‘మా కాలంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది’

Actress Meena comments on Casting couch

గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై వర్ధమాన నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. అవకాశాల పేరుతో తనను వాడుకుని వదిలేశారని ఆమె పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ లో ఆమెపై దుమారం చెలరేగింది. ఇక క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే పలువురు కథనాయికలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు భిన్నంగా స్పందించారు. అది మన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కొందరు చెబితే, మరికొందరు లేదు ఇది నిజంగా పరిశ్రమలో ఉందంటూ స్పష్టం చేశారు. కొత్తగా వచ్చేవారికి మొదట ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదేనంటూ తెలిపారు. తాజాగా సినీయర్ హీరోయిన్ మీనా కూడా ఈ విషయమై మాట్లాడారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక బాధకరమైన అంశమని, మా కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పారు. ఆడవాళ్లను వంకర బుద్ధితో చూసే మగవాళ్లు ఏ రంగంలోనైనా ఉంటారని, అలాంటి వారికి దూరంగా ఉంటే మంచిదన్నారు. ఒక మహిళతో డీల్ చేసేముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని అలాంటి మగవాళ్లు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక అప్పట్లో అగ్రహీరోలందరీతోనూ నటించిన మీనా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ ఇన్నింగ్స్ లోనూ మంచి విజయాలతో ఆమె దూసుకుపోతున్నారు. అయితే, తన కెరీర్ లో ఎంతో మంది అగ్ర హీరోలతో నటించిన అరవింద స్వామి, తమిళ దళపతి విజయ్ లతో నటించలేక పోయానని ఆమె చెప్పుకొచ్చారు.

Comments

comments