ఒక అద్భుత కథ

Ammu Nair Book

 

అమ్మూ నాయర్ అనే మళయాళ రచయిత్రి ఇంగ్లీషులో రాసిన A Brief Hour of Beauty (2013) అనే సమ్మోహనీయమైన ఈ గ్రంథాన్ని చదవగానే అవశ్యం తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యాలనే కోరిక కలిగింది అనువాదకురాలు స్వర్ణ కిలారి గారికీ, ఆమె సహచరుడు దిలీప్ గారికీ. దాదాపు ఆరేళ్లపాటు తపసులాగా ఈ పుస్తకాన్ని అనువదించి, ప్రచురణకి అనుమతులు సంపాదించి, మూల చిత్రలేఖనాలు రంగుల్లో మనకి అందించాలనే పట్టుదలతో ఎంతో వ్యయ ప్రయాస కోర్చి మనకి కానుక చేశారీ అద్భుతమైన పుస్తకాన్ని.

గుస్టావ్ క్లింట్ (18621918) మనకు తెలుసు. ఆధునిక ఐరోపీయ చిత్రకారుల్లో అత్యంత ప్రభావశీలుడైన చిత్రకారుల్లో ఒకడు. ఇప్పుడు మనం మరొక క్లింట్ డుగురించి తెలుసుకోబోతున్నాం. ఎడ్మండ్ థామస్ క్లింట్ (19761983) భారతదేశం కన్నబిడ్డ. పట్టుమని ఏడేళ్లు కూడా నిండకుండానే ఈ లోకాన్ని వీడి దివికేగిన తేజస్వి. ఆరున్నరేళ్ల ప్రాయంలోనే దాదాపు పాతిక వేలకు పైగా చిత్రలేఖనాలు, వర్ణచిత్రాలు, కొన్ని కవితలు, అసంఖ్యాకమైన స్ఫూర్తిదాయకమైన సంభాషణలు, జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయిన ఒక సృజనకారుడు.

ఇప్పుడు మీరా పిల్లవాడి జీవిత కథ చదవబోతున్నారు. నేనింత దాకా చదివిన సాహిత్యంలో ఇంత ఆశ్చర్యకారకమైన కథ, ఇంత అద్భుతమైన కథ ఏదీ ఇప్పటి దాకా చదవలేదు. ఇంత అల్లుకుపోయి, కను తెరిచి కనుమూసేటంతలో అదృశ్యమైపోయిన ఇంత విషాదమయ గాథ కూడా నేనింత దాకా చదివి ఉండలేదు.

అమ్మూ నాయర్ అనే మళయాళ రచయిత్రి ఇంగ్లీషులో రాసిన A Brief Hour of Beauty (2013) అనే సమ్మోహనీయమైన ఈ గ్రంథాన్ని చదవగానే అవశ్యం తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యాలనే కోరిక కలిగింది. అనువాదకురాలు స్వర్ణ కిలారి గారికీ, ఆమె సహచరుడు దిలీప్ గారికీ. దాదాపు ఆరేళ్లపాటు తపసులాగా ఈ పుస్తకాన్ని అనువదించి, ప్రచురణకి అనుమతులు సంపాదించి, మూల చిత్రలేఖనాలు రంగుల్లో మనకి అందించాలనే పట్టుదలతో ఎంతో వ్యయ ప్రయాస కోర్చి మనకి కానుక చేశారీ అద్భుమైన పుస్తకాన్ని.

ఎడ్మండ్ థామస్ క్లింట్ కేరళలో కొచ్చిలో ఒక సాధారణ దిగువ మధ్య తరగతి క్రైస్తవ కుటుంబంలో జన్మించిన బాలుడు. అందరిలాగే అతడు కూడా పుట్టాడు. పెరిగాడు. బహుశా, జీవితం అనుకూలించి ఉంటే, పెరిగి పెద్దవాడై ఎంతో కొంత ఉన్నత విద్య అభ్యసించి ఏదో ఒక వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడి ఉండేవాడు. కాని, కేరళలోగాని, భారతదేశంలోగాని, ఆ మాటకొస్తే ప్రపంచంలోగాని, ఆ ఈడు బాలబాలికలెవరికీ లభించని అదృష్టం ఆ పిల్లవాణ్ణి వరించింది. చిత్రకళ ఒక ఉప్పెనలాగా ఆ పసి హృదయం తలుపు తట్టింది. ఆ చిన్ని గుండె ఆ సృజనోద్వేగానికీ, ఆ సృజనోత్సాహానికీ అల్లల్లాడి పోయింది. అతడు చూశాడు, విన్నాడు. ఊహించాడు. కలలుగన్నాడు. కన్నదీ, విన్నదీ, కలగన్నదీ ప్రతి ఒక్కటీ చిత్రించాడు. చిత్రించాడు. చిత్రిస్తూనే ఉన్నాడు. ఆ చిత్ర లేఖనాల్లో కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. వాటిని చూడండి.

