‘ట్రంప’రితనం

     ‘నీ కంట్లో నా వేలు, నా నోట్లో నీ వేలు’ అనేదే అమెరికా వైఖరి. అది రాజకీయమైనా, వాణిజ్యమైనా, మరే రంగమైనా ఇతర దేశాలతో దానిదెప్పుడూ ‘మా ఇంటికొస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావు’ అనే ఏకపక్ష వైఖరే. తన స్వార్థానికి బయటి దేశాల ప్రయోజనాలు బలి కావలసిందే, అందుకు ఎదురు తిరిగే దేశాలపై అకారణ యుద్ధం లేదా తీవ్రమైన ఆంక్షల విధింపు. చైనాతో సుంకాల పెంపు వాణిజ్య యుద్ధం చేస్తూ […] The post ‘ట్రంప’రితనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     ‘నీ కంట్లో నా వేలు, నా నోట్లో నీ వేలు’ అనేదే అమెరికా వైఖరి. అది రాజకీయమైనా, వాణిజ్యమైనా, మరే రంగమైనా ఇతర దేశాలతో దానిదెప్పుడూ ‘మా ఇంటికొస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమి ఇస్తావు’ అనే ఏకపక్ష వైఖరే. తన స్వార్థానికి బయటి దేశాల ప్రయోజనాలు బలి కావలసిందే, అందుకు ఎదురు తిరిగే దేశాలపై అకారణ యుద్ధం లేదా తీవ్రమైన ఆంక్షల విధింపు. చైనాతో సుంకాల పెంపు వాణిజ్య యుద్ధం చేస్తూ తాజాగా దానిని మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించిన అమెరికా ఇండియా మీద కూడా అదే బెదిరింపును సంధించింది. తమ హార్లే డేవిడ్‌సన్ మోటారు సైకిళ్లపై అనుచితంగా 100 శాతం కస్టమ్స్ సుంకాలను ఇండియా వసూలు చేస్తున్నదని గగ్గోలు పెట్టిన అమెరికన్ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వాటిని 50 శాతానికి తగ్గించే వరకు ఊరుకోలేదు. ఆ తర్వాత విస్కీ మీద, కాగితం దిగుమతుల మీద అపరిమిత సుంకాలు విధిస్తోందని భారత్‌పై ట్రంప్ గజ్జె కట్టి గంతులేయడం ప్రారంభించాడు. బ్లాక్‌మెయిల్‌కు సమకట్టాడు.

మంగళవారంనాడు ప్రధాని మోడీని కలుసుకున్న అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రాస్ కూడా ఇదే స్వరం వినిపించాడు. భారత దేశం వాణిజ్య ఆంక్షలకు పాల్పడుతోందని ఆరోపించాడు. పచ్చ కామెర్ల కళ్లకు లోకమంతా అదే రంగులో కనిపిస్తుంది. భారత పౌరుల ఆర్థిక తదితర కీలక సమాచారాన్ని దేశం దాటి పోనివ్వకుండా ఇండియా అడ్డుకుంటోందని రాస్ వేలెత్తి చూపించాడు. ఏ దేశ పౌరులకూ గోప్యత ఉండకూడదని, ఆ సమాచార మంతా తమ గుప్పెట్లోకి రావాలని అమెరికా కోరుకోడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. సుంకాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం చైనాను చాలా కాలం క్రితమే ప్రత్యేక లక్షంగా చేసుకున్నది. చైనా నుంచి అమెరికా పలు రకాల సరుకులను భారీగా దిగుమతి చేసుకొని దానికి ఆర్థిక దాసురాలయింది. 2018లో చైనా నుంచి అమెరికా 540 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకోగా అందుకు ప్రతిగా దానికి 120 బిలియన్ డాలర్ల కిమ్మత్తు ఎగుమతులను మాత్రమే చేయగలిగింది.

చైనాతో అమెరికా వాణిజ్యలోటు ఆ ఏడాది 419 బిలియన్ డాలర్లు. దాని నుంచి తాము దిగుమతి చేసుకొనే 200 బిలియన్ డాలర్ల వస్తువులపై 25% సుంకాలను బిగిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. అలా చేస్తే ఆ మరుక్షణమే తాము సైతం అని చైనా ప్రతి హెచ్చరిక చేసింది. చైనా నుంచి ఉక్కు తదితర దిగుమతులపై గత ఏడాది అమెరికా సుంకాలు పెంచడంతోనే అటునుంచి సోయాబీన్ దిగుమతులకు బీజింగ్ స్వస్తి పలికింది. పెట్రోలియం నిక్షేపాల వంటి ఆయా దేశాల సిరుల మీద పట్టు సాధించి అంతర్జాతీయ స్థాయి బందిపోటు తనానికి అలవాటు పడిపోయిన అమెరికా వస్తూత్పత్తి, తయారీ రంగాలలో ఏనాడో వెనుకబడిపోయి దివాళా తీసింది. చైనా నుంచి కీలకమైన ఉత్పత్తులన్నింటినీ దిగుమతి చేసుకుంటూ పరాధీన స్థితికి చేరుకున్నది. ఇది అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బ తీసింది. ఇప్పటికీ భారత, చైనా దేశాల నుంచి వెళ్లే అధిక విద్యావంతులే అమెరికాలో విలువైన సేవలు అందించి అక్కడి సంపద వృద్ధికి తోడ్పడుతున్నారు.

అమెరికాలోని బహుళ జాతి తదితర బడా కంపెనీలు అక్కడి ఉద్యోగులకు ఇచ్చుకొని తీరాల్సిన భారీ వేతనాలు, ఇతర సదుపాయాలకు భయపడి చౌక కార్మికులు లభించే ఇండియా, చైనా వంటి దేశాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనా మీద, భారత్ పైనా వాణిజ్య యుద్ధానికి ట్రంప్ దుస్సాహసిస్తే అది అమెరికాను భవిష్యత్తులో తీవ్ర నష్టానికి గురి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన క్రీడ. ట్రంప్ వాణిజ్య సమర ధ్వనులకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే వారిని దారుణంగా నిరుత్సాహపరుస్తున్న ట్రంప్ తాజాగా హెచ్1బి వీసాల దరఖాస్తుల ఫీజును పెంచాలని నిర్ణయించి ఇతర దేశాల కంపెనీల ప్రయోజనాలను దెబ్బతీయ దలిచాడు.

బయటి వారు అమెరికా సంపదను కొల్లగొడుతున్నారనే తప్పుడు అవగాహనను తన దేశస్థులలో కల్పించడం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ లాభపడదామనే దుర్బుద్ధితో ఆయన చేస్తున్నదే ఇదం తా. కాని ఇందుకు అమెరికా ముందు ముందు ఎంతో మూల్యాన్ని చెల్లించుకోవల్సి వస్తుంది. ఈ ఇంగితం ట్రంప్‌లో కలగాలని కోరుకుందాం. ఇరాన్ నుంచి ఎవరూ చమురు కొనుగోలు చేయరాదని ఆంక్ష విధించిన అమెరికా వాణిజ్య పరిమితులను ప్రయోగిస్తున్నదని ఇండియా మీద అకారణంగా విరుచుకుపడడంలోని విడ్డూరం ఇంతా అంతా కాదు. విశ్వమంతా ఒక కుగ్రామమని, హద్దులనేవి చెరిగిపోయాయని చాటుకుంటున్న ప్రపంచీకరణ రోజుల్లో అమెరికా స్వీయ రక్షణల వ్యవస్థ వైపు మళ్లడం శోచనీయం.

America Trade war with China

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘ట్రంప’రితనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: