హైదరాబాద్‌లో సుడాన్‌ యువకుడి హత్య!

Sudan young man killed in Hyderabad

హైదరాబాద్‌: ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చిన సుడాన్‌కు చెందిన రాషెష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే దేశానికి చెందిన వారు అతడిని పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చదువుల కోసం రాషెష్ పి అండ్ టి కాలనీలో రూం తీసుకుని ఉంటున్నాడు. అయితే, నాలుగు రోజుల క్రితం అదే దేశానికి చెందిన అబ్దుల్లా, లీసా ఉంటున్న ఇంటికి మారాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది కాస్తా ఘర్షణకు దారితీసింది. దాంతో కోపోద్రిక్తులైన అద్బుల్లా, లీసాలు ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో రాషెష్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments