హాంఫట్..కన్ను పడితే ఖతమే

Create duplicate documents in Medak Revenue Officers

డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో అసైన్డ్, వక్ఫ్ భూములకు ఆధరణ కరువు
స్థానిక నేతకు తల నొప్పిగా మారిన వలసవాదుల చెలగాటాలు
మేడం గారికి లేని పట్టింపు మాకెందుకులే అంటున్న లోకల్ లిడర్లు   
అందినకాడికి దండుకొని ఏమి ఎరుగనట్టు అమాయక పాత్రలో జీవిస్తున్న అధికారులు
అధికారుల, ప్రజాప్రతినిధుల తీరుకు బలవుతున్న అమాయక ప్రజలు
అన్యక్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూములపై ప్రత్యేక కథనం…
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి ఃగుడి భూములు, వక్ఫ్ లాండ్స్, రెవెన్యూ, శిఖం అని తేడా లేకుండా కన్ను పడిందంటే చాలు అడ్డగోళుగా నకిలి పత్రాలు సృష్టించి యదేచ్చగా కడీలు పాతి, రోడ్లు వేసి అడ్డొచ్చిన అధికారులకు నయానో బయానో పడేసి లొంగదీసుకుని ధర్జాగా ప్లాట్లు చేసి విక్రయించి అడ్డదారిలో కోట్లు దండుకుంటున్నారు. ఎదురుతిరిగిన స్థానికులను తీవ్రభయాందోళనలకు గురిచేస్తూ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తూన్నారు. ఇదంతా సాక్షాత్తూ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ఇలాకైనా మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న తంతూ… పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వం చిన్న జిల్లాల ఏర్పాటు చేయడంతో పట్టణంలోని పాడు భూములకు సైతం రెక్కలు వచ్చాయి. దింతో భూ బకాసురులు మరోమారు తెరపైకి వచ్చారు. ఇక వారి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇదంతా చేస్తుంది ఈ మద్యే అధికార పార్టిలోకి చేరిన కొందరు జంపుజీలానీలే. అధికారుల, బడా నేతల అండదండలు పొందవచ్చనే దురాలోచనతోనే వీరు గులాబి గూటికి చేరి ప్రభుత్వ పార్టీ పరువు తీస్తున్నారు. జిల్లా కలెక్టరేటు కార్యాలయ నిర్మాణం అవుసులపల్లి శివారులో కొనసాగడం వల్ల అక్కడి భూములకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది దీంతో రంగంలోకి దిగిన భూబకాసురులు అవుసులపల్లి శివారు నుండి తారకరామానగర్ కాలనీ కాంపౌండ్ వరకు గల అసైన్డ్, వక్ఫ్ భూములను నకిలి పత్రాలు సృష్టించి ప్లాట్లుగా మార్చి అమాయకులకు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. అంతే కాకుండా హౌసింగ్ బోర్డు కాలనీ యొక్క కాంపౌడ్ గోడ కూల్చీవేసి ఏకంగా రహదారుల నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇంత జరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా అటువైపు చూడకపోవడం పట్ల పట్టణ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమి తెలియని అమాయకులు ఏంతో కష్టపడి పైసా పైపా కుడబెట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేస్తే తీరా అవి ప్రభుత్వ భూములు కావడంతో అట్టి స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని అధికారులు వారికి చుక్కలు చూపిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేస్తుంటే ముందే ఎందుకు అడ్డుపడలేదని అధికారులను బాధితులు నిలదీస్తుంటే దానికి ఎటువంటి సమాధానం అధికారుల నుండి వెలువడడం లేదు. కనీసం ఇంకేవరికైనా విక్రయిద్దామంటే అసలు విషయం బయటపడడంతో ప్రభుత్వ భూములని ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో లభోదిబోమంటున్నారు. తీరా అమ్మినవారి వద్దకు వెళ్తే అవన్నీ ముందే చూసుకొవాలని దబాయిస్తారు. దీంతో ఖబ్జాలతో ఎటువంటి సంబంధం లేని అమాయకులు బలవుతున్నారు. ఇలా పట్టణంలోని దాదాపు పదికి మించి అక్రమ వెంచర్లు కొనసాగుతున్నాయి. ఎదురుతిరిగి ప్రశ్నించే ధైర్యం ప్రజల్లో, అధికారుల్లో లేనందున ఈ భూబకాసురుల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంది. కబ్జాలకు ముఖ్యంగా కొందరు వార్డు కౌన్సిలర్లు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే కొందరు సంఘ సేవకులుగా తమనుతాము ప్రదర్శించుకునే వారే ఈ భూ కబ్జాలకు పాల్పడడం దురదృష్టకరం. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు మాముళ్ల మత్తు నుండి కళ్లు తెరిచి భూబకాసురుల కొరల నుండి ప్రభుత్వ భూములను కాపాడి వారి ఆగడాలకు కల్లెం వేయాలని స్థానికులు అంటున్నారు. లేదంటే ఒక గజం భూమికూడా మిగల్చకుండా మొత్తం అసైన్డ్, వక్ఫ్, శిఖం భూములు స్వాహా అయ్యే ప్రమాదం పట్టణంలో నెలకొంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ఉప సభాపతి శ్రీమతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రభుత్వ, వక్ఫ్, శిఖం భూములు ఎలా కాజేస్తున్నారంటే…!
ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న భూములను టార్గెట్ చేసి ముందుగా ఏవరో ఒక ఆకాశరామన్న పేరుపై సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్లను అవలీలగా చేయించే కొందరు దళారులను ఆశ్రయించి రిజిస్ట్రార్ ఆఫీసులో అడిగినన్ని ముడుపులు చెల్లించి ఈజీగా రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. అనంతరం రెండుమూడు రిజిస్ట్రేషన్లు ఇతరులపై చేయించి చివరకు అట్టి భూములలో ప్లాట్లు చేసి విక్రయిస్తుంటారు. ఇందులో లోకల్ ప్రజాప్రతినిధులకు, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తగినంత వాట తీసి ముడుపులు అప్పజెప్పేస్తారు. దీంతో ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడరు. బాధితుల నుండి ఫిర్యాదు వచ్చినప్పటికీ స్పందించరు. అంటే ఏ స్థాయిలో వారికి ముడుపులు అందాయో అర్థం చేసుకోవచ్చు.