మరో భారీ థర్మల్

Thermal Power

 

సూర్యాపేట జిల్లాలో 300 మెగావాట్ల ప్రాజెక్టు
రూ.2,160 కోట్లు పెట్టడానికి ముందుకొచ్చిన నెక్‌వెల్ కంపెనీ
చింతలపాలెం మండలం వెల్లటూర్ వద్ద రానున్న కర్మాగారం
ఒక్కొక్కటి 150 మెగావాట్ల కెపాసిటీతో 2 యూనిట్లు, 332 ఎకరాల్లో ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో మరో భారీ విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రం రాబోతోంది. సూర్యాపేట జిల్లాలో సుమారు రూ.2,160 కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెక్వెల్ కంపెనీ ముందుకు వచ్చింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మెక్వెల్ కంపెనీ ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామ ర్థం తో రెండు యూనిట్లతో ఉన్న ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) ప్రకారం 332 ఎకరాలలో ఏర్పా టు చేస్తారు.

ఈ డిపిఆర్‌నుఇప్పటికే సదరు కంపెనీ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదిం పు అథారిటీకి సమర్పించింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే పర్యావరణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమే వాడుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద నున్న 220 కెవిఎ ట్రాన్స్ ఫార్మార్ ద్వారా ఈ విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి దశ ప్రాజెక్టును అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే పూర్తి చేస్తారు. రెండవ దశను మూడు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు.

ఈ మొత్తం ప్రాజెక్టులో 12 నిర్మాణ ఒప్పందాలు, సాంకేతిక ఒప్పందాలు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ను ఏడాదికి ఆరు శాతంగా లెక్కించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి, అంతర్జాతీయ బొగ్గు అమ్మకందార్ల నుంచి ఏడాదికి 2.01 మిలియన్ టన్నులను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ బొగ్గు రవాణాకు సింగరేణి నుంచి మేళ్లచెర్వు రైల్వేస్టేషన్ ద్వారా ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కు తొలి ఏడాది లో కిలో వాట్ కు రూ.4.82 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నిర్వహణ ఖర్చు రూ.3.20 కోట్లు గా అంచనా వేస్తున్నారు.

300 MW private power project mooted at Suryapet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మరో భారీ థర్మల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.