కర్తార్‌పూర్‌కు దారి!

Sampadakiyam     భారత, పాకిస్థాన్‌ల మధ్య పేరుకుపోయిన సమస్యల కొండకు, అమిత్ర వాతావరణానికి ఎక్కడ ఏ కొంచెం బీటవారి రెండు దేశాల మధ్య సమ్మతికి ఏ చిన్న సందు ఏర్పడినా సంతోషించవలసిందే. కర్తార్‌పూర్ కారిడార్‌పై ఒప్పందం కుదరబోతుండడాన్ని అటువంటి ఒక మంచి పరిణామంగా పరిగణించవచ్చు. ఈ విషయంపై సరిహద్దుల్లోని వాఘా వద్ద రెండు దేశాల అధికారుల మధ్య ఆదివారం నాడు జరిగిన రెండో విడత చర్చలు దాదాపు ఫలప్రదమైనట్టు వార్తలు చెబుతున్నాయి. తన భూభాగంలో గల అతి పవిత్ర సిక్కు మందిరం కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను వీసాలు అక్కర లేకుండా సందర్శించడానికి రోజుకు 5000 మంది భారత యాత్రికులను అనుమతించడానికి పాకిస్థాన్ అంగీకరించడం ఆనందదాయకం.

మౌలిక సదుపాయాల కొరత కారణంగా మొదట్లో రోజుకు 500 నుంచి 700 మందిని మాత్రమే అనుమతిస్తానని చెప్పిన పాకిస్థాన్ అందుకు పది రెట్లు యాత్రికులు సురక్షితంగా కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించడానికి ఒప్పుకోడం గమనార్హం. మామూలు రోజుల్లో దినానికి 5000 మందిని, ప్రత్యేక సందర్భాల్లో అదనంగా 10,000 మందిని రానివ్వాలని భారత్ కోరింది. కర్తార్‌పూర్‌కు వేయబోయే మార్గంలోకి భారత వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా చూస్తామని కూడా పాక్ హామీ ఇచ్చింది. భారత యాత్రికులు అక్కడికి చేరుకోడానికి రావి నది మీదుగా నడక దారిని నిర్మిస్తానని మొదట్లో చెప్పిన పాకిస్థాన్ ఆ తర్వాత శాశ్వత వంతెన నిర్మాణానికి అంగీకరించడమూ హర్షించదగినది. సిక్కుల విశ్వాసాలపరంగా కర్తార్‌పూర్ గురుద్వారాకు విశేష ప్రాధాన్యమున్నది.

సిక్కు మత ప్రథమ గురువు గురు నానక్ దీనిని రావి నది కుడి తీరంలో 1504లో నెలకొల్పినట్టు చరిత్ర చెబుతున్నది. ఆ విధంగా మొట్టమొదటి సిక్కు సమాజం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రూపుదిద్దుకున్నది. అదే విధంగా ఆ నది ఎడమ తీరంలో డేరా బాబా నానక్ ఏర్పడింది. దేశ విభజన సమయంలో కర్తార్‌పూర్ సహా కుడి ఒడ్డున గల షకర్‌గఢ్ తాలూకా పాకిస్థాన్‌కు వెళ్లింది. ఎడమ ఒడ్డున గల గురుదాస్‌పూర్ తాలూకా భారత్‌కు వచ్చింది. అప్పట్లో భారత్‌లోని సిక్కు యాత్రికులు కర్తార్‌పూర్ గురుద్వారా సందర్శించడానికి వీలుగా రావి నది మీద ఒక వంతెన ఉండేది. 1965 భారత్ పాక్ యుద్ధం లో ఈ వంతెన ధ్వంసమైంది. ఇప్పుడు భారత యాత్రికులు లాహోర్‌కు బస్సులో వెళ్లి అక్కడి నుంచి కర్తార్‌పూర్ చేరుకుంటున్నారు. 125 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు.

మధ్యలో రావి నది లేకపోతే కేవలం 4.7 కిలోమీటర్ల దూరం, గట్టిగా గంటలోపు ప్రయాణం. ఈ నేపథ్యంలో భారత దేశం వైపు నుంచి అక్కడికి సునాయాసంగా వెళ్లడానికి దగ్గరి మార్గాన్ని నెలకొల్పాలనే విషయంపై 1998లో ఇక్కడ అటల్ బీహారీ వాజ్‌పేయి, అక్కడ నవాజ్ షరీఫ్ ప్రధానులుగా ఉన్నప్పుడు మొదటి సారి చర్చలు జరిగాయి. 1999లో వాజ్‌పేయి లాహోర్‌కు బస్సును ప్రారంభించిన తర్వాత కర్తార్‌పూర్ గురుద్వారాకు పాకిస్థాన్ మరమ్మత్తులు చేసి, మెరుగులు దిద్ది సందర్శనకు అనువుగా చేసింది. ఆ తర్వాత సంభవించిన అనేక సానుకూల పరిణామాల పర్యవసానంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి గత ఏడాది నవంబర్ 26న మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మన పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ జిల్లాలోని మాన్ అనే గ్రామం వద్ద పునాది రాయి వేశారు.

రెండు రోజుల తర్వాత ఆ నెల 28న పాకిస్థాన్ వైపు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శంకుస్థాపన చేశారు. ఈ సన్నివేశానికి అప్పటి మన కేంద్ర మంత్రులిద్దరు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చి రెండు దేశాల మధ్య తుది సమ్మతి కుదిరితే కర్తార్‌పూర్‌ను దర్శించుకోడం మన దేశంలోని సిక్కు యాత్రికులకు సులభతరమవుతుంది. అయితే పాకిస్థాన్‌లో తిష్ఠ వేసుకున్న భారత వ్యతిరేక ఉగ్రవాద శక్తుల వల్ల ఈ స్నేహ సంధికి ఏ క్షణంలోనైనా ముప్పు వాటిల్లే ప్రమాదం నిత్యం పొంచి ఉంటుంది. తన భూభాగంలోని ఈ విచ్ఛిన్నకర శక్తులను ఏరి వేయకుండా పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్షం చేస్తున్నదనే అభిప్రాయం నాటుకొని ఉంది.

అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తించింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా వద్ద మన సిఆర్‌పిఎఫ్ జవాన్లు 40 మందిని బలి తీసుకున్న జైషే మహమ్మద్‌కు పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యం చేతిలో కీలు బొమ్మగా ఉన్నందునే ఇటువంటి ఉగ్రవాదులు అక్కడ స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నారనే భావన నెలకొన్నది. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్ర శక్తులను నిర్మూలిస్తేగాని ఇప్పుడు కర్తార్‌పూర్ సందర్భంగా నెలకొంటున్న ఈ మంచి వాతావరణం కలకాలం మన్నదు.

Agreement on Kartarpur Corridor

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కర్తార్‌పూర్‌కు దారి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.