక మాంద్యానికి దారి తీసింది. అప్పుడే జర్మనీలో హిట్లర్ నాజీయిజం, ఇటలీలో ముస్సోలినీ ఫాసిజం పడగ విప్పాయి. అవి సాహిత్యకళా రంగాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాయి. ‘సంస్కృతి అన్న ఒక్క మాట చెవిని సోకుటాలస్యం దానంతట తుపాకీని తడుముతుంది నా హస్తం‘ అన్నాడు హిట్లర్ సర్వసేనాని గెహ్రింగ్. ఈ ఉన్మాదాన్ని ఎదిరించి సాహిత్య కళా రంగాలను పరిరక్షించుకోవడానికే అ.ర.సం., ప్రజా నాట్యమండలి ఆవిర్భవించాయి. ఇప్పుడు దేశంలో అలాంటి ఫాసిస్టు విష సర్పమే బుసలు కొడ్తోంది. దీన్నుంచి కళాసాహిత్య రంగాలనే కాక ప్రజాస్వామ్యాన్నీ రక్షించుకోవలసిన బాధ్యత ఉంది. ఆ లక్ష్య సాధనకు అ.ర.సం. నిబద్ధమై ఉంటుంది.

ఇప్పుడు యువతరానికి అరసాన్ని ఎలా దగ్గర చేయబోతున్నారు?

దీనికి మా కార్యాచరణే ప్రధానం. మనమే నిష్క్రియాపరంగా ఉంటే ఎవరినీ దగ్గరకు చేర్చుకోలేం. క్రియాశీలంగా వ్యవహరిస్తే ప్రభావం సహజంగానే ఉంటుంది. ఆ పని చేయాలన్నదే నా సంకల్పం.

Arasam Telangana writers were elected president

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: