స్పెషల్ కిడ్స్‌కి ఆసరా పినాకిల్‌ బ్లూమ్స్

Special Kids are the mentally unstable children
మానసికంగా ఎదగని పిల్లలను స్పెషల్ కిడ్స్ అంటాం. దేశంలో ఇలాంటి వారి సంఖ్య 5 లక్షలకు పైమాటే. ఈ బాధితుల్లో ఒకడు సరిపల్లి కోటిరెడ్డి. తన కుమారుడికీ ఇటువంటి సమస్యే వచ్చింది.డాక్టర్లు ఆటిజం అని నిర్ధారించారు. అయినా కుంగిపోలేదు కోటిరెడ్డి. ఆటిజం ( బుద్ధి మాంద్యం) గురించి పరిశోధన మొదలుపెట్టాడు. చికి త్సతో కొంతవరకు ఈ సమస్యను నివారించగలి గారు. ఇలాంటి పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో పినాకిల్ బ్లూమ్స్ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు.  

తను స్థాపించిన పినాకిల్ బ్లూమ్స్ గురించి ఆయన మాట్లాడుతూ .. మా బాబుకు 20 నెలలున్నప్పుడు ఆటిజం వచ్చింది. అది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. కానీ ధైర్యంగా నిలబడ్డాను. ఆటిజంపై అధ్యయనం చేశాను. మా బాబుకు వచ్చింది సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినికిడి సమస్యగా తెలిసింది. వెంటనే అతడికి కాక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించాము.

ఆటిజం ఉన్న పిల్లలపై చాలా శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా పిల్లలు పెరిగేంత వరకు ఈ సమస్యలు బయటపడవు. నా బాధ నాకు కొత్త ఆలోచనలను కలిగించింది. ఇలాంటి ఆటిజం పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నాను. రీసెర్చ్ ప్రారంభించాను.
స్పెషల్ కిడ్స్‌కు ఎలాంటి థెరపీ ఇవ్వాలో అధ్యయనం చేశాం. అందుకోసం దాదాపు రూ. 4 కోట్ల వరకు ఖర్చయింది. సెంటర్ల ఏర్పాటు, కంపెనీ ఏర్పాటుకు రూ. 1.5 కోట్లు ఖర్చుపెట్టాం. మా సెంటర్ ద్వారా ఆటిజం గల పిల్లలకు స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ లాంటి సేవల్ని అందిస్తున్నాం.వీటన్నింటికోసం టెక్నాలజీని ఉపయోగించుకున్నాం. మొట్టమొదటిసారిగా మెషీన్ లెర్నింగ్, బిగ్‌ డేటా టెక్నాలజీని ఆసరాగా చేసుకున్నాం. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పాత్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులతో కూడిన 40 మంది నిపుణులు ప్రస్తుతం పూర్తిస్థాయి మా సంస్థలో సేవలందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి సైకాలజీలో మరింత పరిశోధన చేస్తున్నాం.

పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బందిపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. బాబు, పాప తల్లిదండ్రులకు ప్రతిరోజు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఇస్తాం. ప్రతి సెషన్‌లో పిల్లలకు అందిన సేవలపై తల్లిదండ్రులు పినాకిల్ కనెక్ట్ యాప్‌లో రేటింగ్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తుంటారు. ఇంట్లో పిల్లల ప్రవర్తన సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ అంశాల ఆధారంగా థెరపీలో మార్పు చేస్తుంటాం. ఆటిజం లక్షణాలున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మెలగాలో మా నిపుణులు యాప్ ద్వారా చెబుతుంటారు. సమస్య స్థాయినిబట్టి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు థెరపీ అవసరం అవుతుంది.

ప్రస్తుతం పినాకిల్ బ్లూమ్స్ కేంద్రాలు హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, మాదాపూర్, సుచిత్ర, వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉన్నాయి. మరో 7 కేంద్రాల విస్తరణకు ప్లాన్ చేస్తున్నాం. విస్తరణకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. విదేశాల్లోనూ విస్తరించే ఆలోచన ఉంది. ముఖ్యంగా ఫ్రాంచైజీకి ప్లే స్కూల్స్, చిల్డ్రన్ హాస్పిటల్స్, న్యూరాలజిస్ట్‌లకు ప్రాధాన్యమిస్తున్నాం. వీటికి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ.2-3 లక్షల పెట్టుబడి అవసరమౌతుంది. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో గవర్నమెంటు స్కూల్లో పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాటి ద్వారా ఉచితంగా సేవలు అందించాలనేది మాకోరిక.