అరసం ఆసరాగా చందు ఆత్మకథ

 Chandu Subbarao

అనుభవాలు అందరికీ ఉంటాయి కాని అవన్నీ జీవితానుభవాలు కానక్కరలేదు. జీవితానుభవాలే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వృత్తి రీత్యా భూభౌతిక శాస్త్ర ప్రొఫెసర్, ప్రవృత్తివల్ల సాహిత్యోపజీవి అయిన ఆచార్య చందు సుబ్బారావు ఇటీవల ‘అరసంతో అర్ధ శతాబ్ది‘ గ్రంథం వెలువరించారు. ఆయన సాహిత్య కృషి అంతా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తో ముడివడిందే. అలాగని ఈ గ్రంథంలో ఆయన అరసం చరిత్ర రాయలేదు. ఆ పేరుతో తన జీవిత పరిణామ క్రమాన్ని చెప్పారు.
చాలా మందికి పుట్టి పెరిగిన పరిస్థితికి, తరవాత వారి జీవితం రూపుదిద్దుకున్న తీరుకు సంబంధం ఉండదు. అప్పుడే పులి కడుపున మేక పిల్లలు పుడతాయి. జీవన నేపథ్యం ఏమిటి అన్న అంశం మీదే ఎవరి జీవితమైనా ఓ దరికి చేరుకుంటుంది. చందు సుబ్బారావు ప్రగతిశీల భావాలుగలవాడిగా మారడానికి పుట్టి పెరిగిన పరిస్థితి మేలు మాగాణంలా ఉపకరించింది. చందు నానమ్మ కోటమ్మ గాంధీ ఉద్యమ స్ఫూర్తితో గీతాలు రాసిన బొల్లిముంత అక్కయ్యకు చెల్లెలు. అక్కయ్య సాహిత్యాభిరుచి ఉన్న వాడు. అన్న దగ్గర్నుంచే ఆమెకూ సాహిత్యాభిరుచి అబ్బింది. చందు తండ్రి వెంకటకృష్ణయ్య ఉపాధ్యాయుడు. తండ్రి, నాయనమ్మ తెల్లవారుఝాముననే లేచి పద్యాలు పాడే వారు. చందు మేనమామ బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. బాబాయియిలూ ప్రగతిశీల సాహిత్యాభిమానులే. బొల్లిముంతకు అన్న వరసయ్యే వ్యక్తి కుమారుడు బొల్లిముంత నాగేశ్వర రావు చందుకు సహాధ్యాయి. చందు తండ్రి పిల్లలకోసం పండగలు చేయించే వారు కాని దేవుడిమీద విశ్వాసం ఉన్నట్టు కనిపించదు. తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నా దేవుడికి నమస్కరించలేదు. చందు తల్లికి మాత్రం భక్తి గట్రా ఉండేవి.
ఈ సాహిత్య, రాజకీయ వాతావరణమంతా చందును అభ్యుదయ సాహిత్యం వేపు, వామపక్ష రాజకీయాల వేపు లాక్కెళ్లింది. బెజవాడ లయొలా కళాశాలలో బి.ఎస్సీ, చదువుతున్నప్పుడు చందు మొదట్లో ఉన్నది వాళ్లమ్మకు సోదరుడి వరసయ్యె ్రశ్రి రామమూర్తి ఇంట్లోనే. శ్రీ రామమూర్తి సోదరులందరూ కారు డ్రైవర్లు, కండక్టర్లు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. అక్కడ వినిపించినవన్నీ తమ్మిన పోత రాజు, సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, వేములపల్లి శ్రీకృష్ణ, మోటూరి హనుమంతరావు లాంటి అనేకానేక మంది కమ్యూనిస్టుల పేర్లే. సహజంగానే చందు ఆ బాటలోనే ప్రయాణించాడు.
చిన్నప్పటి నుంచి తెలుగు మీద అభిమానం పెంచుకున్న చందు తండ్రి పట్టుదల కారణంగా సైన్సు చదవాల్సి వచ్చింది. హాస్టల్ గదిలోంచి అమ్మాయిలను చూడడానికి ఉబలాటపడడం, సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉండేది. సినిమా రచయితల్లోనూ చందూని ఆకట్టుకుంది వామపక్ష భావాలు, రచనా పటిమ ఉన్న వాళ్లే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టగానే తారసపడింది చిన్ననాటి మిత్రుడు నరసింహా రావు వామపక్షవాదే. ఎమ్మెస్సీ భూభౌతిక శాస్త్రం చదవాలని సూచించిందే అతనే. విశాఖపట్నంలో చందూను ఆకర్షించిందీ పురిపండా అప్పల స్వామి, శ్రీ శ్రీ, ఆరుద్య, తల్లావఝల శివ శంకర శాస్త్రి, పూసపాటి కృష్ణం రాజు, అల్లం శేషగిరి రావు, కాళీ పట్నం రామారావువంటి వారే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతకు ముందున్న మహామహుల పేర్లూ చందూను ఉత్సాహ పరిచినవే. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు‘ నినాదాలే చందూ చెవిన పడ్డాయి. అందుకే ‘విశాఖ నగరం బంగాళాఖాతం చిలికిన నవ్వు…తూర్పు కోస్తా సిగలో పువ్వు‘ అనుకోగలిగాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో చందూని ఎక్కువగా ఆకర్షించింది భూభౌతిక శాస్త్ర పాఠ్య గ్రంథాలు కావు. శ్రీ శ్రీ, ఉన్నవ లక్ష్మీ నారాయణ, ఆవంత్స సోమసుందర్, ఆరుద్ర, బొల్లిముంత శివరామ కృష్ణ, వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి, మహీధర రాసిన గ్రంథాలే. అలాగని అసలు చదువును నిర్లక్ష్యం చేయలేదు.
చందు అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ కృషి చేశాడు. కథలు, నవలలతో పాటు కవిత్వమూ రాశాడు. ‘పద చిత్రాలు లేకుండా పదాలను పేరుస్తున్నవ్…కవిత్వం మానేయటానికి ఏం తీసుకుంటావ్‘ అని మిత్రుడు అదృష్ట దీపక్ అడిగే సరికి కవిత్వం రాయడం మానేశాడు. చందు అరడజనుకు పైగా నవలికలు రాశారు. ఇవన్నీ ‘విద్యార్థుల, నవదంపతుల ప్రేమ కథలే. లెఫ్టిష్ట్ టింజ్ ఉండవచ్చును. అది సరిపోదు‘ అని తానే అంగీకరించాడు. సాహిత్య విమర్శా రంగంలోనూ చందు కృషి ఉంది. అనేక మంది సాహిత్యం మీద తాను చేసిన వ్యాఖ్యలు ఎలా వాళ్లని నొప్పించి, తనను ఇబ్బంది పెట్టాయో కూడా దాచుకోకుండా చెప్పాడు.
సాహిత్య విమర్శ మీద చందూకు అవగాహన ఉంది. విమర్శ అంటే తిట్టిపోయడం, ఖండించడం, దోషాలు చూపించడం మాత్రమే కాదని తెలిసిన వాడే. ‘విమర్శ పరామర్శ కాదు. నిజమే సమీక్ష కాదు…పొగడ్త కాదు. రచయిత కీర్తిని గణించడం కాదు‘ అన్న జ్ఞానం ఉన్న వాడే. ‘…అనవలసిన మాట గట్టిగా అనవచ్చును. దుర్బుద్ధితో గాని వ్యక్తిగత కోపాలతో గాని అనకూడదు. ఈర్ష్యా ద్వేషాలతో విశ్లేషణ పనికి రాదు. అకారణంగా ప్రశంసిస్తే ఆ రచయిత ఒక్కడే సంతోషిస్తాడు. మిగతా వాళ్లు భజన కంపెనీ అనుకుంటారు. పరులను నొప్పింపక-తానొవ్వక రాస్తూ పోతే మిగిలేది బూడిద…కనక ‘చిత్తశుద్ధీ.. త్రాసులో తూకం‘ ఒక్కటే సూత్రంగా భావించాను.‘ అని నిర్దిష్టమైన విమర్శనా సూత్రాలను నిర్దేశించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడే. ‘అనవలసిన చోట గట్టిగా అనాలి లేకుంటే విమర్శ అర్థం ఏమిటి…సారస్వత వివేచన ఏమిటి?‘ అన్న రా.రా. ధోరణి భాగా తలక్కెక్కించుకున్న వాడే.
