11న రాష్ట్రానికి సిఇసి బృందం

CEC team to visit telangana on September 11

తెలంగాణలో ఎన్నికలకు తగినన్ని ఇవిఎంలు ఉన్నాయి
పరిశీలక బృందం నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం : సిఇసి రావత్ 

మన తెలంగాణ/ న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ రద్దు సమాచారం తమకు అందిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన కమిషనర్ రావత్ మీడియాకు శుక్రవారంనాడిక్కడ వెల్లడించారు. తెలంగాణలో తమ యం త్రాంగం సన్నద్ధత ఆధారంగా ఎన్నికలకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రద్దయిన ఆరు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచన ఉందని, వాటికి అనుగుణంగానే తమ చర్యలు ఉంటాయని అన్నారు. శాసన సభ రద్దయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది చట్టంలో ప్రత్యేకంగా నిబంధన ఏదీ లేదని, అయితే ఈ విషయంపై 2002 లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారని, శాసన సభ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని సుప్రీం కోర్టు సూచిందన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అయాచిత ప్రయోజనం పొందేలా ఆరు నెలలుఅధికారం లో ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకం ఇచ్చిందని రావత్ చెప్పారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తగు నిర్ణయం తీసుకుంటామని రావత్ తెలిపారు. తదుపరి చర్యలపై నివేదిక పంపాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను కోరినట్టు చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు రావత్ చెప్పారు. ఏర్పాట్లను సమీక్షించాక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇవిఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం త్వరలో పర్యటించనుందని, ఈ నెల 11న ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఆ బృందం తెలంగాణకు వెళ్లనుందన్నారు. అక్కడ ఎన్నికల నిర్వహణకు ఉన్న సంసిద్ధతపై ఆ బృందం ఇచ్చే నివేధిక ఆధారంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రావత్ వివరించారు. సోమవారంనాడు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఢిల్లీ వస్తున్నారని, రాష్ట్ర యంత్రాంగం ఏ మేరకు సంసిద్ధంగా ఉందో ఆయనను అడిగి తెలుసుకుంటామన్నారు.

తెలంగాణలో ఎన్నికలపై నిర్ణయం మాత్రం తీసుకోలేదు : తెలంగాణ లో శాసన సభ ఎన్నికల నిర్వహణ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రావత్ తెలిపారు. తెలంగాణాలో ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి ముందు రావత్ మీడియాకు చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలతో పాటుగా నిర్వహిస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.ఈ నాలుగు రాష్ట్రాల కంటే ముందుగా లేక ఆ తర్వాత కూడా జరగవచ్చునని రావత్ చెప్పారు. తెలంగాణ లో శాసనసభ రద్దయిన దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని రావత్ స్పష్టంచేశారు. సెప్టెంబర్ 30 నాటికల్లా ఇవిఎంలు సరిపడా లభ్యమవుతాయని, అదే విధంగా వివిప్యాట్(ఓటు రశీదు యంత్రాలు) లు నవంబర్ 30 నాటికల్లా అందుతాయని రావత్ చెప్పారు. వివిప్యాట్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చామని, ఆ హామీని నిలబెట్టుకుమాని రావత్ చెప్పారు.

Comments

comments