రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు…

Road Accidents

 

వరంగల్ : రోడ్డు ప్రమాదాల వలన అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పోలీస్ అధికారుల భాగస్వామ్యంతో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్‌ను పరిశీలించి, సూచికలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

పది రోజులలో ప్రమాద నివారణ చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే డేంజనర్ జోన్స్‌కు 200 మీటర్ల దూరంలో నుండే ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి రోడ్లపై మార్కింగ్‌లు చేయాలని తెలిపారు. గ్రామాల న ఉండి జాతీయ రహదారులపైకి వచ్చే వాహనాల వేగాన్ని నియంత్రించుటకు స్పీడ్ బ్రేకర్లను నిర్మించాలని సూచించారు. అలాగే గ్రామాలలోకి వెళ్లే జంక్షన్‌లు, పాఠశాలలు, కళాశాలలు ఉన్న చోట జాతీయ రహదారులపై వేగ నిరోధకాలు, సూచిక బోర్డులు తప్పనిసరి చేయాలని తెలిపారు. రోడ్డు భద్రత అనేది ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించినది మాత్రమే కాదని, అన్నిశాఖల సమన్వయంతో పనిచేసినపుపడు ప్రమాదాలను నివారించగలుగుతామన్నారు.

జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వెయ్యి బస్సులను పూర్తిగా తనిఖీ చేయాలని ట్రాన్స్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌లేని 30 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థల బస్సులు నడిపేందుకు 50 సంవత్సరాల లోపు ఉన్న డ్రైవర్లను మాత్రమే అనుమతించాలని తెలిపారు. సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్ బస్సులో సిసి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరుతూ యాజమాన్యాలకు ఉత్తర్వుల ప్రతిని పంపాలన్నారు. వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 13 జంక్షన్‌లను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వాహనదారులకు రోడ్డు భధ్రత, ట్రాఫిక్ నిబంధనలపై సందేశాలు పంపనున్నట్లు తెలిపారు.

అలాగే నగరంలో ట్రాఫిక్ నిబంధనలపై ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ మాట్లాడుతూ… జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న జాతీయ, రాష్ట్రీయ, మున్సిపల్ రహదారులలో 30 బ్లాక్‌స్పాట్స్ గుర్తించినట్లు తెలిపారు. 2018లో కమిషనరేట్ పరిధిలో జరిగిన 375 రోడ్డు ప్రమాదాలలో 111 మంది మృతిచెందినట్లు తెలిపారు. 415 మంది గాయపడినట్లు తెలిపారు. ప్రతిప్రాణం విలువైనదేనని, సుప్రీంకోర్టు జారీ చేరసిన నిబంధనలను అమలు చేసేందుకు సహకరించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మూడు నెలలకొకసారి జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులపై చలానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు కారకులైన డ్రైవర్ల లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జైలు శిక్షలు పడుతున్నట్లు తెలిపారు. 2019లో రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదాల సంఖ్యను ప్రతి ఏటా కనీసం 10 శాతం తగ్గించుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామసర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో చర్చించి ఆయాగ్రామాల నుండి వెళ్లే రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సూచిక బోర్డులను నెలకొల్పుతున్నామన్నారు. ఈ సమావేశంలో రవాణ శాఖ డిప్యూటి కమిషనర్ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రవికిరణ్, జాతీయ రహదారుల విభాగం ఈఈ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బి ఈఈ రాజం, ఆర్టిసి రీజనల్ మేనేజర్ రాములు, ట్రాఫిక్ ఎసిపి ఎండి.మజీద్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ హరీష్‌రాజ్, ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Activities to prevent Road Accidents

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.