సామాన్యుడి ప్రతిస్పందన

LOckdown

అంతలోనే ఎంతమార్పు ఎవరూ ఊహించని మరో కొత్త ప్రపంచం ఆవిర్భవించినట్లుగా ఉంది. పనికోసం, పొట్టకూటి కోసం, పదవుల కోసం, పక్కవాన్నిమించడం కోసం, పైపైకి ఎదగాలనే ఆశలతో, పనికిరాని టెన్షన్లతో పైకి ఎదిగిన వారిపై అసూయలతో, పలు రకాల అనారోగ్యాలతో నిత్యం, ప్రతి నిత్యం రహదారులు, రైళ్లు, రన్ వే లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాళ్ళు, కార్లు, బార్లు, షికార్లు మొదలగు వాటితో తీరిక లేకుండా గడిపే మానవ జీవన ప్రయాణం ఒక్కసారిగా ఏదో ఒక అదృశ్య శక్తి ‘స్టాప్’ బటన్ నొక్కినట్టుగా ఆగిపోయిందనిపిస్తుంది. పర్యావరణ సమతుల్యత కోసమే ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. కాకపోతే మానవాళి జీవనానికి తీవ్ర ముప్పుగా కాకుండా మనిషిలోని మానవత్వాన్ని మేలు కొలిపి, పర్యావరణ ప్రాధాన్యతను తెలిపే ఒక పెద్ద ‘హెచ్చరికగా’ ఈ పరిణామం మిగిలిపోతే బాగుండుననే ఆశ కలుగుతోంది.

పెరుగుతున్న భూగోళ ఉషోగ్రతల (గ్లోబల్ వార్మింగ్) గురించి, తరుగుతున్న పచ్చటి అడవుల గురించి, జీవ వైవిధ్యం (బయోడైవర్సిటి) గురించి, పెరుగుతున్న కాలుష్యం, పలుచనవుతున్న ఓజోన్ పొర, ఆమ్ల వర్షాలు, అతినీలలోహిత కిరణాల, వేడికి కరుగుతున్న మంచు ఖండాలు, ముంపు ముప్పు పొంచి ఉన్న లోతట్టు దేశాలు, మొదలగు వాటి గురించి ఆందోళనపడుతున్న ప్రపంచ దేశాలు, ‘ప్యారిస్ ఒప్పందం’, వీటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ప్రపంచ దేశాలన్నీ పేపర్ల మీద ఒప్పందాలు చేసుకున్నా, ప్రతి దేశం కఠిన నియమ నిబంధనలను పెట్టుకున్నా అమలుపరచలేని చర్యలను, మనిషి బలహీనతల వల్ల ‘అసాధ్యంగా’ మారిన ‘మార్పులను’ ఊహించని విధంగా, అనిర్వచనీయమైన పద్ధతిలో, అకస్మాత్తుగా వచ్చిపడిన ఈ భయోత్పాతం కొంత వరకైనా సుసాధ్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

సాధారణంగా మనిషిలోని భయం, అభద్రత భావాలూ మనిషి జీవన గమనాన్ని శాసిస్తున్నాయి. వారసుల భవిష్యత్తు జీవన ప్రమాణాలను గురించి, ఉన్న అర్హతలకు, అవకాశాలకు మించి ఎదగాలనే ప్రయత్నం, ‘మితి మీరిన స్వార్ధం’ మొదలగు వాటి వల్ల మనిషి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాడు, నిజమైన విలువల గురించి మరచిపోతున్నాడు. కానీ ఈ కొద్దీ కాలంలో పాత సాంప్రదాయ సంస్కృతులు, పరిశుభ్రత, పనివాళ్ళు లేకుండా ఎవరిపని వారు చేసుకోవడం, ‘పది మందిలో కలవలేక పోవడంలో’ ఉండే బాధ ఇవన్నీ కొద్దికొద్దిగా అవగతమవుతున్నాయనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ‘కరోనా వైరస్’ తన నుండి తన కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకూడదని ఎలా ఆలోచిస్తున్నారో అలాగే తన అలవాట్లు, ఆలోచన విధానం, పెద్దల పట్ల అలక్ష్యం, అసూయ, ద్వేషాలు, అతి ఆశ, అవినీతి, ఆడవారి పట్ల గౌరవ భావాలూ, తోటి వారిపై చూపించే ప్రేమ ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన వారసులకు సంప్రదిస్తున్నాయనే విషయాన్ని మరచిపోకూడదు.

