ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు

inter

మార్చి 4 నుంచి 18 వరకు
నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
9,65,839 మంది విద్యార్థులు
విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్

హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామంద్రన్ వెల్లడించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1,339 ఛీప్ సూపరింటెండెంట్లను, 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించామని అన్నారు.

ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల వరకు విద్యార్థులు ఒఎంఆర్ షీట్‌తో తమ బయోడాటా నింపడంతో పాటు బయోమెట్రిక్ హాజరు పూర్తి చేస్తామని అన్నారు. ఉదయం 9 గంటల విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఉదయం 8.45 గంటల నుంచి 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుందని, ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

పరీక్ష ముగిసే ఎవరూ బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వంటివి అనుమతించమని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,80,516 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,85,323 మంది, మొత్తం 9,65,839 మంది విద్యార్థులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.in నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపారు. విద్యార్థులు సులువుగా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ TSBIE mServices యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే పరీక్షా కేంద్రం ఫొటోతోపాటు ఆ కేంద్రానికి వెళ్లే మ్యాప్ వస్తుందని చెప్పారు. విద్యార్థుల ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది..?, ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు అనే వివరాలు కూడా వస్తాయని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు ఉంటే BIGRS గ్రివియెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దాంతోపాటు తమ కంట్రోల్ రూమ్ నెంబర్ 040- 24600110లో సంప్రదించాలని అన్నారు.

ఆత్మహత్యల నివారణకు స్టూడెంట్ కౌన్సెలర్లు

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం నియమించిన స్టూడెంట్ కౌన్సెలర్ల ఫోన్ నెంబర్లు ప్రచురించాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా జిల్లా అధికారులకు తాము ఆదేశాలు జారీ చేశామని, విద్యార్థులు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్టూడెంట్ కౌన్సిలర్లు, ప్రిన్సిపాళ్లు, డిఐఇఒలకు లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

1339 centers for inter exams in telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.