ఎకోఫ్రెండ్లీ వినాయకుడు

 21 types of jute bag offering an online aaradhya company

ఆన్‌లైన్‌లో అందిస్తున్న ఆరాధ్య స్థాపకుడు

వినాయకుడి పూజకు అవసరమైన మట్టి విగ్రహంతోపాటు 18 రకాల పూజాసామగ్రిని, 21 రకాల పత్రిని  జ్యూట్ బ్యాగ్ ద్వారా భక్తులకు అందిస్తోంది ఆరాధ్య ఆన్‌లైన్ సంస్థ.  ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.  పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఈ సేవలనందిస్తోన్న వేణుగోపాలస్వామితో సకుటుంబం ముచ్చట్లు..

పూజకు అవసరమయ్యే పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, అక్షంతలు, కర్పూరం, కంకణం, వస్త్రం, యజ్ఞోపవీతం, సాంబ్రాణి, దీపాలు, నూనె, వత్తులు, తేనె, పంచదార, ఆవునెయ్యి, గంగాజలం, అగరుబత్తి, తాంబూలం, పాలవెల్లి, కొబ్బరికాయ, పూజా విధానం పుస్తకం ఈ కిట్‌లో లభిస్తాయి.  పూజా కిట్‌ను పొందాలంటే www.aaradhyakit.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839 వాట్సాప్ నంబరును సంప్రదించవచ్చు. 

ప్రకృతిలో మమేకమవుతూ జరుపుకునే పండుగ వినాయక చవితి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ, గణేశుని అత్యంతభక్తిశ్రద్ధలతో కొలుస్తుంటాం. ఉద్యోగస్తులకు వినాయక పత్రిని సేకరించడం చాలా కష్టమైన పని. చాలా మందికి పత్రి ఎన్ని రకాలో, అవేంటో కూడా పెద్దగా అవగాహన ఉండదు. వాటి ప్రాముఖ్యత కూడా తెలియకపోవడంతో మార్కెట్‌లో దొరికే నాలుగైదు రకాల పత్రినే తెచ్చుకుని పూజిస్తుంటారు. సంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా గణపతి పూజా కిట్‌ను ఆరాధ్య ఆన్‌లైన్ కంపెనీ స్థాపకుడు లంకొత్తు వేణుగోపాలస్వామి అందిస్తున్నాడు.

నాకు చిన్నప్పటినుంచీ వినాయక చవితి పూజ చేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నేనే స్వయంగా వినాయకుడి విగ్రహం తయారుచేసుకునేవాడిని. పత్రిని చెట్ల నుంచి సేకరించేవాడిని. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌కు వచ్చి ఆరేళ్లు అవుతోంది. అంతకుముందు మా ఆఫీసులో వినాయక చవితి పండుగ చేసుకునేవారు కాదు. దీంతో నేను ఏదో మిస్సవుతున్నట్లు అనిపించేది. అప్పటి నుంచి ప్రతి వినాయక చవితికి ఊరి పొలిమేరల్లో బంక మట్టిని సేకరించి ప్రతిమను తయారుచేసి ఆఫీసులో పెట్టి పూజించడం మొదలుపెట్టాను.

ఆరాధ్య ఆలోచన ఎలా వచ్చిందంటే… మార్కెట్‌లో దొరికే పత్రి చాలా వరకు రోడ్డుపక్కన ఏది పడితే అది తెంపి అమ్మేస్తుటారు. ఏదో ఏడెనిమిది రకాలే దొరుకుతాయి కానీ 21 రకాలు ఉండటం లేదు. అంతా కమర్షియల్ అయిపోయింది. ప్రతి దాంట్లో మోసమే. ఇదంతా నా కొలీగ్స్ ద్వారా తెలుసుకున్నాను. అసలు పండుగపై ఓ అవగాహన కల్పించాలనుకున్నాను. ఎకో ఫ్రెండ్లీ వస్తువులతో పండుగ చేసుకునేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనుకున్నాను. చిన్నప్పుడు నాన్న చెప్పిన పత్రి విశిష్టత బాగా గుర్తుంది. వినాయక చవితి వచ్చేది వర్షాకాలం. ఈ పత్రిలో ఒక్కో ఆకు ఓక్కో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. నిమజ్జనం చేయడం ద్వారా ఆ నీళ్లు స్వచ్ఛంగా మారతాయి. ఇలా శాస్త్రీయపరమైన గుణాలెన్నో ఉన్నాయి. చాలా మందికి 21 పత్రి పేర్లు కూడా తెలీదు. వాటిని అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. మొదట్లో పత్రికోసం మార్కెట్‌కి వెళ్లితే సరైన పత్రి నాకు ఎక్కడా దొరకలేదు. పత్రి కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు. మనమే పత్రిని ప్రతి ఒక్కరికీ అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడు పుట్టిందే ఆరాధ్య ఆన్‌లైన్ సంస్థ.

క్యారీ బ్యాగుల బాధ తప్పుతుంది….వినాయక షాపింగ్‌కి వెళ్లినపుడు ఎన్నో క్యారీ బ్యాగులు పడతాయి. ఇదంతా పర్యావరణానికి హాని. నాకనిపించింది నేను ఓ కిట్‌లా నగరవాసులకు అందిస్తే పర్యావరణాన్ని కూడా కాపాడినట్లు ఉంటుంది కదా అనుకున్నాను. ఏది ఎక్కడ దొరుకుతుందనే గ్రౌండ్ వర్క్‌కి ఏడాది పట్టింది. అన్నీ శాస్త్ర బద్ధంగా చేయాలని, ఇద్దరు ముగ్గురు వేద పండితులను కలిసి, గణపతి పూజకు అసలు ఏమేం కావాలి. విగ్రహాన్ని ఎలా చేయాలో కనుక్కొని చేశాను.
ఎకో ఫ్రెండ్లీ కిట్…పోయిన ఏడాది ఆరాధ్య సంస్థను మొదలుపెట్టాను. అప్పుడు 250 కిట్స్ వరకే అందించగలిగాను. మంచి స్పందన వచ్చింది. మా ఆఫీస్‌లో వాళ్లు బాగా సపోర్ట్ చేశారు. కిట్‌లో మొత్తం 18 రకాల పూజా సామగ్రి ఉంటుంది. పసుపు , కుంకుమ, గంధం ఇలాంటివి…ప్రతిదీ నేను బల్క్‌లో తీసుకుని పేపర్ కవర్లలో ప్యాక్ చేస్తాను. మా కిట్ మొత్తం ఎకో ఫ్రెండ్లీనే. జ్యూట్ బ్యాగ్, పంచామృతానికి వాడే గ్లాసు, బౌల్సు ఇలాంటివన్నీ. మట్టితో తయారైన 9 అంగుళాల విగ్రహం, 21 రకాల పత్రి, 18 రకాల పూజా సామగ్రిని రూ. 999 ; ఆరు అంగుళాల వినాయకుడి ప్రతిమ, 21 రకాలపత్రి, 18 రకాల పూజా సామగ్రిని రూ. 888; ఆరు అంగుళాల ప్రతిమ, పత్రిని రూ. 499లకు అందజేస్తున్నాం. 21 రకాల పత్రిలో భాగంగా మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వ పత్రం, దుర్వార పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసి పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుకాంత పత్రం, దామినీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండకీ పత్రం, షమీ పత్రం, అశ్వథ పత్రం, అర్జున పత్రం, అర్క పత్రం ఈ కిట్ లో ఉంటాయి. డిటిడిసితో టైఅప్ అయ్యాను. ఈ జెడ్ షిప్పింగ్ ద్వారా డోర్ డెలివరీ ఇస్తున్నాం. డిటిడిసి హైదరాబాద్‌లో 12 లొకేషన్స్‌లో దొరకుతుతాయి. ఆన్‌లైన్‌లో డోర్ డెలివరీ ఇస్తాం. కిట్ కొనుక్కుంటే ఇంక మీరు కొనాల్సింది కేవలం పూలు, పండ్లు మాత్రమే. పాలవెల్లి, కొబ్బరికాయ, తాంబూలం అన్నీ మా కిట్‌లో ఉంటాయి. వర్చువల్ వీడియో కూడా తయారుచేశాను. యూ ట్యూబ్‌లో వీడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఆరాధ్య సంస్థలో ఈ ఏడాది రూ. 6లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. లాభాల కోసం ఇదంతా చేయడంలేదు. పండుగలతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నా కుటుంబం నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. మా నాన్న పత్రి మొత్తం సేకరిస్తారు. అమ్మ పసుపు, కుంకుమలాంటివి ప్యాక్ చేస్తుంది. సిస్టర్ జ్యూట్ బ్యాగ్ కుడుతుంది. ఈ ఏడాది పండుగ కోసం ఆరు నెలల నుంచి పనులు మొదలుపెట్టాను. నా పోటీదారులకూ సపోర్ట్ చేస్తున్నాను.                                                                                                  – మల్లీశ్వరి వారణాసి