‘పరిశుభ్రంగా ఉండడం’, ‘ప్రకృతి ప్రేమికులుగా ఉండడం’, ‘కాలుష్య కారకాలు,’ ‘ఆహారభద్రత పాటించకుండా జరిగే వృధా’, ‘పురాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటించకుండా ఆధునిక పోకడలను, ఆహారపు అలవాట్లను అవలంబించడం’, ‘అత్యాశలకుపోయి అనవసరపు అప్పులు చేయడం’, ‘డబ్బే ప్రధానం అనుకుంటూ నైతిక విలువలు పాటించకపోవడం’, ‘ఆర్భాటాలకు గొప్పలకుపోయి వృథా ఖర్చుతో విందులు, వినోదాలు చేసుకోవడం’, ఇలాంటి చాలా విషయాలపై హెచ్చరికలను గుణపాఠాలను ఈ ‘ఆకస్మిక మహమ్మారి’ మానవాళికి నేర్పిందనుకోవచ్చు.

ప్రతి మనిషి జీవితంలో రెండే రెండు విషయాలు అంతర్లీనంగా వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి ఒకటి- ‘సానుకూలం’ (పాజిటివ్) రెండవది – ‘ప్రతికూలం’ (నెగిటివ్). డబ్బు ఉండటం సానుకూలం, డబ్బు లేకపోవడం – ‘ప్రతికూలం’ అదే విధంగా సంతృప్తి – అసంతృప్తి, అనుకున్నది ‘సాధించడం – సాధించక పోవడం’, ‘ఆరోగ్యం -అనారోగ్యం’, సంతోషం- బాధ’, మంచి రోజులు- చెడ్డ రోజులు’ ఈ విధంగా మనిషి ఆలోచనా విధానాన్ని బట్టి వారి జీవితంలో జరిగే అభివృద్ధి గాని సంతోషాలు గాని ఆధారపడి ఉంటాయి. ఏదైనా సాధించాలనుకున్నపుడు దానికి సంబంధించిన సానుకూల (పాజిటివ్) ఆలోచనలతో ఆ విధంగా మనలో పెంపొందించుకున్న అనుకూలశక్తితో (పాజిటివ్ ఎనర్జీ) మనం ఏదైనా సాధించవచ్చు, మనం ఏదైతే జరగాలని కోరుకుంటామో ఆ విషయానికి మనం పూర్తిగా ఆకర్షించబడాలి.

దానిని మనం సంపూర్ణంగా ప్రేమించగలగాలి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే సంకల్పాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంపూర్ణంగా ప్రేమించారు, కలలు కన్నారు, సాధించగలమనే సానుకూల దృక్పధంతో ‘పాజిటివ్ ఎనర్జీ’తో ముందుకు వెళ్లారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిపెట్టారు. ఎవరెన్ని ప్రతికూల వాతావరణాలను సృష్టించినా ఆయన వాటిని లెక్క చేయలేదు. ఏ క్షణంలో కూడా ‘ఇది సాధించలేము’ అనే భావాన్ని ఆయన తన దరికి చేరనివ్వలేదు. అందువల్లనే ఆయన విజయాన్ని సాధించగలిగారు. రాష్ట్రం సాధించిన తరువాత కూడా కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఎంతగానో ప్రేమించారు. ఒక పాజిటివ్ ఎనర్జీతో ‘24 గంటలు కరెంటు’, ‘కాళేశ్వరం ప్రాజెక్టు’, ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’ వంటి ఎన్నో అసాధ్యమనుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పాజిటివ్ ఎనర్జితో సుసాధ్యం చేసి చూపించారు.

అదే విధంగా ఈ భయోత్పత సమయంలో ‘ఆయన నాయకత్వం’ ప్రజలలో ఒక సానుకూల దృక్పథంతో కూడిన ధైర్యాన్ని అందిస్తుంది. రకరకాల ప్రచారాలతో సామాజిక మాధ్యమాల హోరులో గందరగోళంలో, ఆందోళనలో ఉన్న ప్రజలకు ఆయన బలమైన నాయకత్వ లక్షణాలు, ఈ క్లిష్ట సమయంలో చేస్తున్న అన్ని రకాల ఏర్పాట్లు, అధికారులకు ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలు, ప్రజలలో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి దోహదపడుతున్నాయి.నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మనోధైర్యం, ఆత్మస్థైర్యం, సానుకూల దృక్పధాలు కలిగి ఉన్న వాళ్లకు ఈ వైరస్ ముప్పు ఉండదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశం ఎర్పాటు చేసిన సమయంలో యువత, తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా టివిల ముందే ఉంటున్నారు. ఆయన చెప్పే ప్రతీ మాట శ్రద్ధగా వింటున్నారు.

