ఎపిలో ‘దిశ’ చట్టానికి ఆమోదం

Andhra-Assembly

అత్యాచార కేసుల్లో ఉరిశిక్ష
మహిళల రక్షణ కోసమే చట్టం

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళల రక్షణకు ‘ఎపిదిశ’ చట్టానికి శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలను. నేరాలను అరికట్టడంతోపాటు దోషులకు మరణ శిక్ష విధించే విధంగా ఎపి క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ప్రకారం రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు.

‘దిశ’ చట్టంలో ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే ఎపి రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా అత్యాచార కేసుల్లోని దోషులకు మరణదండన విధించేలా చట్టం రూపొందించారు. అత్యాచారాలకు పాల్పడినట్టు తేలితే తప్పనిసరిగా మరణశిక్ష విధిస్తారు. నిర్భయ చట్టంలో అత్యాచారాలకు జైలు శిక్ష కూడా ఉంది. కానీ దిశ చట్టంలో మహిళలపై అత్యాచారాలకు కఠినమైన రీతిలో మరణశిక్షకు మాత్రమే చోటిచ్చారు
నిర్భయం చట్టం ప్రకారం- 2 నెలల్లో దర్యాప్తు పూర్తై, మరో 2 నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈ రెండూ పూర్తికావాలి.
దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదించారు. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టైతే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూర్తై శిక్ష పడాలి.
అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచుతున్నాం. కేంద్రం చేసిన “పోక్సో” చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనసీం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు.
అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ తీసుకు వచ్చారు.

సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపిసి ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అయితే ఈ చట్టం ద్వారా- మెయిల్, సోషల్ మీడియాద్వారా గాని, డిజిటల్ విధానంలో కానీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టైతే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపిసిలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు. ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని కాని, జిల్లాకు ఒకటి ఎక్కడా లేదు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు.
అత్యాచార, లైంగిక నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని, ఎపి రాష్ట్రం పరిధిలో కేవలం 3 నెలలకు తగ్గించారు.
జిల్లా స్థాయిల్లో డిఎస్‌పి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసేందుకు ఈచట్టంద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.
మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాల నమోదు కోసం ఓ డిజిటల్ రిజిస్టర్ ఉంటుంది. దీనిద్వారా నేరస్తుల వివరాలను ప్రజలకు తెలియజేస్తారు. వారి పేరు ఏంటి, వారు ఏం నేరం చేశారనేది ప్రజలకు తెలుస్తుంది. కేంద్రంలో కూడా ఇలాంటి డిజిటల్ వ్యవస్థ ఉన్నా వ్యక్తుల పేర్లను, వారు చేసిన నేరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు.
దిశ చట్టంలో సామాజిక మాధ్యమాల్లో చోటుచేసుకునే వేధింపులకు సంబంధించిన నేరాలకు కూడా శిక్షలు నిర్ధారించారు. ఇప్పటివరకు సోషల్ మీడియా వేధింపులకు స్పష్టమైన శిక్షలంటూ లేవు. ఇప్పుడు మహిళలను సోషల్ మీడియాలో వేధిస్తే మొదటి తప్పునకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పునకు నాలుగేళ్లు శిక్ష విధిస్తారు

ఎపి సిఎంకు దిశ తండ్రి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దిశ తండ్రి, ఆమె సోదరి కృతజ్ఞతలు తెలిపారు. ఎపిలో ‘దిశ’ చట్టాన్ని తీసుకు వచ్చినందుకు అభినందించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు పడాలని దిశ తండ్రి ఆకాంక్షించారు. ఇదే తరహా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, ఇందుకు ఎపిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా దిశ హత్యాచారం నేపథ్యం లో మహిళలపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి దిశ చట్టాన్ని తీసుకు వచ్చింది. ఎపి శాసనసభ శుక్రవారం దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణ దండనను శిక్షగా విధిస్తుంటే రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా అత్యాచారం చేసినవారికి ఉరిశిక్ష వేసి దోషులను కఠినంగా శిక్షించాలని భావిస్తోంది.

Andhra Assembly passes Disha Bill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎపిలో ‘దిశ’ చట్టానికి ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.