గుట్టు రట్టయిన కల్తీ నూనె వ్యాపారం

Adulterant Oil

 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీనివాస్ ఏజెన్సీలో కల్తీ నూనె వ్యాపారం గుట్టు రట్టయింది. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఆదివారం ఆహార తనిఖీ అధికారులతో కలిసి దాడులు చేపట్టి 4 వేల లీటర్ల నాసిరకం నూనెను స్వాదీనం చేసుకున్నారు. కాల పరిమితి ముగిసిన, నాణ్యత లేని నూనెలను మార్కెట్‌లో మంచి పేరు కలిగిన బ్రాండెడ్ డబ్బాల్లోకి మార్చి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వంట నూనెల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపిస్తున్నట్లు ఇంచార్జీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్రనాథ్ వెల్లడించారు.

ఈ దాడుల్లో వన్‌టౌన్ సీఐ సురేష్, ఎస్సై గునవంత్‌రావు, టాస్క్‌పోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంచార్జీ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ ఏజెన్సీలో నాసిరకం వంట నూనెతో పాటు గడువు ముగిసిన వంట నూనెలను బ్రాండెడ్ కంపెనీల డబ్బాల్లోనింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బులను సంపాదించే ఉద్దేశ్యంతో వ్యాపారస్తులు ఇలాంటి కల్తీలకు పాల్పడుతున్నారన్నారు.

కల్తీ నూనెల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపండం జరిగిందని, ఏజెన్సీపై పుడ్ సేప్టి యాక్ట్ 51, 52 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్సైగుణవంత్‌రావు మాట్లాడుతూ పట్టణంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతుందన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నిఘా పెట్టామని తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీనివాస ఏజెన్సీలో కల్తీ నూనె విక్రయిస్తున్నట్లు ఆందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, పుడ్ ఇన్స్‌పెక్టర్ ఆది వారితో కలిసి దాడులు నిర్వహించామని తెలిపారు. కల్తీ వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యహరిస్తామన్నారు.

Adulterant Oil seized by Food inspection officers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుట్టు రట్టయిన కల్తీ నూనె వ్యాపారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.