హరిత తెలంగాణ దిశగా ప్రభుత్వం

Government towards green Telangana

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచడమే లక్షం
రాష్ట్రంలో 230కోట్ల మొక్కలు నాటే ప్రక్రియ
నూతన పంచాయతీలతో స్థానిక పాలన కొత్త పుంతలు

మన తెలంగాణ/మహబూబాబాద్ : హరితహారం కార్యక్రమంలో పచ్చని తెలంగాణాగా తీర్చిదిద్దాలని, హరిత తెలంగాణ దిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరుగులు తీస్తోందని, రాష్ట్ర అటవీ విస్తీర్ణం 33శాతం పెంచడమే లక్షంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ పిలుపునిచ్చారు. కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో 4ఎకరాల స్థలంలో బుధవారం మొక్కలు నాటి 4వ విడత హరితహారం కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించారు. అలాగే మండలంలోని అయ్యగారిపల్లి నూతన గ్రామ పంచాయతీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే వానలు విరివిగా కురవాలంటే, కోతులు తిరిగి అడవికి వెళ్లాలంటే హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షాన్ని నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకంతో 230కోట్ల మొక్కలు నాటే లక్షంగా పెట్టుకుందని, అందులో భాగంగా ఇప్పటి వరకూ మూడు విడతల్లో 81కోట్ల మొక్కలు నాటినట్లు తెఇపారు. అలాగే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో 2కోట్ల 3లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.

స్థానిక పాలన కొత్త పుంతలు
మండలంలోని అయ్యగారిపల్లిలో నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామ పంచాయితీని మంత్రి చందూలాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రలో 4383 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటుచేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, మహబూబాబాద్ జిలాలాలో పాత పంచాయితీలు 231 ఉండగా కొత్తవి 230 మొత్తం 461 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున గ్రామ పంచాయితీలను ఏర్పాటుచేసిన మరో రాష్ట్రం లేదని ఆయన అన్నారు. నూతన పంచాయితీలు ఆవిర్భవించిన సందర్భంగా ఆయా గ్రామ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు క్షేమంగా ఉంటేనే ప్రభుత్వం క్షేమంగా ఉంటుందని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నంపడి కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా శివారు పల్లెలుగా, తండాలుగా ఉన్న పల్లెలు కొత్త పంచాయితీలు కావడంతో గ్రామ ప్రజల కలలు నెరవేరా యన్నారు. 14వ ఆర్ధిక సంఘ నిధులతోపాటు నేరుగా రాష్ట్ర బడ్జెట్ నుండి కూడా పంచాయితీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు దీనిద్వారా గ్రామాలు అభివృద్ది చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్రంలో ఎనలేని ప్రగతి: ఎంఎల్ఎ శంకర్‌నాయక్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎనలేని ప్రగతి సాధించిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్షంగా ముఖ్య మంత్రి కెసిఆర్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నో వినూత్న పథకాలను చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా బంగారు తెలంగాణ వైపు పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే అన్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతమైనే భావితరాలకు కాలుష్య నివారణ, సమతుల్య వాతావరణం అందించిన వారమవు తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి కట్కూరి దామోదర్‌రెడ్డి, డిఎఫ్‌ఓ కిష్టగౌడ్, మండల ప్రత్యేక అధికారి ఛత్రునాయక్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments