ప్రధాని మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ

Abhijeet Banerjee

 

పరిపాలనపై ప్రధాని తన ఆలోచనలు చెప్పారు
మీరు నన్ను ముగ్గులోకి లాగాలని చూస్తారని కూడా చెప్పారు.. ఆయన అన్నీ గమనిస్తున్నారు
మీడియాతో నోబెల్ పురస్కార గ్రహీత

న్యూఢిల్లీ : నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనారు. తనతో సమావేశంలో ప్రధాని పరిపాలనపై తన ఆలోచనలు చెప్పారని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభిజిత్ చెప్పారు. ఇండియన్‌అమెరికన్ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య, ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎస్తేర్ డఫ్లో, అమెరికన్ ఆర్థికవేత్త మైఖేల్ క్రెమెర్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

అభిజిత్ భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై చేసిన వ్యాఖ్యలపై అధికార బిజెపి నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. అభిజిత్ వామపక్ష భావాల వైపు మొగ్గుచూపే ప్రొఫెసర్ అని, ఆయనలాంటి వారి అభిప్రాయాలను భారత ప్రజలను తిరస్కరించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

మరో బిజెపి నేత రాహుల్ సిన్హా అయితే మరో అడుగు ముందుకేసి విదేశీ మహిళలను రెండో వివాహం చేసుకున్న వారికే నోబెల్ పురస్కారం ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్వదేశానికి వచ్చిన అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ఈ సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో ముచ్చటించిన అభిజిత్ ప్రధానితో సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రధాని తనతో మాట్లాడడానికి చాలా సమయం కేటాయించారని అభిజిత్ చెప్పారు. భారత దేశ పరిపాలన గురించి తన ఆలోచనా విధానాన్ని ఆయన వివరించారన్నారు. ‘పాలనలో అధికార యంత్రాంగం మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడానికి ఆయన ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో స్పష్టంగా వివరించారు’ అని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాకు సున్నితంగా చురకలు వేశారు. సమావేశం మొదట్లోనే ప్రధాని తనతో మీడియా మిమ్మల్ని ముగ్గులోకి లాగడానికి ప్రయత్నిస్తుందని చెప్పారన్నారు. ‘ఆయన (మోడీ) టీవీ చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరేమిటో ఆయనకు బాగా తెలుసు. మీరేం చేయబోతారో కూడా ఆయనకు తెలుసు’ అన్నారు. కాగా, మానవాభివృద్ధి సూచీలో భారత్ ర్యాం కింగ్ తక్కువగా ఉండడం గురించి ఓ విలేఖరి అడిగిన ప్రశ్నపై స్పందించడానికి అభిజిత్ నిరాకరించారు.

మరో వైపు ప్రధాని మోడీ కూడా అభిజిత్‌తో తన సమావేశం అద్భుతంగా జరిగిందని, తాము చాలా విషయాలు చర్చించామని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.మానవ సాధికారత కోసం ఆయన ఆశయం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఆయన విజయాలకు భారత దేశం గర్విస్తోందని, భవిష్యత్తులో ఆయన అనుకున్నవి సాధించాలని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. తన అధికార నివాసంలో అభిజిత్‌తో భేటీకి సంబంధించిన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.

Abhijeet Banerjee meets PM Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రధాని మోడీతో అభిజిత్ బెనర్జీ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.