హరితహారం కావాలి సాకారం

Rubix-Art

మన తెలంగాణ/సూర్యాపేట : సూర్యాపేట జిల్లాను బహిరంగ విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దుకునేలా ప్రకటించడంతో పాటు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు శ్రద్ధ చూపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం హరితహారంపై జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో ఈ అంశంపై అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దడంలో అధికారుల పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేసే ప్రతి పనిలో పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. హరితహారం విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శులు సింహ భాగంలో ఉండాలని ఆయన కోరారు. 2014కు పూర్వం చెట్ల పెంపకం అనేది కాగితాలతో సరిపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం అంకెల గారడితో జరిగిన మోసాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో నిర్ధేశించిన ప్రతి మొక్క భూమి మీద నాటేలా చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు.

చెట్లు నాటడం అనేది ప్రజల భాగస్వామ్యంతో ఒక ఉధ్యమంలా కొనసాగిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. హరితహారం మొదలు పెట్టకముందు కాగితాల మీదనే అడవులు సృష్టించిన అంశాన్ని గణాంక వివరాలతో ఆయన బయటపెట్టారు. అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని అందులో సూర్యాపేట జిల్లా చెట్ల పెంపకంలో మరింత వెనకబడి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి సూర్యాపేట జిల్లా 12 వేల హెక్టార్ల భూ విస్తీర్ణంలో 33 శాతం భూమి అటవీ ప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటువంటిది లెక్కల్లో కేవలం 2.4 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉన్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. అంటే చెట్ల పెంపకంలో మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలని ఆయన ఉపదేశించారు. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో అడవుల్లో ఉండే కోతులు జనావాసాలకు వస్తున్న అంశాన్ని విస్మరించరాదని ఆయన కోరారు. కేవలం ప్రభుత్వ భూములలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ వ్యవసాయ భూములలో కూడా విరివిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అందుకు భిన్నంగా వ్యవహరిస్తే 2070 నాటికీ భారతదేశ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలు ఇక్కడ ప్రస్తవానర్హమేనంటూ ఆయన ఉపదేశించారు. నాలుగు దశాబ్ధాల క్రితం మంచినీళ్లు కొనుక్కొని తప్పుచేశామని ఆయన చెప్పారు. కాకతాయంగా చెబుతున్న విషయం కాదు కాని..మంచినీళ్లు కొనడం అనడం మొదట సూర్యాపేట పట్టణం నుండే మొదలైందని, నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడి నుండే అంకురార్పణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుగోలు అమ్మకాలు కూడా ఇక్కడి నుండే మొదలవుతాయా అన్న సందేహం వెంటాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిషోర్‌కుమార్, జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, జెడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డిఆర్‌డిఓ పిడి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Minister Jagadish Reddy Speech At Haritha Haram Project

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హరితహారం కావాలి సాకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.