హర్యానా: వైరుధ్యాల రాష్ట్రం

హర్యానాలో 2014 నుంచి 2016 మధ్య కాలంలో 1000 అత్యాచారాలు జరిగాయి. ఇదే హర్యానా కామన్ వెల్త్ గేమ్స్ లో 22 పతకాలు సాధించింది. అంతర్జాతీయ వేదికలపై బంగారుపతకాలు భారతదేశం సాధించినప్పుడు తప్పకుండా వినబడే కొన్ని అంశాలు మన ముందుకు వస్తుంటాయి. సాధించింది పురుషులా? స్త్రీలా అన్నది చూస్తాం. ఆ తర్వాత క్రీడాకారుల కులం ఏంటని చూస్తాం. ఆ తర్వాత స్వంత సిద్ధాంతాలు చేస్తాం. ఇంకాస్త ముందుకు వెళ్ళి క్రికెట్ వల్ల, క్రికెట్ క్రీడాకారులకు లభించే అసాధారణ […]

హర్యానాలో 2014 నుంచి 2016 మధ్య కాలంలో 1000 అత్యాచారాలు జరిగాయి. ఇదే హర్యానా కామన్ వెల్త్ గేమ్స్ లో 22 పతకాలు సాధించింది. అంతర్జాతీయ వేదికలపై బంగారుపతకాలు భారతదేశం సాధించినప్పుడు తప్పకుండా వినబడే కొన్ని అంశాలు మన ముందుకు వస్తుంటాయి. సాధించింది పురుషులా? స్త్రీలా అన్నది చూస్తాం. ఆ తర్వాత క్రీడాకారుల కులం ఏంటని చూస్తాం. ఆ తర్వాత స్వంత సిద్ధాంతాలు చేస్తాం. ఇంకాస్త ముందుకు వెళ్ళి క్రికెట్ వల్ల, క్రికెట్ క్రీడాకారులకు లభించే అసాధారణ ప్రజాదారణ వల్ల మిగిలిన క్రీడలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకుంటాం.

వినేష్ ఫోగాట్ ఆసియన్ గేమ్స్ 2018లో బంగారు పతకం సాధించింది. ఇప్పుడు కూడా ఆమె కులం గురించి ఆరాలు తీసేవారు ఉండవచ్చు. కాని ఆలోచించవలసిన విషయమేమంటే, ఆమె హర్యానాకు చెందిన యువతి. హర్యానా అంటే 2014 నుంచి 2016 మధ్య కాలంలో 1000 రేప్ కేసులు నమోదైన రాష్ట్రం. అలాగే కామన్ వెల్త్ గేమ్స్ లో రికార్డు సంఖ్యలో 22 పతకాలు సాధించిన రాష్ట్రం కూడా. క్రీడాకారుల కులం గురించి ఆలోచించడం మాని, క్రీడల్లో రాణిస్తున్న రాష్ట్రంగా మాత్రమే హర్యానా పేరు ప్రసిద్ధి చెందాలని ఆలోచించడం మంచిది.

క్రీడల్లో హర్యానా రాణించడం కొత్త కాదు. అనేక క్రీడాంశాల్లో హర్యానా స్త్రీపురుషులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారు. కపిల్ దేవ్, నిర్మలా దేవి, నవ్ జ్యోత్ కౌర్, బబితా కుమారి, దీపా మాలిక్, సాక్షి మాలిక్, సైనా నెహ్వాల్, సుశీల్ కుమార్, గగన్ నారంగ్, యోగేశ్వర్ దత్, కవితా దేవి (డబ్ల్యు డబ్ల్యు యి గేమ్స్ 2017లో మొదటి మహిళ), మనూ భాకర్, విజేందర్ సింగ్, ఫోగట్ అక్కాచెల్లెళ్ళు … ఈ జాబితా చాలా పెద్దది.

హర్యానా క్రీడల్లో రాణించడానికి, ముఖ్యం గా బాక్సింగ్, రెజ్లింగ్ వంటి పోరాట క్రీడల్లో రాణించడానికి అనేక విశ్లేషణలు వచ్చాయి. జాట్ ప్రజల శారీరక ధారుఢ్యం, చరిత్ర, వారి ప్రాంతం నైసర్గిక స్వరూపం తదితర అనేక కారణాలను పేర్కొనడం కూడా జరిగింది. హర్యానా యువతరానికి అనేకమంది క్రీడాకారులు స్ఫూర్తినిచ్చే వారున్నారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ తీసిన దంగల్ సినిమా తర్వాత మరింత ప్రేరణ లభించింది. గీతా, బబిత అక్కాచెల్లెళ్ళు రెజ్లింగ్ లో ఎలా రాణించారో వాస్తవ జీవిత కథను తెరకెక్కించారు. వారి తండ్రి మాన్విర్ సింగ్ ఫోగట్ గురించి కూడా ఆ సినిమా చూపించింది. రీతూ, వినేష్, సంగీత ఈ ఫోగట్ కుటుంబానికి చెందినవారే.

