ప్రేమ, సస్పెన్స్‌తో ‘అలా జరిగింది’

Ala-Jarigindaiమహేష్‌కుమార్, మంజీర హీరోహీరోయిన్లుగా  వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై ఎన్.రవికుమార్ రెడ్డి నిర్మించిన  ‘అలా జరిగింది’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం టీజర్, ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి సాయి వెంకట్ టీజర్‌ను ఆవిష్కరించగా… నిర్మాత తల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.అనసూయదేవి పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ “ఈ చిత్రం పాటలు చాలా బావున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ “ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. నిత్యజీవితంలో అలా జరిగింది అనే మాటను ప్రతి చోట వింటూనే ఉంటాము. కథకు అనుగుణంగా ఉంటుందని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సాయం చేయబోయిన కథానాయకుడు ఓ ఆరోపణకు గురైనప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్న అంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో మంచి సందేశం కూడా ఉంటుంది. సినిమాలో నేను ఓ ప్రధాన పాత్ర పోషించాను. ఈనెల 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం”అని అన్నారు. నిర్మాత ఎన్.రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ “ఓ మంచి కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు మహేష్‌కుమార్, మంజీర, సత్యారెడ్డి, నవనీత్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.