రాష్ట్రంలో కొత్తగా 41 కేసులు

New Corona Cases

 

కరోనాతో మరి నలుగురు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందారు. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 19 మంది కోవిడ్‌కు బలి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 53కి చేరుకుంది. ఆదివారం మరో 41 కేసులు నమోదు కాగా, 24 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసిలో పరిధిలో 23 మంది, రంగారెడ్డి జిల్లాలో మరోకరితో పాటు 11 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆరుగురికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1854 చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 1092 పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 709 మంది చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు ప్రకటించారు.

వైరస్ దాడిలో మరో నలుగురు మృతి..
కోవిడ్ వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందారు. జగిత్యాల జిల్లాకు చెందిన 75 ఏళ్ల వ్యక్తికి ఇటీవల వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరణించారు. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన 48 ఏళ్ల మహిళ కరోనాతో చనిపోయారు. ఈమెకు వైరస్ సోకకముందు ల్యూకోమియా సమస్య ఉందని, ఈక్రమంలో వైరస్ దాడిలో మరణం సంభవించిందని అధికారులు నిర్థారించారు. దీంతో పాటు హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించారు. ఈయనకు తీవ్రమైన శ్వాస సమస్య ఉండటం వలనే చనిపోయారని అధికారులు ప్రకటించారు. అంతేగాక 72 ఏళ్ల వయస్సు కలిగిన మరో వృద్ధుడూ కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఇతను కూడా హైదరాబాద్‌కి చెందిన వ్యక్తిగానే అధికారులు ప్రకటించారు. అయితే వైరస్ తీవ్రత తగ్గిందనే భావనలో ఉన్న ప్రజలకు వరుస మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు కేసులు పెరగడం, మరో వైపు మరణాలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో వలస కార్మికులు, విదేశీయులే ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నేటి(సోమవారం) నుంచి ఇతర రాష్ట్రాల వారు సైతం తెలంగాణకు వచ్చే తరుణంలో కేసులు మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైద్యాధికారులు మాత్రం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు.

41 fresh Covid-19 cases in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో కొత్తగా 41 కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.