హాస్టల్ వార్డెన్స్ స్థానికంగానే ఉండాలి

Hostel Warden should be locally

మన తెలంగాణ/మెదక్ : వసతిగృహా సంక్షేమ అధికారులు స్థానికంగా ఉండి విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసీ సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… చాలా వరకు వసతి గృహ సంక్షేమాధికారులు స్థానికంగా ఉండడంలేదని తన దృష్టికి వస్తాయని ప్రశ్నించారు. ఏదైన మధ్యరాత్రి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరిస్తారని మీరు హాస్టల్‌కు చేరుకునే లోపే జరుగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని మండిపడ్డారు. హాస్టల్ వద్ద ఉందని వసతిగృహ సంక్షేమ అధికారుల జాబితాను తయారు చేయాలని సంక్షేమశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తే కుదరదని తప్పనిసరిగా హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పిస్తూ స్థానికంగా ఉండి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గత విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా వచ్చిన హాస్టల్ వార్డెన్‌లను ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. హాస్టళ్లల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా రావడంతో జిల్లా ఉత్తీర్ణతాశాతం తగ్గిందన్నారు. ఇదే సంవత్సరం ఉత్తీర్ణత శాతం తగ్గితే సంబంధిత వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో బయోమెట్రిక్ విధానంతో హాజరు శాతాన్ని నమోదు చేయాల్సివున్నా అధికారులు ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా ప్రతి విద్యార్థి వివరాలను బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయాలని ఆదేశించారు. హాస్టళ్లను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ నివేదికలను తనకు అందజేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు అనుగుణంగా మూత్రశాలలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గతంలో హారితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు ప్రస్తుతం ఖాళీ ప్రదేసాలలో మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అత్యాధిక జిపిఏ సాధించిన విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వార్డెన్లకు కలెక్టర్ మెమెంటోలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు సైతం జ్ఞాపికను సంక్షేమ శాఖల అధికారులు కలిసి అందజేశారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖల అధికారులు బిసీడబ్లువో సుధాకర్, డిఎస్‌సిడివో మహేశ్వర్, డిటిడబ్లువో వసంతరావులతో పాటు హాస్టళ్ల వార్డెన్లు తదీతరులు పాల్గొన్నారు.