17న ఎజిఆర్ బకాయిలు చెల్లిస్తామన్నాయ్

Airtel, Vodafone Idea

 

కఠిన చర్యల నుంచి తప్పించుకునేందుకే
ఎయిర్‌టెల్, వొడాఐడియాలు సమాచారమిచ్చాయి : డాట్ అధికార వర్గాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి ఎజిఆర్(సర్దుబాటు స్థూల ఆదాయం) చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పడంతో టెలికాం కంపెనీలు డబ్బును సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. టెలికాం విభాగం(డాట్) నుంచి కఠిన చర్యలను తప్పించుకునేందుకు గాను భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలిసర్వీసెస్ల్ ఈనెల 17(సోమవారం) నాటికి ఎజిఆర్ బకాయిలను చెల్లించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. రూ.1 లక్ష కోట్ల బకాయిలను మూడు టెలికాం కంపెనీలు చెల్లించాల్సి ఉండగా, పాక్షికంగానే చెల్లిస్తామని డాట్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘సోమవారం నాటికి బకాయిలు చెలిస్తామని ఎయిర్‌టెల్, వొడాఐడియా, టాటా టెలిసర్వీస్‌లు చెప్పాయి. వారి చెల్లింపులను చూసిన తర్వాత డాటా తగిన చర్యలు చేపడుతుంది’ అని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఎయిర్‌టెల్ ఫిబ్రవరి 20 నాటికి రూ.10 వేల కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఎలాంటి గడువు పెంపును ఇవ్వలేదని డాట్ అధికారులు తెలిపారు.

ఎజిఆర్ బకాయిలను చెల్లిస్తామంటూనే వొడాఐడియా వ్యాపారం కొనసాగించే విషయమై ఆందోళన వ్యక్తం చేసింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఆదేశాల ప్రకారం, టెలికాం కంపెనీలు అంతా దాదాపు రూ.1.47 లక్షల కోట్ల ఎజిఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపునకు గడువు జనవరి 23వ తేదీ. కానీ జియోతో సహా ఏ కంపెనీ కూడా బకాయిలు చెల్లించలేదు. బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా చెల్లింపులు చేయలేదు. సంబంధిత అధికారుల సమాచారం ప్రకారం, ఎయిర్‌టెల్ లైసెన్స్, స్పెక్ట్రమ్ యుసేజ్ చార్జీలతో కలిపి మొత్తం ఎజిఆర్ రూ.35,586 కోట్లు చెల్లించాలి. ఇక వొడాఫోన్ ఐడియా బకాయిలు రూ.53 వేల కోట్లు, దీనిలో రూ.24,729 కోట్లు స్పెక్ట్రమ్, రూ.28,309 కోట్లు లైసెన్స్ ఫీ ఉన్నాయి. మరో సంస్థ టెలికాం సర్వీసెస్ రూ.13,800 కోట్లు, బిఎస్‌ఎన్‌ఎల్ రూ.4,989 కోట్లు, ఎంటిఎన్‌ఎల్ రూ.3,122 కోట్లు ఎజిఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

విఫలమైతే టిఎస్‌పి బ్యాంక్ హామీ రీడీమ్
స్పెక్ట్రం, లైసెన్స్ చార్జీలను చెల్లించడంలో విఫలమైతే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టిఎస్‌పి) బ్యాంక్ హామీని రీడీమ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. స్పెక్ట్రం వినియోగ చార్జీలు, లైసెన్స్ ఫీజులపై గత ఏడాది అక్టోబర్ 24న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకోవచ్చు.

Airtel, Vodafone Idea, Tata Teleservices To Pay AGR Dues

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 17న ఎజిఆర్ బకాయిలు చెల్లిస్తామన్నాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.