అమిత్ షా రాజీనామా చేయాలి

 

అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లదే బాధ్యత: సోనియా

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లూసి) సమావేశానికి అధ్యక్షత వహించిన సోనియాగాంధీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ హింస పక్కాగా ప్లాన్ చేసిన కుట్ర అని మండిపడ్డారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ హింసాకాండలో 20 మంది మరణించగా 200 మందికి పైగా గాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నతస్థాయి నిర్ణాయక వ్యవస్థ సిడబ్లూసి ఢిల్లీ పరిస్థితిపై చర్చించి, ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జరుగుతున్న దానికి కేంద్రం, ఢిల్లీ సర్కార్ సమాధానమివ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అసహ్యకరమైన రాజకీయాల్ని తిప్పికొట్టమని, సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఈ మూడు సంఘటనల్లో తలెత్తిన విభేదాలు సమసిపోయేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ‘విధి నిర్వహణలో పూర్తి వైఫల్యంవల్లే ఇలా జరిగింది. దీనికి కేంద్రమే ముఖ్యంగా హోంమంత్రి బాధ్యత వహించాలి. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’ అని సోనియా గాంధీ తీర్మానాన్ని చదువుతూ డిమాండ్ చేశారు.
వారెక్కడ, ఏం చేస్తున్నారు?
‘కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ సిఎం ఎక్కడ? ఆదివారం నుంచీ ఏం చేస్తున్నారు? …అని ఆమె నిలదీశారు. పరిస్థితి చేయిదాటిందని అర్థమైన తర్వాత కూడా అదనపు భద్రతా బలగాల్ని ఎందుకు పిలిపించలేదని సూటిగా ప్రశ్నించారు. ద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఆప్ ప్రభుత్వం కూడా…
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఢిల్లీ ఆప్ సర్కార్‌ను కూడా తూర్పార పట్టారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేయని ఢిల్లీ సర్కార్‌కు కూడా ఇందులో సమాన బాధ్యత ఉందని ఆరోపించారు. రెండు ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే ఈ ఘోర విషాదానికి కారణమన్నారు. బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా చేసిన ప్రకటన కూడా నగరంలో హింసను ప్రేరేపించిందని సోనియాగాంధీ ఆగ్రహించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నాయకులు చేసిన ద్వేషపూరిత ప్రసంగాల్లోనే ఇది బయటపడిందన్నారు. సమావేశం తర్వాత …రాష్ట్రపతి భవన్ దాకా ర్యాలీగా వెళ్లి పరిస్థితిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మెమొరాండం ఇవ్వాలని అనుకున్నారు కానీ, గురువారంనాడు తమతో సమావేశానికి రాష్ట్రపతి సమయం ఇచ్చారు కాబట్టి వాయిదా వేసుకున్నారు.

Amit shah should resign for delhi violence: Sonia Gandhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అమిత్ షా రాజీనామా చేయాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.