హృదయాలను కుదిపే కవిత్వం

Discrimination in each case, as a group has another group

ఒక జీవి మరొక జీవిని, ఒక వర్గం మరొక వర్గాన్ని, ఒక సమూహం మరొక సమూహాన్ని ఇలా ప్రతి విషయంలో కూడా వివక్ష ఉంది. వివక్ష కేవలం జీవులపై మాత్రమే కాదు వస్తువులపై, సన్నివేశాలపై, అభిప్రాయాలపై ఇలా ప్రతిచోట వివక్ష సింహాసనాన్ని అధిరోహించి ఉంటుంది. వివక్షకు గురౌతున్న వారు పోరాటాలు, ఉద్యమాలు కూడా చేస్తున్నారు. వీరి పోరాటాలకు బాసటగా నిలవాల్సిన అవసరం నేటి మేధావులకు, సాహిత్యవేత్తలకు, అధికారులకు, ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఎంతైనా ఉంది. కనీసం వారి పోరాటాలకు మద్దతు తెలుపుతున్నా వారెవరైనా ఉన్నారా? అవును ఉన్నారు ఈ సమాజంలో వివక్షకు గురౌతున్నా వారి పక్షాన నిలబడే గొంతులు ఉన్నాయి.

భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయి. అవి కులం, మతం, జాతి, వర్గం, ప్రాంతం, ఇలా దేనితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మరి నేడు ఆ హక్కులు సమానంగా ఉన్నాయా? అన్నదే ప్రశ్న ఈ ప్రశ్నతోనే ‘వై’ అనే శీర్షికతో దశాబ్దాలుగా వివక్షకు గురౌతున్న హిజ్రాల సమస్యలపై దీర్ఘకావ్యం రాసి సమాజంలో చర్చకు పెట్టారు యువ కవి జాని భాషా చరణ్ తక్కెడశిల (అఖిలాశ). నేడు సాహిత్యంలో యువకవుల శాతం చాలా తక్కువ అలాంటిది ఇలా కొత్త వస్తువుతో అందులోను వివక్షకు గురౌతున్న వారి పక్షాన నిలబడి దీర్ఘకావ్యాన్ని తీసుకురావడం ముదావహం.

‘మేము శూన్య లోకం నుండి జారిపడలేదు
రాతి శరీరం నుండి ఊడిపడలేదు
తల్లి గర్భం నుండే పురుడోసుకున్నాము
మరి మాపై ఎందుకు ఈ వివక్ష?’
పుస్తకం వెనుక వైపు ఈ వాఖ్యాలు చదవగానే ఔను నిజమే కదా వారు కూడా మనతో సమానమే కదా మరి వారెందుకు వివక్షకు గురౌతున్నారు అని ఆలోచన, ప్రశ్న కూడా మనలో చేరుతుంది. ఈ వివక్షకు కారణం ఎవరు? ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమే కానీ కవి పుస్తకంలో ఎవరిని ఘాటుగా నిందించడు సున్నితంగా మన మనసులు మార్చే ప్రయత్నం చేశాడు.

‘కొన్ని సమూహాలు కాలపు పై కొనలో
ఒత్తులై వెలుగొందుతున్నాయి
మరికొన్ని సమూహాలు
కాలం పాదాల కింద పాతివేయబడ్డాయి
మరి మేము
గగనానికి పుడమికి మధ్య
వేలాడుతున్నాము…!!’

అంటూ ఈ దీర్ఘకావ్యం మొదలౌతుంది. ఇక్కడ మనమొకటి గమనించాలి కవి వివక్షకు గురౌతున్నా వారి గొంతుతోనే ఈ దీర్ఘకవ్యాన్ని చెప్పించే ప్రయత్నం చేయడం గొప్ప పరిణామం. పుస్తకంలో ఎక్కడ అర్థం కాని అర్థం లేని విషయాలను ప్రస్తావించలేదు. కేవలం వారి బాధలను సమాజంలో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమాజం ఎప్పుడూ ఎదో ఒక వర్గానికి అన్యాయం చేస్తూనే ఉంటుంది. ఆ అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసిన కవికి అభినందనలు.
ఈ దీర్ఘకావ్యంలో ఉన్నా మరో గొప్ప విషయం ఏంటంటే? కవి వారి బాధలను మాత్రమే చెప్పి వదిలివేయలేదు. వారి అనుభవాలను, భావోద్వేగాలను, వివిధ కోణాలలో కవిత్వీకరించి సున్నితమైన పదాలతో,ఆర్థ్రతతో కూడిన గొంతుతో చెప్పిన తీరు బాగుంది. వారికి ఇష్టం లేని రాక్షస రతిపై కవి చెప్తూ ఉంటే మనసు ముక్కలైపోతుంది.
‘అవును మేము యాచిస్తున్నాము కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు ఒక మెత్తటి స్నేహహస్తం కోసం’ అని చెప్పిన తీరు చూస్తే మన గొంతుతో పాటు మనసు కూడా ఎండిపోతుంది.
‘ఈ సమాజం మాకు చేయూతనిచ్చి
గుండె కింద పదిలమైన చోటు కల్పించాలి’
ఇది వారి చిన్ని కోరిక. సమాజంలో మేము కూడా ఒక భాగమేనని పోరాడాల్సిన దుస్థితిలో వారున్నారు అని చెప్పడం కన్నా అలా చేసిన మనమే నిజమైన దోషులం.
‘తెరచాటున ,నడి బజారున
వీధి గోడ సాటున ,కదిలే వాహనాన
వాన కురుస్తున్నా ,ఎండ భగ్గుమంటున్నా
విధి విధించిన కాటుకు బలౌతూనే ఉన్నాము.’

ఈ వాక్యాలు చదువుతుంటే నరాలు తెగిపోయి కన్నీల్లు రాలుతాయి. కవి కొన్ని చోట్ల చాలా దిగంబరంగానే వారి కష్టాలను చెప్పిన తీరు నిజంగా కవి ఎంత వేదన చెందారో తెలుస్తుంది. ఔను కవిత్వం అంటే సహజ పదాలతో ఎదో అలా రాయడం కాదు. ఆ బాధను అనుభవించాలి అప్పుడే ఇలాంటి కవిత్వం రాయడం సాధ్యమౌతుంది. ఈ దీర్ఘకావ్యం చదివితే కవి చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని తెలిసిపోతుంది. నిజానికి ఇంతవరకు ఎవరు ఇలాంటి అంశంతో దీర్గకావ్యం తీసుకురాలేదు అనుకుంటాను అక్కడక్కడ కొన్ని కథలు ఏమైనా వచ్చాయి ఏమో కాని సుదీర్ఘంగా హిజ్రాలపై కవిత్వ పుస్తకాలు తెలుగు సాహిత్యంలో అరుదు.

ఇందులో హిజ్రాలను తమ కన్నవారే వెలివేస్తే వారు పడే బాధను హృదయవిదారకంగా కవి దృశ్యరూపాన్ని కవిత్వంలో మన ముందు ఉంచారు. ఈ దీర్ఘకావ్యం చదువుతున్నంత సేపు కొన్ని దృశ్యాలు మనముందుకు వచ్చి మనల్ని చిత్రవధ చేస్తాయి. గొప్పప్రయత్నం చేసిన ఈ కవిని తప్పకుండా తెలుగు సాహిత్యం గుర్తించాల్సిందే లేదంటే అది తెలుగు సాహిత్యానికి మాయని మచ్చే అవుతుంది. కవి ఇందులో ప్రశ్నలు మాత్రమే సంధించి వదిలివేసి ఉంటే పుస్తకానికి వెలతి ఉండేది. కాని పరిష్కారాలు కూడా సూచించి మనకు కర్తవ్యభోద చేశాడు.

మొత్తం మీద తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప గ్రంధం ఈ వై దీర్ఘకావ్యం. ఇలాంటి అరుదైన వస్తువుతో పాటు గాఢమైన కవిత్వాన్ని మనకందించిన కవికి అభినందనలు.–

Comments

comments