2022లో అంతరిక్షంలోకి ఇండియన్!

isro to launch manned mission to the space in 2022 says pm Modi

న్యూఢిల్లీ:  భారత్‌ కు 2022 ముఖ్యమైన సంవత్సరం… ఆ ఏడాదితో భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓ భారతీయుడిని అంతరిక్షంలో పంపే మిషన్‌ను చేపట్టనున్నట్టు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే 2022 లేదా.. ఆలోపే ఓ ఇండియన్ చేతిలో త్రివర్ణ పతకాన్ని పట్టుకొని అంతరిక్షంలోకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా ఆనందంగా ఉందన్నారు మోడీ. ఇప్పటి దాకా అమెరికా, యుఎస్‌ఎస్‌ఆర్, చైనా మాత్రమే అంతరిక్షంలోకి మనిషిని పంపించాయని చెప్పారు. 2022లో డెన్మార్క్ కూడా అంతరిక్షంలోకి మనిషి పంపే ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

వాస్తవానికి 10 ఏళ్ల కిందటే వ్యోమ్ పేరుతో మనిషిని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్‌ను ఇస్రో వెల్లడించింది. ముగ్గురు క్రూ మెంబర్లతో కూడిన స్పేస్‌క్రాఫ్ట్‌ను మార్క్ జిఎస్‌ఎల్‌వి 3 లాంచ్ వెహికిల్ ద్వారా భూకక్ష్యలోకి పంపించాలని ఇస్రో ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. 5 నుంచి ఏడు రోజుల పాటు భూకక్ష్యలో ఉండేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇదివరకే ఆ ఆర్బిటల్ వెహికిల్‌ను రూపొందించే పనిలో ఇస్రో నిమగ్నమైందని మోడీ పేర్కొన్నారు. 2007లోనే తొలిసారి 550 కెజిల శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపి 12 రోజుల తర్వాత తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయోగ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. రీఎంట్రీ టెక్నాలజీలో భారత్ సామర్థ్యం ఏంటో అప్పుడే బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను కూడా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఇప్పటికే ఇండియా చంద్రుడు, అంగారకుడిపైకి విజయవంతంగా స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించిన సంగతి తెలిసిందే.

Comments

comments