100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు

India plans 100 new airports says Suresh Prabhu

రూ.4.2 లక్షల కోట్లతో 15 ఏళ్లలో నిర్మించనున్నాం, కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభు

న్యూఢిల్లీ: వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో 60 బిలియన్ డాలర్లతో(రూ.4.2 లక్షల కోట్లు) 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. డిమాండ్ పెరగడంతో దేశీయ విమాన రంగం రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విమాన రంగానికి మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని భావించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎఎఐ(ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) 120 ఎరోడ్రోమ్స్‌ను నిర్వహిస్తోంది.

జిఎస్‌టి సరికాదు : ఐఎటిఎ
విదేశీ విమాన టికెట్లపై జిఎస్‌టి విధించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, అలాగే విమాన సంస్థల పోటీతత్వం లేకుండా చేస్తుందని ఐఎటిఎ చీఫ్ అలెగ్జాండ్రె డె జునియక్ పేర్కొన్నారు. భారత్ విమానయాన రంగం లో పలు అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విమాన ఇంధన ధరలు పెరగడం, మౌలిక సదుపాయాల్లో లోపాలు, విమానాశ్రయాల ప్రైవేటీకరణ వంటివి సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. ఐఎటిఎ పరిధిలో 280 విమానయాన సంస్థలు ఉండగా, వాటిలో ఎయిర్ ఇండి యా, జెట్ ఎయిర్‌వేస్, విస్తారా తదితర విమానయాన సంస్థలు కూడా ఉన్నాయి. మంగళవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో అలెగ్జాండర్ మాట్లాడుతూ, విదేశీ విమాన టికెట్లపై జిఎస్‌టి విధించడం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసిఎఒ) నిబంధనలను ఉల్లంఘించడం అని అన్నారు.

ఇండిగోలో వాటా కొనుగోలుపై ఖతార్ చూపు
ఖతార్ ఎయిర్‌వేస్ సొంతంగా భారత్‌లో విమాన సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో విదేశీ యాజమాన్య నిబంధనలు గందరగోళంగా ఉండడం వల్ల ఖతార్ ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి గాను భారత్‌లో ఏదైనా సంస్థతో ఒప్పందం చేసుకోవడం లేదా ఇండిగోలో వాటాలను కొనుగోలు చేయాలని ఖతార్ భావిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపినట్టు సమాచారం.

Comments

comments