స్వలింగ సంపర్కం నేరం కాదు

ఇతరులకున్న హక్కులు వారికీ ఉంటాయి, 377 సెక్షన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

Suprem-Court2

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంప ర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన భారత శిక్షాస్మృతి( ఐపిసి)లోని 377 సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఇతరుల హక్కులను తగ్గించడం సామాజిక నైతికత కాదని, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం సహేతుకం కాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపిసిలోని 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ ముక్తకంఠంతో తీర్పు చెప్పింది.

‘లైంగిక స్వభావం ఆధారంగా ఒకరి పట్ల వివక్ష చూపించడం అంటే వారి ప్రాథమిక హక్కులను హరించడమే. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జండర్, క్వీర్(ఎల్‌జిబిటిక్యు) వర్గానికి చెం దిన వారికి కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. ఐపిసి సెక్షన్ 377 సమానత్వ హక్కులకు భంగం కలిగిస్తోంది’ అని బెంచ్ తన 493 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. ఈ వర్గం సభ్యులను వేధించడానికి ఈ సెక్షన్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించున్నారని, ఫలితంగా వారి పట్ల వివక్షకు కారణమైందని ప్రధాన న్యాయమూర్తితో పాటుగా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఆర్‌ఎఫ్ నారిమన్, ఎం ఖన్విల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. శతాబ్దాలుగా అంతులేని వేదనను, వివక్షను ఎదుర్కొన్నందుకు ఈ వర్గం వారికి, వారి తల్లిదండ్రులకు సమాజం క్షమాపణ చెప్పాల్పి ఉం దని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యా ఖ్యానించారు. 377 సెక్షన్ కారణంగా ఈ వర్గం వారు రహస్యంగా, రెండోతరగతి పౌరులలాగా జీవించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రచూడ్ కూడా వ్యాఖ్యానించారు.

అసహజ నేరాలకు సంబంధించిన సెక్షన్ 377 ప్రకారం.. స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడిన వారికి పదేళ్లవరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ నాజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పరస్పర అంగీకారంతో ఒకే లింగానికి చెందిన ఇద్దరు వయోజనుల మధ్య జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించరాదని హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. అయితే 2013లో సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేసి తిరిగి పాత నిబంధనలనే వర్తింపజేయాలని తీర్పు చెప్పింది.

తాజాగా దీనిపై స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు, మరికొందరు 377 సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఏడాది జూలై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు చెప్పింది. దీంతో దాదాపు 157 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడినట్లయింది. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ప్రముఖ డ్యాన్సర్ నవ్‌తేజ్ జౌహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, ప్రముఖ చెఫ్ రితు దాల్మియా, హోటల్ యజమానులు అమన్‌నాథ్, కేశవ్ సూరి, వాణిజ్యవేత్త అయేషా కపూర్, పలువురు మాజీ, ప్రస్తుత ఐఐటి విద్యార్థులు ఉన్నారు.

Comments

comments