72కు పడిపోయిన రూపాయి

న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో రూపాయి రోజు రోజుకూ మరింతగా క్షీణిస్తోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి చరిత్రలోనే తొలిసారిగా 72 మార్క్ దిగువకు చేరింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ప్రారంభంలో రూపాయి కాస్త కోలుకుంది. 9 పైసలు పుంజుకుని 71.66 వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో అనిశ్చితులు, చమురు ధరలు […]

న్యూఢిల్లీ: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో రూపాయి రోజు రోజుకూ మరింతగా క్షీణిస్తోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి చరిత్రలోనే తొలిసారిగా 72 మార్క్ దిగువకు చేరింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ప్రారంభంలో రూపాయి కాస్త కోలుకుంది. 9 పైసలు పుంజుకుని 71.66 వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో అనిశ్చితులు, చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో రూపాయి డీలా పడింది. మొత్తానికి 72 మార్క్‌ను దాటి 72.09 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. వెరసి గత ఐదేళ్లలోలేని విధంగా డాలరుతో మారకంలో రూపాయి నెల రోజుల్లోనే 5 శాతం క్షీణించింది. ఏడాది కాలంలో 13 శాతం తిరోగమించింది.

ముడి చమురు ధరలు
ముడిచమురు ధరల పెరుగుదల రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతోంది. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. దీని కారణంగానే జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంచనున్నట్టు సంకేతాలివ్వడమూ ప్రతికూలంగా మారింది. ద్రవ్యోల్బణ నియంత్రణకు క్రమంతప్పని వడ్డీ రేట్ల పెంపు సహకరించగలదని గత వారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. దీంతో డాలరు బలపడుతుంటే, ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వర్ధమాన దేశాల కరెన్సీలు
వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలోనే సాగుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు మరింత బలపడింది. గత ఆరు నెలల్లో వివిధ దేశాల కరెన్సీలతో మారకంలో డాలరు 8 శాతం పెరిగింది. అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతుండగా, మరోవైపు కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్నాయి.