అభినవ శ్రవణుడికి ఆనంద్ మహీంద్ర అపురూప కానుక!

Anand Mahindra

 

బెంగళూరు: దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలన్న 70 ఏళ్ల మాతృమూర్తి కలను నెరవేర్చడానికి స్కూటర్‌పై తల్లితో కలసి 48,100 కిలోమీటర్ల తీర్థయాత్ర సాగిస్తున్న డి కృష్ణకుమార్ సంకల్ప బలానికి వేలాదిమంది నెటిజన్లే కాదు ఆటోమొబైల్ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం ముగ్ధులయ్యారు. కృష్ణకుమార్ తీర్థయాత్రకు సంబంధించి నాంది ఫౌండేషన్ సిఇఓ మనోజ్ కుమార్ బుధవారం ఉదయం ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌కు ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. మనోజ్ కుమార్ షేర్ చేసిన వీడియో ప్రకారం కృష్ణకుమార్ తన తల్లితో కలసి తీర్థయాత్రలు చేయడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టారు. 20 ఏళ్ల క్రితం నాటి బజాజ్ చేతక్ స్కూటర్ వెనుక సీటులో తల్లిని కూర్చోపెట్టుకుని ఆయన దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.

మైసూరులో నివసించే కృష్ణకుమార్ తల్లి చూడరత్నకు భర్త జీవించి ఉన్నంతకాలం ఇంటి గుమ్మం దాటి కాలు బయటపెట్టి ఎరుగదు. కర్నాటకలోనే ఉన్న హంపిని చూడాలన్నది ఆమె చిరకాల వాంఛ. అయితే ఆ భాగ్యం కూడా ఆమెకు దక్కలేదు. తండ్రి మరణానంతరం తన తల్లికి దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను చూపించాలని కృష్ణకుమార్ భావించారు. అందుకోసం తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కూడబెట్టిన డబ్బుతో తల్లిని తీసుకుని ఆయన స్కూటర్‌పై తీర్థయాత్ర చేపట్టారు. వారి యాత్ర గడచిన ఏడు నెలలుగా సాగుతోంది. స్కూటర్‌పై తల్లిని వెనుక కూర్చోపెట్టుకుని కృష్ణకుమార్ దేశమంతటా తిరుగుతున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలను వారు చూనేశారు. చేతిలో ఉన్న డబ్బును పొదుపుగా ఖర్చుపెట్టుకుంటూ, రాత్రిళ్లు సత్రాలు, మఠాలలో బస చేస్తూ వారు యాత్ర సాగిస్తున్నారు.

హోటళ్లలో భోజనం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను సైతం తమతోపాటే వారు తీసుకెళుతున్నారు. ఈ కథ విని చలించిపోయిన మహీంద్ర మోటార్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తల్లి కోర్కెను నెరవేర్చడానికి ఇంతలా శ్రమిస్తున్న కృష్ణకుమార్‌కు ఒక బహుమతిని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ ఇదో అందమైన కథ. తల్లిని ప్రేమించే కుమారుడి కథే కాదు దేశాన్ని ప్రేమించే కథ..ఆ వ్యక్తిని నాతో సంప్రదింపచేయగలిగితే అతనికి ఒక మహీంద్ర కెయువి 100 ఎన్‌ఎక్స్‌టిని బహుమతిగా ఇవ్వదలిచాను. ఈ కారులో అతను తన తల్లితో కలసి తదుపరి యాత్రను కొనసాగించవచ్చు అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర ప్రకటించిన బహుమతి పట్ల నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆనంద్ మహీంద్రను నెటిజన్లు కొనియాడుతూ ట్వీట్లు చేస్తున్నారు.

 

Anand Mahindra offers car to Mysuru Man, Krishna Kumar takes mother on pilgrimage on scooter which got the attention of Anand Mahindra

The post అభినవ శ్రవణుడికి ఆనంద్ మహీంద్ర అపురూప కానుక! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.