“ఈ కెసిఅర్’ ఉన్నంతవరకు ఈ తెలంగాణ ప్రజలకు ఏమీ కానివ్వను” అని ఆయనిచ్చే భరోసా ప్రజలలో ఎంతో మనోధైర్యాన్ని నింపుతుంది. ప్రతిరోజూ సిఎం చంద్రశేఖర్ రావు ప్రసంగిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు ఆయనిచ్చే ధైర్య వాక్యాలకు ఎంతగా ఆకర్షితులయ్యారో, అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంక్షోభ సమయంలో ఆత్యవసర సేవలలో భాగంగా తమ అమూల్యమైన సేవలను అందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగులు, నిత్యావసర వస్తువులను అందించే వారు, పారిశుధ్య కార్మికులు, ‘బొగ్గు గని’ కార్మికులు మొదలగు వారి గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బొగ్గు గని కార్మికుల గురించి ఆలోచించినట్లయితే దేశీయ స్థాపిత విద్యుత్ సామర్ధ్యం సుమారు 3,50,000 మెగావాట్స్ ఐతే దానిలో సుమారు 2,50,000 మెగా వాట్స్ (65%) బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ల స్థాపిత సామర్ధ్యంగా ఉంది.

రోజుకు దేశం మొత్తం సుమారు 28,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగితేనే నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ప్రస్తుతం హాస్పిటల్స్‌కి, అత్యవసర సరకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, గృహ విద్యుత్తు అన్నిరకాల ప్రాథమిక అత్యవసర సేవలకు కూడా విద్యుత్ అనేది ఎంత అవసరమో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్ లు సింగరేణి బొగ్గు మీదనే ఆధారపడి పనిచేస్తాయి. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సింగరేణి నుంచి జరుగుతుంటుంది. ఈ ఉత్పత్తి లో 20% భూగర్భ బొగ్గు గనుల ద్వారా, 80% ఉపరితల గనుల ద్వారా వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారమే అత్యవసర సేవలలో భాగంగా ఇక్కడి బొగ్గు గనులు కూడా పని చేయాల్సిన అవసరం ఉంటుందని గమనించాలి.

అంతకుముందు రోజుకు 2 లక్షల టన్నులు ఉన్న బొగ్గు రవాణా ఇప్పటికే లక్షా 60 వేలకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎప్పుడూ చెప్పే మాటల్లో “బొగ్గు గని కార్మికులు, దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ‘సైనికులు’ ఒక్కటే” అని వారు అనడం వెనుక ఉన్న స్ఫూర్తి ఇప్పుడు తెలుస్తుంది. దేశ సైనికులు దేశ రక్షణలో భాగం కాకపోయినా, యుద్ధ సమయంలో ప్రాణ భయంతో వెనుకడుగు వేసినా దేశం, దేశంలోని ప్రజలు ఏవిధంగా నష్టపోతారో బొగ్గు గని కార్మికులు వెనుకడుగు వేసినా అంతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వంవారు, నిపుణులు ఇచ్చే ఆరోగ్య, రక్షణ, సూత్రాలు సాధ్యమైనంత వరకూ పాటిస్తూ మనో నిబ్బరంతో కార్మికులు, అధికారులు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రవాణా సౌకర్యాలు, ఇతర పరిశ్రమలు మూతపడిన ఈ సమయంలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి కావలసిన ఎక్స్‌ప్లోజివ్స్, రూఫ్ బోల్ట్, డీజిల్, రక్షణ పరికరాలు మొదలైన చాలా రకాల ముడి సరుకుల ఉత్పత్తికి, రవాణాకు సింగరేణి పాలనాధికారులు కూడా అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరుచుకుంటూ ఉద్యోగుల ఆరోగ్యరక్షణకు కావలసిన శానిటైజర్స్, మాస్కులు మొదలగు వాటిని అందజేస్తూ బొగ్గు ఉత్పత్తిని నిరాటంకంగా కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో ప్రస్తావించే అన్ని అత్యవసర విభాగాల పేర్లతో పాటుగా బొగ్గు గని కార్మికుల గురించిన ప్రస్తావన కోసం తమ ప్రియతమ నాయకుడి నుండి వచ్చే ప్రేమ పూర్వక ‘భరోసా’ కోసం సింగరేణి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఈ సంక్లిష్ట సంక్షోభ సమయంలో మనోధైర్యాన్ని పెంచుకొని మనకున్న శక్తి యుక్తులను కూడతీసుకుని, అత్యంత సానుకూల దృక్పథంతో, ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను, సూచనలను, తూచా తప్పకుండా పాటిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్‌పై జరిగే యుద్ధంలో మనం విజయం సాధించాలి. కానీ ఈ విపత్తు ముగిసినా కూడా ఇది చేసిన కొన్ని హెచ్చరికలను, నేర్పిన కొన్ని ముఖ్య పాఠాలను, మంచి విషయాలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా, ప్రతి ఒక్కరి క్షేమం కోరుకుంటూ, కల్మషంలేని నవ్వులతో, కన్నీళ్లు కష్టాలులేని జీవన విధానంతో, ప్రశాంతంగా, పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, జీవించాలని కోరుకుందాం.

2020 Coronavirus Lockdown in India

బుడగం మహేష్, 8332974322

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సామాన్యుడి ప్రతిస్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.