క్రీడాకారులకు ఆ రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా ప్రశంసించదగింది. అంతర్జాతీయ పతకాలు సాధించిన వారికి దేశంలోనే అత్యధిక ప్రోత్సాహక మొత్తం హర్యానా ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకు ముందు ప్రభుత్వం పతక్ లావో పద్ పావో పథకం ద్వారా కూడా క్రీడాకారులను ప్రోత్సహించింది. పతకం తీసుకురండి పదవి పొందండి అని ప్రోత్సహించింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చింది. 2007లో హాకీ ప్లేయర్ మమతా ఖరాబ్, క్రికెట్ క్రీడాకారుడు జోగిందర్ శర్మలకు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు పదవులు ఇచ్చారు. 2008లో విజేందర్ సింగ్ డియస్పీ అయ్యాడు. కాబట్టి హర్యానా యువతకు క్రీడలు కేవలం హాబీ కాదు. ఇదే విషయాన్ని వినేష్ ఫోగట్ కూడా ఒక ఇంటర్వ్యులో చెప్పారు. హర్యానా క్రీడల్లో రాణించడానికి కారణం అక్కడ ప్రతి ఒక్కరు పోటీతత్వం ప్రదర్శించి ఒకరిని మరొకరు అధిగమించాలని ప్రయత్నించడం. అధిగమించడం అంటే వారి లక్షం ఒలింపిక్స్ బంగారు పతకం. అంతేకాదు, క్రీడల్లో రాణించిన చాలా మంది క్రీడాకారులు రాష్ట్రంలో క్రీడా అకాడమీలు స్థాపిస్తున్నారు. దలీప్ సింగ్ రాణాను అందరూ గ్రేట్ ఖలీ అని పిలుస్తారు. ఈయన కర్నాల్ జిల్లాలో రెజ్లింగ్ అకాడమీ పెట్టాలని అనుకుంటున్నారు.

హర్యానా మిగిలిన రాష్ట్రాల మాదిరి కాదు. ఇక్కడ క్రీడలు, క్రీడలకు సంబంధించిన సమస్యలపై సీరియస్ గా ఆలోచిస్తారు. 2016లో హర్యానా క్రీడామంత్రి అనిల్ విజ్ రియో ఒలింపిక్స్ కు తొమ్మిది మంది సభ్యుల బృందంతో వెళ్ళారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. కాని ఈ బృందం అక్కడ హర్యానా క్రీడాకారుల పోటీలను కూడా చూడలేదు. ఆ విషయంపై చాలా గగ్గోలు జరిగింది. తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇటీవల స్పోర్ట్ కౌన్సిల్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు ఒక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ క్రీడాకారులు ప్రొఫెషనల్ కార్యక్రమాల వల్ల వచ్చే ఆదాయంలో మూడోవంతు ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొంది. రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు మరింత పెంచడానికి ఉద్దేశించిన నిర్ణయమిది. కాని ఈ నిర్ణయాన్ని కూడా క్రీడాకారులే కాదు అందరూ వ్యతిరేకించారు.

హర్యానాలో చాలా ప్రాంతాలు, ఊళ్ళ పేర్లు కూడా ఇప్పుడు దేశంలో చాలా మందికి తెలుసు. క్రీడాకారుల వల్ల ఈ పేర్లు దేశంలో అందరికీ పరిచయమయ్యాయి. బలాలీ, ఝాజ్జార్, రోహతక్ వంటి పేర్లు ఇప్పుడు సుపరిచితమయ్యాయి. హర్యానా ఘనతను చెప్పే కథ ఇది. కాని మరోవైపు ఈ ఘనతపై మురికి మరకలాంటి కథ ఉంది. హర్యానాలో జింద్, పానిపట్ వంటి పేర్లు కూడా ఇప్పుడు చాలా మందికి తెలుసు. రాష్ట్రం కష్టపడి సాధించిన మంచిపేరును నాశనం చేసే అమానుషాలు జరిగాయిక్కడ. స్థానిక పాలనాయంత్రాంగం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల మహిళలపై నీచమైన నేరాలు జరిగాయి.

హర్యానా బాలికలు సాధించిన విజయాలను తెరకెక్కిస్తూ మరో దంగల్ వంటి చిత్రం వచ్చే లోపు మురికి మరకలాంటి ఈ చీకటి హర్యానా ముఖాన్ని మార్చేసే ప్రయత్నం జరుగుతుందా? హర్యానాలో ఈ వైరుధ్యాన్ని రూపుమాపి, గొప్ప క్రీడాకారులు తప్ప ఈ అత్యాచారాల వార్తలు గుర్తుకురాని విధంగా హర్యానా మారుతుందా? క్రీడల్లో బంగారు పతకాలు సునాయాసంగా సాధిస్తున్న హర్యానా, మహిళల పట్ల, బాలికల పట్ల అత్యుత్తమ వ్యవహారశైలి విషయంలో కూడా బంగారు పతకం సాధిస్తుందా?

                                                                                                                                  – పౌలోమీ ఘోష్ (డైలీ ఓ)

Comments

comments