సోనియా నాయకత్వమే మేలు

SONIYAభారత జాతీయ కాంగ్రెస్(ఐ) అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ- వర్కింగ్ కమిటీ – సమావేశానికి ముందు నాయకత్వ మార్పుపై అనుకూల, ప్రతికూల ఊహలతో నిమిత్తం లేకుండా, పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ మరో సంవత్సరం కొనసాగాలని నిర్ణయించింది. పార్టీ తన చరిత్రలో  ఎన్నడూ ఎరుగనంత గడ్డు పరిస్థితిని (లోక్‌సభలో 44సీట్లకు కుదించుకపోవటం, అనేక రాష్ట్రాల్లో అడ్రసు గల్లంతుకావటం) ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, కొందరు కోరుతున్నట్లు రాహుల్‌గాంధీకి పట్టం కట్టటంకన్నా, సోనియాగాంధీని కొనసాగించట మే మేలన్న అభిప్రాయానిది పై చేయి అయింది. పార్లమెంటులో ఇతర ప్రతిపక్షాలకుగాని, బయట రాజకీయ క్షేత్రంలో మిత్రపక్షాలకుగాని రాహుల్‌కన్నా ఆమె నాయకత్వమే ఆమోదయోగ్యమన్న వాస్తవాన్ని వర్కింగ్‌కమిటీ పరిగణనలోకి తీసుకుంది. మోడీప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శనగా వెళ్లిన 14 ప్రతిపక్షపార్టీలకు సోనియాగాంధీయే నాయకత్వం వహించారు. మరోవైపున అక్టోబర్‌లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలే గాక 2016లో అసోం, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతాయి. అసోం, కేరళల్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే అధికారం నిలబెట్టుకుంటామనే ఆశలు బలంగా లేవు. ప.బెంగాల్, తమిళనాడులో ఉనికిని కాపాడుకునే స్థితిలో ఉంది. అందువల్ల రాహుల్‌గాంధీకి పార్టీ అధ్యక్షబాధ్యత ఇప్పుడు అప్పగించటంవల్ల అతని భవిష్యత్‌కు నష్టం వాటిల్లుతుందన్న భావన కూడా పార్టీనాయకత్వంలో ఉంది. అయితే సంవత్సరం తర్వాత కూడా రాహుల్ ఆ పదవిలోకి రాకపోవచ్చు. ఈ సంవత్సరంలో సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, వాటిని వాయిదావేసిన కారణంగా పార్టీ అధ్యక్షురాలి పదవీకాలాన్ని పొడిగించారు. వచ్చే సంవత్సరంలో జరిగే ఎఐసిసి మహాసభలో తిరిగి ఆమెను ఎన్నుకునే అవకాశాన్ని ఇప్పుడే త్రోసిపుచ్చగలవారెవరూ లేరు.
కాంగ్రెస్ సంస్థ భవిష్యత్ దృష్టా, పార్టీని సంస్థాగతంగా అన్ని స్థాయిల్లో పటిష్టం చేయటం, కొత్త రక్తాన్ని నింపటం ఇవాళ అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. కాంగ్రెస్ పార్టీ తన మధ్యేమార్గ, పేదల అనుకూల (మాటల్లోనైనా) మార్గంనుంచి వైదొలిగి స్వదేశీ, విదేశీ గుత్తపెట్టుబడిదారీ అనుకూల నయా ఉదార ఆర్థిక సంస్కరణలను భుజాన వేసుకోవటం, తత్పర్యవసానమైన అనేక భారీ ఆర్థిక కుంభకోణాల్లో చిక్కుకోవటంతో ప్రజలకు దూరమైంది. ఇప్పుడు నరేంద్రమోడీ ప్రభుత్వ వాగ్దాన భంగాలను, వైఫల్యాలను విమర్శించినంత మాత్రాన పునరుజ్జీవనం జరగదు. వాటితోపాటు ప్రజానుకూల కార్యక్రమాలను కూడా ముందుకు తేవాలి. పార్టీకి సుదీర్ఘకాలం విధేయులుగా ఉండి, క్రమంగా దూరమైన, దూరమవుతున్న తరగతుల్లో విశ్వాస పునరుద్ధరణ ఎంతో అవసరం. అటువంటి  ఆత్మవిమర్శ, భవిష్యత్ కార్యక్రమం ఏదీ వర్కింగ్ కమిటీ సమావేశంలో జరిగినట్లు కనిపించలేదు, పార్టీ అధికార ప్రతినిధుల నోటినుంచి వినిపించలేదు.
ఇప్పుడు వర్కింగ్ కమిటీలో జరిగింది తల్లీ, కుమారుడి (అధ్యక్షు రాలు, ఉపాధ్యక్షుడు) మధ్య పనివిభజన. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాలు చూస్తారు.  రాహుల్‌గాంధీ పార్టీ నిర్మాణ విషయాలు చూస్తారు. రాష్ట్రాల అధ్యక్షులు ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శుల ద్వారా కాకుండా నేరుగా తనతోనే రాష్ట్ర వ్యవహారాలపై సంప్రదించాలని రాహుల్ కోరటం పార్టీపై పట్టుపెంచుకునే ప్రయత్నంలో భాగమే.  పార్టీ సభ్యత్వంలో క్రియాశీల సభ్యులు, సాధారణ సభ్యులనే పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ పార్టీ నిబంధనావళికి సవరణ చేశారు. 25మంది సభ్యులను చేర్చినవారు క్రియాశీల సభ్యులు. సంస్థాగత ఎన్నికల్లో పాల్గొనేందుకు వారే అర్హులు.ఆఫీసుబేరర్ల పదవీ కాలాన్ని మూడునుంచి రెండేళ్లకు తగ్గిస్తూ మరో సవరణ ఆమోదించారు. పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలు, ఎస్‌సిలు,ఎస్‌టిలు, మైనారిటీల రిజర్వేషన్‌ను 20 నుంచి 50 శాతానికి పెంచుతూ ఆమోదించిన సవరణ ముఖ్యమైంది. పార్టీ నాయకత్వ కమిటీల పొందికలో మార్పు తేవటమేగాక, పార్టీకి దూరమైన తరగతులను వెనక్కి తెచ్చుకోవాలన్న ఆత్రుతకూడా అందులో ఉంది. అయితే దీన్ని అమలుపరచటంలో స్థిరపడిన శక్తులనుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎదుర్కొనే ధైర్యాన్ని ఆచరణలో ప్రదర్శించటం ముఖ్యం. ఏదిఏమైనా, నేడున్న అత్యంత పరిస్థితి నుంచి గట్టెక్కటం ఇప్పట్లో సాధ్యం కాదని పార్టీ నాయకులందరికీ తెలుసు. పార్టీని ఒక్కొక్కమెట్టు ఎక్కించటానికి ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీప్రభుత్వచర్యలు, సంఘ్‌పరివార్ దుందుడుకు కార్య కలాపాలకు వ్యతిరేకంగా, తిరోగమన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తుల సమీకరణ శక్తిగా పనిచేయ గలిగితే కాంగ్రెస్‌కు జవసత్వాలు సమకూరుతాయి. కాని అటువంటి ఆలోచన, కార్యక్రమం కాంగ్రెస్‌పార్టీకి ఉందా? ఇది హిమాలయమంత ప్రశ్న.

Comments

comments