తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8ఏళ్ల బాలుడు…

నిజామాబాద్: సార్ నాన్న కొడుతున్నాడంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన గురువారం  జిల్లాలోని వర్ని మండలంలో చోటు చేసుకుంది. ఈ ఫిర్యాదుతో విస్తుపోయిన వర్ని ఎస్‌ఐ అనిల్‌రెడ్డి బాలుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాల్లోకెళ్తే…వర్ని మండలం వడ్డెపల్లికి చెందిన శివ, రుక్మిణి దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు మహేష్ 3వ తరగతి చదువుతున్నాడు. బాలుడు ఇంటి వద్దే ఆడుకుంటున్న సమయంలో తండ్రి మందలింపుతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.

నాన్న కొడుతున్నాడని ఎస్‌ఐని కలవడంతో ఇతర పోలీసు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆరా తీస్తే గతంలో పలుమార్లు అమ్మనాన్నతో కలిసి బాలుడు పోలీస్‌స్టేషన్ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుటుంబ తగాదాల కారణంగా తరుచూ అమ్మానాన్నలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడం, కుమారుడి ముందే గొడవపడడం, పోలీసులు ఇద్దరినీ సముదాయించి పంపడం బాలుడిని ప్రభావితం చేసినట్లు స్పష్టమైంది. సమస్య వస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్న ఆలోచన బలంగా నాటుకుపోవడంతో బాలుడు తండ్రిపైనే ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావించారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.

8 yrs old boy complaints against his Father

The post తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 8ఏళ్ల బాలుడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.