సాహిత్య విమర్శలో మొదటి బాణాలు ఆవంత్స సోమ సుందర్ మీదే సంధించానని తానే చెప్పుకున్నాడు. ‘ఆయన మీద వేస్తే అందరూ సంతోషించడమే…అదేమనేవాడు లేడు‘ అన్న నోటితోనే ‘అన్నట్లు ఆయన కుమారుడు శశికాంత శాతకర్ణి ఎ.యూ.లో నాకు మిత్రుడవటంతో దూకుడు తగ్గించవలసి వచ్చింది!!‘ అంటాడు. విమర్శా సూత్రాలను గుర్తెరిగీ, రా.రా. వంటి వారి ధోరణే అనుసరించదగింది అని తెలుసుకుని రా.రా.లో ఉన్న దూకుడునే అనుసరించాడు తప్ప సంయమం పాటించలేదు. సోమసుందర్ ను చందు గురువుగా అంగీకరించాడు. ఆయన కుమారుడు మిత్రుడైనంత మాత్రాన అనవలసిన మాటలు అనకుండా వదిలేయాలా అన్న ప్రశ్న వేసుకోకపోతే ఎలా? పైగా అక్కిరాజు ఉమా కాంతం, కట్టమంచి రామ లింగా రెడ్డి, రా.రా. వంటి వారిని ఆదర్శంగా అంగీకరించినప్పుడు మొహమాటాలకు తావివ్వడం విమర్శ స్థాయిని తగ్గిస్తుంది. అప్రయత్నంగానే రాగద్వేషాలు వ్యక్తం అవుతాయి. దూకుడు తగ్గించాలనుకోవడం లోనే గందరగోళ మానసికత ఉంది.

విమర్శకు దూకుడొక్కటే ప్రమాణం కాదు. సంయమం, సదసద్వివేచన అత్యవసరం. ‘సాహిత్యం మిత్ర బృందాల పరస్పర కీర్తనల అంగీకార కార్యక్రమంగా సాగుతుండటం కొంత కారణం. నగ్నమునికి విశాలమైన బృందం వుంది. అలాగే శివా రెడ్డికి…అద్దేపల్లికి ఉంది. నాకూ అరసం సైన్యం వుంది కదా అంటే…వాళ్లెవరూ పట్టించుకోరు. కారణం ‘అరసం‘ గార్లను కూడా వదల్లేదు కదా అన్న పాయింటుతో… బాలాగోపాల్ మీద వ్యాసం‘ రాశానంటాడు. విమర్శ సాహిత్య బృందాలకు, వ్యక్తులకు అతీతంగా ఉండాలన్న ధ్యాస లేకపోతే దారి దూప వలసిన విమర్శకుడే దారి తప్పుతాడు. విమర్శ కేవలం ప్రతిక్రియగా మిగిలి పోకూడదు. మంచిని ఎత్తి చూపడం కూడా విమర్శలో భాగమే. తప్పులు ఎత్తి చూపడమూ అవసరమే. రెండు సందర్భాల్లోనూ మాట తూలనవసరం లేదు. నిక్కచ్చిగా మాట్లాడడం, నిగ్రహించుకోకపోవడం ఒకటి కాదు. అందుకే రంగనాయకమ్మ, బాలగోపాల్, చేకూరి రామారావు, కాళీపట్నం రామా రావు, వెల్చేరు నారాయణ రావు, కేతు విశ్వనాథ రెడ్డి మొదలైన వారి సాహిత్యాన్ని విమర్శించడానికి, విశ్లేషించడానికి బదులు విరుచుకుపడ్డట్టు కనిపించింది. రంగనాయకమ్మ అభిమాని ఒకరు ‘మీరు ఆస్తిక హేతువాదులా…అరసం నాయకులెలా అయ్యారు?‘ అని నిలదీస్తే ‘అవును ఆస్తిక హేతువాదినే…గురజాడలా, కందుకూరిలా… గిడుగులా…శ్రీశ్రీలా…గుడిపాటి వెంకటాచలంలా‘ అన్నాను అని చెప్పుకున్నాడు.

‘శ్రీ శ్రీ నాస్తికుడు‘ అన్నాడట ఆ మిత్రుడు. శ్రీశ్రీ ’ప్రభవ’ లో పద్యాలు ఉటంకించి శ్రీశ్రీలో ఆస్తికత్వానికి రుజువులు చూపించానని చందు సమర్థించుకున్నాడు. ప్రగతిశీల భావాలు ఆస్తిక నాస్తిక భావాల పరిధికి మాత్రమే లోబడి ఉండవు. ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూనే అభ్యుదయ భావాలు ప్రకటించిన వారు, రచనలు చేసిన వారు ఉన్నారు. అభ్యుదయ భావన ఉండడానికి నాస్తికత్వం మాత్రమే కొలమానం కాకూడదు. ఒక్క ఉదాహరణ చాలు. గిడుగు రామమూర్తి దగ్గర తాపీ ధర్మా రావు చదువుకున్నారు. తాపీలో తిరుగుబాటు ధోరణి చిన్నప్పటి నుంచీ కనిపిస్తుంది. గిడుగు రామమూర్తి విద్యార్థులందరూ బొట్టు పెట్టుకుని రావాలనే వారు. తాపీ ఆ పని చేసే వారు కాదు. అయితే బొట్టు లేని వాడి ముఖం చూసి పాఠం చెప్పను అని గిడుగు వెనక్కి తిరిగి పాఠం చెప్పే వారు. అంతమాత్రం చేత జనం భాషకు పట్టం కట్టిన గిడుగును పురోగమన వాది కాడని కొట్టిపారేయగలమా!?
చందు ఆలోచనా ధోరణిలో లోనే మొదటి నుంచి ఒక గందరగోళం ఉంది. రాజకీయ అభిప్రాయాల్లో ఊగిసలాటా ఉంది. అది అనేక సందర్భాల్లో వ్యక్తమైంది. లిఖిత రూపంలో ఆధారాలు దొరకక పోవచ్చు. కానీ ఆ వైఖరి అనేక సార్లు ఆచరణలో వ్యక్తం అయింది. మనం అభిమానించే పక్షంలో లోపాలు, కుల తత్వాలు దాగి ఉండొచ్చు. అంత మాత్రం చేత అదే దారిలో నడిచి సొంత అస్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించడం ఏ రకంగానూ సమర్థించలేం. చందూకి మంచి వచనం సూటిగా రాయగలిగిన సత్తా ఉంది. వక్తృత్వ పటిమా ఉంది. కానీ అర్థం కాకుండా మాట్లాడితే తప్ప జనానికి అర్థం కాదు అనే భ్రమా ఉంది. వాక్య నిర్మాణం మీద శ్రద్ధ కనిపించడు. ఒక్కో సారి భావ వ్యక్తీకరణ గందరగోళంగా తయారవుతుంది. ‘అరసంతో అర్థ శతాబ్ది‘ గ్రంథంలోనూ వాక్య నిర్మాణం మీద శ్రద్ధ కొరవడింది. వాడుక భాషలో రాయాలన్నది మంచి సూత్రమే కావచ్చు. కానీ మాట్లాడే భాషకు, రాసే భాషకు కొంత తేడా ఉంటుంది. మాట్లాడే భాషకు శాశ్వతత్వం ఉండదు. లిఖిత భాషకు సాపేక్షిక శాశ్వతత్వం ఉంటుంది. ఉపన్యాసానికి, వచన రచనకు తేడా గమనించి, రెండింటి పరిమితుల్ని, పరిధుల్ని గుర్తించి ఉంటే బాగుండేది.
అయితే చందూ ఏనాడూ తిరోగమన వాది కాడు. ప్రగతిశీల శక్తుల గమనంలో లోపాలను చూసి కలత చెందినప్పుడు నొచ్చుకున్న వాడు. దానికి పరిష్కారం తన అస్తిత్వాన్ని చాటుకోవడమే మార్గం అనుకున్నాడు. ఈ లోపాన్ని మినహాయిస్తే చందు వ్యక్తిత్వం, జీవిత సారం నిస్సందేహంగా ప్రగతి పథమే. తన ఆత్మ కథకు అరసంతో అర్ధ శతాబ్ది అని పేరు పెట్టడంలోనే చందు ఆలోచనా పరిధి ఎంత నిఖార్సయిందో అర్థం అవుతోంది. మతతత్వ కారు మేఘాలు కమ్ముకొచ్చి హేతుబద్ధంగా వ్యవహరించే యువత సైతం దారి తప్పుతున్న ప్రస్తుత స్థితిలో చందు లాంటివారి జీవిత విశేషాలు నిస్సందేహంగా చిరుదివ్వెలుగా ఉపయోగపడతాయి.

Acharya Chandu Subbarao is book Arasam tho ardha shatabdi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరసం ఆసరాగా చందు ఆత్మకథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.