మావోయిస్టు హింస

    మహారాష్ట్ర గడ్చిరోలిలో బుధవారం నాడు మావోయిస్టుల మందుపాతరకు 15 మంది భద్రతాదళ పోలీసులు, ఒక డ్రైవరు బలైపోయిన ఘటన దేశంలో వామపక్ష తీవ్రవాద హింసాకాండ తగ్గలేదనే చేదు సత్యాన్ని రుజువు చేస్తున్నది. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో మావోయిస్టుల ప్రాబల్యం నిరాఘాటంగా కొనసాగుతున్నట్లు తరచూ రుజువవుతున్నది. ప్రాణాలకు తెగించి దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టే పోలీసులు, భద్రతాదళాలు వీరి దాడుల్లో బలైపోతున్నారు. నాడు యుపిఎ, నేడు ఎన్‌డిఎ ప్రభుత్వాలు రెండూ ఎంతగా […] The post మావోయిస్టు హింస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

    మహారాష్ట్ర గడ్చిరోలిలో బుధవారం నాడు మావోయిస్టుల మందుపాతరకు 15 మంది భద్రతాదళ పోలీసులు, ఒక డ్రైవరు బలైపోయిన ఘటన దేశంలో వామపక్ష తీవ్రవాద హింసాకాండ తగ్గలేదనే చేదు సత్యాన్ని రుజువు చేస్తున్నది. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో మావోయిస్టుల ప్రాబల్యం నిరాఘాటంగా కొనసాగుతున్నట్లు తరచూ రుజువవుతున్నది. ప్రాణాలకు తెగించి దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టే పోలీసులు, భద్రతాదళాలు వీరి దాడుల్లో బలైపోతున్నారు. నాడు యుపిఎ, నేడు ఎన్‌డిఎ ప్రభుత్వాలు రెండూ ఎంతగా ఎన్ని చర్యలు తీసుకున్నా మావోయిజాన్ని నిర్మూలించడంలో విఫలమైనట్టు స్పష్టపడుతున్నది. గడ్చిరోలిలో మావోయిస్టులు మంగళ, బుధవారాల్లో ఒక రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు సంస్థకు చెందిన 30కి పైగా వాహనాలను దగ్ధం చేశారని వార్తలు చెబుతున్నాయి. ఆ తర్వాత భద్రతా దళాల వాహనాన్ని పేల్చివేశారు. ఈ దారుణ హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆ వెంటనే ప్రకటించారు. ఒక ప్రైవేటు వాహనంలో వెళుతున్న భద్రతా దళాల రాకను ముందుగానే గమనించి మావోయిస్టులు ఈ దురాగతానికి తలపడినట్టు తెలుస్తున్నది.

వారికి, పోలీసు బలగాలకి మధ్య ఇటువంటి భీషణమైన దాడులు, ప్రతిదాడులు గతంలో చాలా జరిగాయి. అటు ఇటు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు నక్సలైట్లనుగాని ఇప్పుడు మావోయిస్టులనుగాని దారి తప్పిన వారుగా, హింసోన్మాదులుగానే పరిగణిస్తూ బలగాల ప్రయోగంతో అంతమొందించడానికే కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ దిశగానే పథక రచన చేస్తూ అణచివేతను ముమ్మరం చేస్తున్నాయి. కాని ఆ చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఇస్తున్న జాడల్లేవు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సఫలమవుతున్నాయి. మిగతా చోట్ల వామపక్ష తీవ్రవాదం అదుపులోకి రాకపోడమే ఆందోళనకరం. దేశంలోని మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో గల యువతలో ప్రబలిపోయిన నిరుద్యోగం, అశాంతి మావోయిస్టు ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్నాయి. అందుచేతనే ఈ ఉద్యమాన్ని అంతమొందించే కృషి వృథా అవుతున్నదనుకోవాలి.

చత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం పేరిట లేచిన ప్రతిఘటనోద్యమం కూడా విఫలమైంది. కేంద్రానికి, మావోయిస్టుల ప్రాబల్యం గల రాష్ట్రాలకు మధ్య సమన్వయంతో కూడిన సమగ్ర కార్యాచరణ పథకాన్ని 2009లో అప్పటి యుపిఎ ప్రభుత్వం రూపొందించింది. ఒకవైపు మావోయిస్టులు బలంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో అభివృద్ధి కృషిని ముమ్మరం చేయడంతోపాటు మరోవైపు ఇతోధికమైన పోలీసు బలగాలు, ఆధునిక ఆయుధాలతో మావోయిజాన్ని సమూలంగా అంతమొందించే పనిని చేపట్టే జమిలి పథకాన్ని అందులో భాగంగా అమలు చేశారు. అది రెండు వైపులా మరింత రక్తపాతానికి దారితీసిందేగాని సమస్య పరిష్కారానికి తోడ్పడలేదు. దేశం గతంలో ఎన్నడూ ఎదుర్కోని ఒకేఒక్క అతిపెద్ద ఆంతరంగిక భద్రతా సమస్య నక్సలిజం అని 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రజలను వారి నుంచి దూరం చేయడానికి తోడ్పడే తిరుగులేని ఉపాయం అభివృద్ధేనని కూడా ఆయన 2011లో సెలవిచ్చారు.

మావోయిస్టుల హింసాకాండ వ్యాపించిన 60 జిల్లాల్లో అభివృద్ధి పథకాలను మరింతగా, ఇతోధిక శ్రద్ధతో చేపడతామని ప్రకటించారు. ఆ వైపు జరిగిన కృషి ఏమైందో ఏ అవినీతి పందికొక్కుల పాలైందో తెలీదు. సమస్య మాత్రం ఎక్కడిదక్కడే ఉంది. పోలీసుల కాల్పులకు, మావోయిస్టుల మందు పాతరలకు అమాయకులు బలైపోతూనే ఉన్నారు. మన్మోహన్ సింగ్ చేతుల మీదుగానే దేశంలోకి ప్రవేశించి పరివ్యాప్తమైన నూతన ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా వ్యవసాయ సంక్షోభం తీవ్రతరమైంది. రైతులు ఎన్నడూలేని బాధలనుభవిస్తున్నారు. వారి ఆత్మహత్యలు ముమ్మరించాయి. గ్రామీణ ప్రజల జీవితాలు చెప్పలేనంతగా ఛిద్రమైపోయాయి. పట్టణాలకు, నగరాలకు వలసలు అసాధారణంగా పెరిగిపోయాయి. దేశాన్ని ఇతరేతర అనేక రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి.

ముఖ్యంగా విద్య, వైద్యంపై పాలకుల శ్రద్ధ తగ్గిపోయి ఆ రెండు రంగాలు ప్రైవేటు ఉక్కు కౌగిట్లోకి జారుకున్నాయి. పేద ప్రజలు నాణ్యమైన విద్యకు, వైద్యానికి నోచుకోడం లేదు. ఎస్‌ఇజెడ్‌లు, మేకిన్ ఇండియా వంటి ప్రయోగాలేవీ దేశంలో పారిశ్రామిక తయారీ రంగాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగాల కల్పనలో విజయవంతం కాలేకపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే యువత మరింత అశాంతికి, అలజడికి గురై మావోయిజం వంటి హింసాత్మక ఉద్యమాల వైపు ఆకర్షితులవుతారు. కేంద్రంలో అధికారంలోకి రానున్నది ఎవరైనప్పటికీ ఈ సమస్యల తక్షణ పరిష్కారమే వారి దృష్టిని ఆకర్షించవలసి ఉంది.

16 Jawans Dead in Maoists Attack at Maharashtra

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మావోయిస్టు హింస appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: