సాయంకాలం స్నాక్స్

వంకాయ చిప్స్

కావల్సినవి: పొడుగు వంకాయలు – మూడు, ఉప్పు – తగినంత, నూనె – చెంచా, మిరియాలపొడి – అరచెంచా,

తయారీ: వంకాయల్ని చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. తరువాత ముక్కలకు ఉన్న తడి తుడిచి మిరియాలపొడి, ఆరిగానో, నూనె కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటసేపు బేక్ చేసుకుని తీసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కల్ని ముందు వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడీ, చల్లుకోవాలి. ఇలా చేసుకున్న చిప్స్ సాస్‌తో బాగుంటాయి.

ఆలూ..

కావల్సినవి: బంగాళాదుంపలు – మూడు, మైదా – అరకప్పు, ఎండుమిర్చి గింజలు – చెంచా, కసూరీమేథీ – అరచెంచా, చాట్‌మసాలా – ముప్పావుచెంచా, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
తయారీ: బంగాళాదుంపల్ని కడిగి.. తుడిచి పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అరచెంచా ఉప్పు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు మరిగాక బంగాళాదుంప ముక్కల్ని వేయాలి. అవి ముప్పావు వంతు ఉడికాక దింపేసి నీళ్లు వంపేయాలి. అవి తడిలేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని కలపాలి. అందులో బంగాళాదుంప ముక్కల్ని ముంచి.. కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. కావాలనుకుంటే పైన కొద్దిగా ఉప్పు చల్లుకోవచ్చు. వీటిని పిల్లలకు స్నాక్స్‌లా ఇవ్వొచ్చు.

అరటికాయ చిప్స్

కావల్సినవి: అరటికాయ – ఒకటి, పసుపు – పావు చెంచా, ఉప్పు – తగినంత, మిరియాలపొడి – తగినంత, నూనె – చెంచా.
తయారీ: ముందు అరటికాయ చెక్కు తీసి సన్నగా చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పూ, పసుపు కలిపిన నీటిలో వేయాలి. ఐదు నిమిషాల తరవాత నీళ్లలోంచి తీసేసి.. తడి ఆరనిచ్చి మరికొంచెం ఉప్పూ, మిరియాలపొడి చల్లి బాగా కలిపి.. బేకింగ్ ట్రేలో పరచుకోవాలి. 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట సేపు బేక్ చేయలి. అయితే పదిహేను నిమిషాల తరవాత తిరగేయాలి. లేదంటే నూనెలో వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడి చల్లుకోవాలి. ఈ చిప్స్ సాస్‌తో తింటే బాగుంటాయి.

మొక్కజొన్న చిప్స్ 

కావల్సినవి: మొక్కజొన్నపిండి – కప్పు, ఉప్పు – తగినంత, దంచిన మిరియాల పొడి – అరచెంచా, బేకింగ్ పౌడర్ – పావు చెంచా, నూనె – తగినంత.
తయారీ: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ కలుపుకోవాలి. ఈ పిండిని చిన్నచిన్న చపాతీల్లా వత్తుకుని త్రికోణాకృతిలో కోసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇది సాస్‌తో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాయంకాలం స్నాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.