కేంద్ర సిబ్బందికి 5% డిఎ పెంపు

 

 కేంద్ర మంత్రిమండలి నిర్ణయం
 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
 జులై నుంచి వర్తింపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డిఎ) 5 శాతం పెరిగింది. కేంద్ర మంత్రి మండలి బుధవారంనాడు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులకు తెలిపారు. దీనితో దివాలీకి ముందే దేశంలోని 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డిఎ, 65 లక్షల మంది పెన్షనర్లకు డిఆర్ పెరుగుతుంది. ఈ డిఎ పెంపుదల నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ 16,000 కోట్ల అదనపు భారం పడుతుంది. జులై 1, 2019 నుంచే వర్తించే విధంగా ఈ 17 శాతం డిఎ డిఆర్ అమలులోకి వస్తుందని, ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం జరిగినట్లు ప్రకాశ్ జవదేకర్ వివరించారు. మూల వేతనం/ పెన్షన్‌కు అనుగుణంగా ఇప్పుడున్న డిఎ, డిఆర్ పాయింట్లను 5 శాతం పెంచుతున్నట్లు, ధరల పెరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పెంచిన రేటు ఇప్పుడు 17 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆమోదిత ఫార్మూలా మేరకు పెరుగుదల వర్తిస్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం డిఎలో ఒకేసారి 5 శాతం పెరుగుదల నిర్ణయం ఇది తొలిసారి అని, ఇంతవరకూ ఈ మేరకు గత కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి హెచ్చింపులు చేపట్టలేదని వివరించారు. దీపావళి పండుగకు ముందు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు సంబరాలు వెల్లివిరుస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే డిఎ / డిఆర్‌లలో పెరుగుదల కన్పిస్తూ వస్తోంది. అంతుకు ముందు 9 శాతం ఉండగా దీనిని 12 శాతం చేశారు. ఇప్పుడిది 17 శాతానికి చేరుతుంది. పెంపుదల ప్రభావంతో ప్రభుత్వంపై పడే భారం మొత్తం కలిపి రూ 15, 909.35 కోట్ల వరకూ ఉంటుందని , ఇది వార్షికంగా అయ్యే భారం అనితెలిపారు. ఇక 2019 20 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల కాలంలో ఈ అదనపు వ్యయ మొత్తం రూ 10,606.20 కోట్లు అవుతుందని మంత్రి ప్రకటించారు. ఇక డిఎ డిఆర్‌ల పెంపుదల పరంగా చూస్తే డిఎల పెంపుదలతో ఖజానాపై పడే అదనపు భారం రూ 8,590 కోట్లకు పైగా ఉంటుంది. ఇక డిఆర్ పెంపుదలతో అయ్యే అదనపు వ్యయం రూ 7,319 కోట్లకు పైగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు ధరలు, జీవన వ్యయం పెంపుదలకు అనుగుణంగా, వాస్తవికత కోణంలో వారి మూలవేతన లేదా పెన్షన్‌లకు భద్రత దిశలో డిఎ డిఆర్‌ల సవరణ ఉంటుంది. దీనిని జనవరి 1న, జులై 1వ తేదీన ఏడాదిలో రెండు సార్లుగా సవరించడం జరుగుతుంది.
కిసాన్ పథకం ఆధార్ లింక్ పొడిగింపు
దేశంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పరిధిలో లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువు పెంచారు. దీనిని నవంబర్ 30 వరకూ పెంచాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ పథకం పరిధిలో దేశంలోని అర్హులైన రైతులు రూ 6000 మేర ఆర్థిక సాయం పొందేందుకు వీలుంది. దేశంలోని 14 కోట్ల మంది రైతులను ఇప్పటివరకూ ఎంపిక చేసుకుని వారి బ్యాంకు ఖాతాలలోకి రెండు వేల రూపాయల చొప్పున మూడు సార్లు నగదును బదిలీ చేస్తూ కిసాన్ పథకం ప్రకటించారు. అయితే ఈ పథకం వర్తింపునకు ఆధార్ కార్డు తప్పనిసరి అని నిబంధన విధించారు. ఈ గడువు ఆగస్టు నెలాఖరుతో ముగిసింది. దీనిని ఇప్పుడు నవంబర్ చివరి వరకూ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పిఒకె వారికి ప్యాకేజ్ అయిదున్నర లక్షలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) నుంచి తరలివచ్చిన వారికి పరిహారాన్ని కేంద్రం రూ అయిదున్నర లక్షలుగా ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పిఒకెలో ఉండలేని స్థితిలో పారిపోయి వచ్చిన దాదాపు 5,300 కుటుంబాల వారు జమ్మూ కశ్మీర్ వెలుపల తొలుత తలదాచుకున్నారు.తరువాత ఈ కుటుంబాలు కశ్మీర్‌కు చేరాయి. ఈ కుటుంబాల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి పునరావాస, సహాయ కల్పనలో భాగంగా ప్రస్తుత విధానం పరిధిలో ఒకేసారి వర్తించే విధంగా రూ 5.5 లక్షల సాయం వర్తింపచేస్తున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ విలేకరులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయ పునరావాస పథకం ఈ కుటుంబాలకు వర్తిస్తుందని చెప్పారు.

5% DA hikes for Govt Employees

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కేంద్ర సిబ్బందికి 5% డిఎ పెంపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.