చిత్రలేఖనంలో రెండు విభాగాలూ, రేఖాచిత్రణ, వర్ణ చిత్రణ, రెండింటి నమూనాలూ కూడా మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. అవి చిన్న పిల్లవాడు గీసిన బొమ్మలేగాని, వాటిలో పసిదనపు నైర్మల్యంతో పాటు, అత్యంత పరిణతుడైన చిత్రకారుడి కౌశల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే, ఆ చిత్రాలు చూసిన ప్రతి ఒక్కర్నీ నిశ్చేష్టుల్ని చేస్తూ వచ్చింది. ఒక రేఖాచిత్రాన్ని చూసి పరిణత రేఖాచిత్రమని చెప్పడానికి ఆరు లక్షణాలు చూస్తాం. మొదటిది, ఆ చిత్రకారుడికి ఆ రేఖ మీద ఆ గీత మీద ఎంత పట్టు ఉందీ అనేది. సిద్ధుడైన చిత్రకారుడు గీసే గీత తెంపులేకుండా, వణుకు లేకుండా, నిబ్బరంగా ఉంటుంది. దాన్ని మనం confident line అంటాం. పికాసో గీతలు అట్లా ఉంటాయి. ఆ గీతలు చాలా వేగంతోనే కాక ఒడుపుతో కూడా ఉంటాయి. ఇందులో క్లింట్ గీతలు చూడండి. ఏ గీత చూసినా, బలిష్టుడూ, ఆత్మవిశ్వాసం కలిగిన ఒక యువకుడు గీసిన గీతల్లాగా కనిపిస్తాయి. రెండవది దృశ్య ప్రపంచాన్ని ఒక బొమ్మగా చిత్రించడానికి పూనుకున్నప్పుడు, ఏ వివరాల్ని పట్టుకుంటే, బయటి వస్తువుకు కాగితం మీద ప్రాతినిధ్యం లభిస్తుందో ఆ వివరాలు మటుకే పట్టుకోవడం, తక్కినవాటిని వదిలిపెట్టగలగడం. చిత్రకళ నిజానికి తీసుకురావడం కన్నా ఎక్కువగా వదిలిపెట్టడానికి సంబంధించింది. ఆ క్లుప్తత, స్పషత తెలిసినవాణ్ణే మనం పరిణత చిత్రకారుడంటాం. క్లింట్ గీసిన ఎనో చిత్రలేఖనాల్లో ఆ పొదుపు, ఒకటి రెండు గీతల్లోనే ఒక వస్తు రూప స్వభావాన్ని చూపించగలిగే ఆ నేర్పు మనల్ని అబ్బురపరుస్తాయి.

మూడవది, కూర్పు. మూడు కొలతలు కలిగిన కాగితం మీద ఒక చిత్రలేఖనాన్ని గీస్తున్నప్పుడు, ఆ కాగితమ్మీద ఉన్న ఖాళీ స్థలాన్ని ఆ చిత్రకారుడు ఎలా ఒక కొలిక్కి తీసుకువస్తున్నాడు, గీసినదాన్ని గియ్యకుండా వదిలిన ఖాళీ స్థలాన్ని ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానిస్తున్నాడు అనేది దానికదే గొప్ప కళ. ఏ గొప్ప చిత్రలేఖనమైనా అన్నిటికన్నా ముందు గొప్ప కూర్పు కావాలి. ఆ కూర్చగలిగే ఒక దృష్టి, పెర్‌స్పెక్టివ్ క్లింట్ చిత్రలేఖనాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాలుగవ లక్షణం పరిశీలన. ఒన దృగ్విషయాన్ని చిత్రిస్తున్నపుడు, ఒకటో రెండో కీలక వివరాల్ని ఇవ్వడం ద్వారా చిత్రకారుడు మనకి ఆ వస్తు, రూపాల ఉనికిని సజీవంగా స్ఫురింపచెయ్యగలగాలి. క్లింట్ చిత్రలేఖనాల్లో ఆ సామర్థం అనితరసాధ్యంగా ఉంది. ఒక కొంగనో, చేపనో, గుడ్లగూబనో చిత్రిస్తున్నప్పుడు ఒక చిన్న గీత ద్వారా, వంపు ద్వారా, చుక్క ద్వారా అతడు చిత్రించిన ఆ చూపులు చూడండి. అది మామూలు సామర్థం కాదు.

