‘డిఎస్‌కు నీతి లేదు’

DS Resignation to the Rajya Sabha

రాజ్యసభకు రాజీనామా చేయాలి
సస్పెండ్ చేయాలని సిఎంకు
లేఖ రాయడం సిగ్గుచేటు
సస్పెండ్ చేస్తే మరి ఐదేళ్లు
పదవిలో ఉండాలన్న దురాశ
కవితపై తన కొడుకు తప్పుడు
ఆరోపణలను ఖండించని డిఎస్
కెసిఆర్‌కు డిఎస్ బహిరంగ లేఖపై
మండిపడ్డ బాజిరెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు నీతి లేదు, నియమం అసలే లేదని టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, నిజామాబాద్ రూరల్ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజంగా నిజాయితీ ఉంటే టిఆర్‌ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. టిఆర్‌ఎస్‌లో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయించిన ఘనత డిఎస్‌ది అని బాజిరెడ్డి మండిపడ్డారు. ఆయన కొడుకు తో ఎంపి కవిత మీద, టిఆర్‌ఎస్ పార్టీపైనా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. సిఎం కెసిఆర్‌కు డిఎస్ రాసిన బహిరంగ లేఖపై మంగళవారం హైదరాబాద్‌లో బాజిరెడ్డి ఘాటుగా స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిఎస్ ఆ లేఖలో కోరడం సిగ్గుచేటన్నారు. ఇది ఆయన రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శమని మండిపడ్డారు. డిఎస్ కొడుకు దురుద్దేశపూర్వకంగానే కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తే డిఎస్ ప్రేక్షక పాత్ర వహించారని, రాజ్యసభ సభ్యుడిగా డిఎస్‌కు శాసన సభ్యులుగా తామంతా ఓట్లు వేశామని గుర్తుచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి సిఎం కెసిఆర్‌కు అందజేశామని బాజిరెడ్డి తెలిపారు. పార్టీ సస్పెండ్ చేస్తే మరో ఐదేళ్ళు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగవచ్చనే ఆలోచనలో డిఎస్ ఉన్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో అన్ని పదవులూ అనుభవించి, చివరకు ఎమ్మెల్సీ పదవి రాలేదనే అక్కసుతో టిఆర్‌ఎస్‌లో చేరాడని, సిగ్గుంటే డిఎస్ వెంటనే ఎంపి పదవికి, టిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్, ఆయన కొడుకు చేసిన అక్రమాల గురించి నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు.
సస్పెండ్ చేస్తారా? లేదా వెనక్కి తీసుకుంటారా? : డిఎస్
రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ వ్యక్తిత్వం, గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించిన డిఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేక ఇప్పటికే చేసిన పార్టీ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. లేఖ గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు తానుగా పార్టీని వదిలి వెళ్తే పార్టీ ప్రజాప్రతినిధులు తనపై చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లే అవుతుందని, తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులూ చేయకుండా నిజాయితీగా పేద ప్రజల కోసం పని చేశానని అన్నారు. పిసిసి అధ్యక్షునిగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన తాను కాంగ్రెస్‌ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని మరింత బలపరాచాలన్న లక్షంతోనే ఆ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు. తాను ఇప్పటివరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని, ఒకవేళ చేసినట్లు రుజవు చేస్తే తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కెసిఆర్‌ను కోరినట్లు తెలిపారు.

Comments

comments