సైబరాబాద్‌లో 345 డిడి కేసులు

drunk-and-drive

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 345మంది వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్ర, శనివారం నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. వారికి బ్రీత్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న తేలింది. వెంటనే వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని కోరుతున్నా ఉన్నత విద్యావంతులే మద్యంతాగి వాహనాలను నడుపుతున్నారని అన్నారు. కొందరు వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా వాహనాలను నడుపుతున్నారని తెలిపారు.

వాహనాలను వేగంగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదని, హెల్మెట్ పెట్టుకోవడంలేదని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్‌గా మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారని అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని జిఎంఆర్ ఎరినాలో జరిగిన ఫంక్షన్‌లో పాల్గొన్న వారు మద్యం తాగి వాహనాలు నడిపారని, అందులో చాలామందికి లైసెన్స్ కూడా లేదని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇది వారికి మిగతా వాహనదారుల భద్రత కోసం ముఖ్యమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ప్రోత్సహించవద్దని కోరారు.

బైక్ రైడర్లే ఎక్కువగా…

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువ మంది మోటార్ సైకిల్‌దారులు ఉన్నారు. రెండు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో 212మంది బైక్ రైడర్లు పట్టుబడ్డారు. త్రీవీలర్లు 12మంది, ఫోర్ వీలర్లు 117మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డవారిలో 21 నుంచి 30ఏళ్ల వారు 206మంది ఉండగా, 31నుంచి 40 ఏళ్ల వారు 86మంది ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్, రాజేంద్రనగర్, శంషాబాద్, గచ్చిబౌలి, షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులకు తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 92మంది వాహనదారులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో ఐటి ఉద్యోగులు 41మంది, కూలీ పనిచేసుకునే వారు 41మంది, విద్యార్థులు 33మంది, ప్రభుత్వ ఉద్యోగులు 4, డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

345 drunk and drive cases in Cyberabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సైబరాబాద్‌లో 345 డిడి కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.