అయిదవ లక్షణం ఊహాశబలత. ఇంగ్లీషులో మనం ఇమేజినేషన్ అంటామే అది. ఆధునిక చిత్రకళ conceptual. ఆధునిక చిత్రకారుడు చిత్రించే ఆకృతులు బయటి ప్రపంచంలో కనిపించేవి కావు. అవి అతడి అంతరగంలో ప్రాణం పోసుకుంటాయి. క్ల్లింట్ గీసిన ఎన్నో బొమ్మలు అతడు విన్న పురాణ కథల నుంచే ప్రాణం పోసుకున్నాయి. కాని, ఆ పురాణాలు మనం మామూలుగా విని ఊకొట్టే పురాణాలు కావు. మన పురాణ గాథలు ఏ అంతరంగంలో పురుడు పోసుకున్నాయో ఆ సామూహిక అంతశ్చేతన, అవ్యక్తమానసాల్లోకి క్లింట్ యథేచ్చగా పోయిరాగలిగాడనడానికి ఆ చిత్రాలు సాక్షమిస్తున్నాయి. అందుకనే మనకు తెలియని పురాణ కథల్ని కూడా అతడు ‘దర్శించగలిగాడు’. చిన్ని కృష్ణుడు బాలగణపతికి లడ్డు తినిపించిన దృశ్యం అట్లా పుట్టుకొచ్చిందే. ఏ తెయ్యం చిత్రకారుడూ పూర్తిగా చిత్రించడానికి సాహసించని ముచిలోత్తు భగవతి అమ్మవారి చిత్రాన్ని క్లింట్ సంపూర్తిగా చిత్రించగలగడానికి అదే కారణం.

ఇక చివరి లక్షణం గొప్ప చిత్రకారుడు తన చిత్రలేఖనాల్తో మన కోసమొక ప్రత్యేక జగత్తుని ఆవిషరించగలుగుతాడు. కొన్ని వక్రరేఖల్లో అతడు చిత్రించిన వాస్తవ, అవాస్తవ చిత్రలేఖనాలు మనకు పరిచితమైన ప్రపంచాన్ని చూపిస్తూనే దాని ద్వారా మరొక మహానీయమైన లోకాన్ని అస్పష్టంగానో, సుస్పష్టంగానో పరిచయం చేస్తాయి. ఈ పుస్తకంలో, క్లింట్ గురించిన జీవిత విశేషాలేవీ చదవకుండా, కేవలం, మొదటి నుంచి చివరి దాకా, ఇందులోని బొమ్మలు చూసుకుంటూ పోయినా కూడా మన కళ్ళముందొక సజీవ ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. మనకెందుకనో ఆ లోకం ఆత్మీయంగా ప్రేమించదగ్గదిగా గోచరిస్తుంది.

ఇక చిత్రలేఖనంలోని రెండవ భాగమైన వర్ణ లేపనానికి కూడా పై లక్షణాలన్నీ వర్తిస్తాయి. వాటితో పాటు, వర్ణ సంయోజనంలోని ప్రతిభ అదనం. క్లింట్ వర్ణ సంయోజన పద్ధతుల గురించి ఈ పుస్తకంలో ఎన్నో వివరాలున్నాయి. రంగుల్ని రంగుల పళ్ళెంలో కాకుండా నేరుగా కాగితం మీదనే కలపడం, నీళ్లతో పలచ బరచకుండా ట్యూబు నుండి నేరుగా చిత్రలేఖనం మీద పుయ్యడం, స్థూలాకృతి లేదా ఔట్ లైన్ ఏదీ గీసుకోకుండానే నేరుగా వర్ణలేపనానికి పూసుకోవడం వంటివన్నీ గొప్ప శక్తిమంతులూ, సాహసవంతులూ అయిన కళాకారులు మాత్రమే చేపట్టడానికి సాహసించే ప్రయోగాలు. క్లింట్ సాహసి. కాబట్టే, అతడి రంగులు అంత ప్రకాశమానంగా, అంత నిర్మలంగా గోచరిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రలేఖనాల్నీ, ఈ వర్ణ చిత్రాల్నీ చూసిన తరువాత మనకి ప్రతిభ బహుశ పూర్వజన్మ సుకృతమేమో, అది మానవీయ సమర్థనల్ని దాటిన ఒక అతీత దైవిక భూమికకు సంబంధించిన అంశమేమో అనే అనుమానం కలగకుండా ఉండదు. కానీ, క్లింట్ ప్రతిభా జీవితకథలో దైవదత్తమెంత ఉందో మానవ నిర్మితం కూడా అంతే ఉంది. నిజానికి ఇది parenting కి సంబంధించిన ఒక నీతి కథ కూడా. తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ తమ చేతుల్లో పెరుగుతున్న పసికూనలు చూపించే ప్రతిభను ఎట్లా గుర్తు పట్టాలో, ఎట్లా పెంచిపోషించుకోవాలో, ఎట్లా పరిరక్షించుకోవాలో చెప్పే కరదీపిక కూడా. ఈ అంశంలో ఈ కథ నుంచి మనలో ప్రతి ఒక్కరం నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఇది ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ, ప్రతి ఉపాధ్యాయుడు చదవవలసిన కథ కూడా.

క్లింట్ గురించిన అపురూపమైన సంగతులెన్నో చెప్తూ, ఒకచోట, రచయిత్రి ఇలా ప్రశ్నించింది :
‘క్లింట్ ఇంతగా ఆరాధింపడటానికి, పాపులర్ కావడానికి కారణం ఏమిటి? కేవలం అతను బాలమేధావి అవడం ఒక్కటే కారణం కాదు. అతనిలో ఉన్న సున్నితమైన హాస్యమా? లేక అతనిలోని విషయ స్పష్టతనా? ముక్కుసూటితనమా? తనపై తనకున్న ఆత్మవిశ్వాసమా లేక అతనికి గల గాంభీర్యతా లేక అతని పెద్దపెద్ద కళలోతుల్లోనుండి మెరిసే జ్ఞానమా?’
ఇందుకు సమాధానం, ఈ పుస్తకంలోనే మరొక చోట కనబడింది నాకు.

ఈ వృత్తాంతం చదవండి :
‘చర్చికి వెళ్ళేవాళ్ళు దయచేసి నిలబడండి ‘క్లాసులో ఉన్న పిల్లల్ని అడిగింది క్లింట్ టీచర్ ఒకరోజు. క్లింట్ మిగతా వాళతో పాటు నిలబడ్డాడు.
‘గుడికి ఎవరు వెళ్తారు? అడిగింది టీచర్.
మొదటి గ్రూపు వాళ్లు నిలబడ్డప్పుడు, కూర్చున్నవాళ్లు లేచినిలబడ్డారు. క్లింట్ వాళ్ళతో పాటు మళీ నిలబడ్డాడు.
టీచర్‌కు తెలుసు, ఆ క్లాస్‌లో ముస్లిం పిల్లలు ఎవరూ లేరని. అయినా అడిగింది.
‘మసీదుకు వేళ్ళేవాళ్ళు ఎవరు?’
ఈ సారి క్లింట్ మాత్రమే లేచి నిలబడ్డాడు.
ఈ కథ ఒక అపురూపమైన బాల ప్రతిభామూర్తి కథ మాత్రమే కాదు, అతణ్ణి కంటికి రెప్పలాగా కాచుకున్న ఒక కుటుంబం కథ మాత్రమే కాదు. మతాల సరిహద్దుల్ని దాటిన ఒక యథార్థ మానవుడి కథ కూడా.
బహుశా ఇందుకేనేమో, ఈ పిల్లవాడి జీవిత కథ నాకు మరోసారి అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివినట్టుగా అనిపించింది. ఈ పుస్తకం చదివాక మీకు కూడా అనిపిస్తుంది.

Ammu Nair Written by A Brief Hour Of Beauty

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒక అద్భుత కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.