సోదరప్రేమకు రక్ష

Happy Raksha Bandhan 2018

అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. నీకు నేనున్నాను నీకేం కాదనే భరోసా నిస్తూ, అతడికి భగవంతుని అండదండలు ఉండాలని కోరుకుంటూ కట్టేదే రక్షాబంధనం. రక్త సంబంధం విలువను, గొప్పదనాన్ని తెలిపే తీపి వేడుక.

అన్నాతమ్ముళ్లు కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అక్కాచెల్లెళ్లు కట్టే రక్ష రాఖీ. అదేవిధంగా చెల్లెల్ని కంటికి రెప్పగా చూసుకుంటానని అన్న ఇచ్చే భరోసా కూడా. రాఖీ, రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి గా పిలిచే ఈ పండుగను శ్రావణపౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అనికూడా అంటారు. అక్కాచెళ్లళ్లను ప్రేమగా చూసే సహోదరులు ఆమె కట్టిన రాఖీని కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటారు. కొంతమంది అయితే రాఖీ దానంతట అదే తెగిపోయే దాకా ఎన్నిరోజులైనా చేతి నుంచి తీయరు. అంత సెంటిమెంట్ రక్షాబంధన్‌కి. ఇది కేవలం మహిళలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు కూడా కట్టుకోవచ్చు. భార్య భర్తకు, సోదరి సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు తలబెట్టే కార్యాలు విజయంవంతం కావాలని, సుఖసంతోషాలు సంపదలు కలగాలని ఆకాంక్షించే చక్కని సంప్రదాయం రాఖీ పండుగ విశిష్టత. రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు ఆడబిడ్డలకు నూతన వస్త్రాలు కానుకలు సమర్పిస్తారు. అందరూ కలిసి ఆత్మీయంగా భోజనాలు చేస్తారు.

రాఖీ ఎలా కట్టాలంటే….
శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయ కాలంలోనే స్నానవిధి పూర్తిచేయాలి. ఎవరిని రక్షించదలిచామో అంటే నేటి నుంచి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి రక్షిక రాఖీని దైవం ముందుంచి పూజచేయాలి. వరుడు కట్టబోయే మంగళసూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నదీ రక్షాబంధన్‌కి. అందుకనే రాఖీకి పూజ చేయాలి. పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింపజేయడమన్నమాట. రాఖీని ఓ ఏడాదిపాటు మనం ఎవరిని రక్షించదలిచామో అతడి ముంజేతికి కట్టాలి. ఈ కట్టడానికి కూడా ఒక సమయం ఉంటుంది. అపరాహ్ణ సమయంలో (అంటే అహ్నం అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం 12దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుంచి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది. అందునే ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదామని తెలుస్తోంది. రక్షా బంధనం కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకు కట్టుబడి ఆ ఏడాదంతా ఆమెకు అండగా ఉండాలి. రాఖీ కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి.

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామపి బధ్నామి రక్షే! మా చలమాచల!
రాక్షసులకు రాజూ మహా బలవంతుడూ అయిన బలిచక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికను కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రుడికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీ నుండి తొలగకుండుగాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికను కుల పురోహితుడు ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపు కోవడంలో మాత్రం సరిపెట్టుకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజ శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.

రూపు మారిన రాఖీలు: రాఖీ అంటే పైన చిన్న బిళ్ల రంగు తాడు మాత్రమే కాదు. ట్రెండీగా, స్టైలిష్‌గా కూడా కనిపించాలి. ఇప్పుడన్నీ సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు కదా మరి రాఖీలు కూడా వెరైటీగా కనిపించాలని కోరుకుంటోంది ఇప్పటి తరం. ఈ విషయాన్ని గ్రహించిన వ్యాపారస్తులు యువత అభిరుచులకు తగ్గట్టుగా విభిన్నమైన వినూత్నమైన రాఖీలను రూపొందిస్తున్నారు. దీంతో రాఖీల్లో కొత్త కొత్తడిజైన్లు వస్తున్నాయి. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు కొనుగోలు చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట వరకు పెద్ద సైజుల్లో అరచేయంత ఉండేవి రాఖీలు. అవి క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ట్రెండ్ అంతా చిన్నగా ఉండి క్రియేటివిటీ మాత్రం పెద్దగా ఉంటోంది. బంగారం, వెండితో తయారుచేసిన రాఖీలకు కూడా డిమాండ్ ఎక్కువే. పిల్లల కోసం కార్టూన్ రాఖీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. యాంగ్రీబర్డ్, బోటూ పట్లు నింజా హటోరి డోరేమాన్ మిక్కీమౌజ్, లిటిల్ హనుమాన్, భీమ్‌లాంటి కామిక్ పాత్రలున్న రాఖీలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఒకప్పుడు రూ.5,10కి దొరికే రాఖీలు ప్రస్తుతం డిజైన్లను బట్టి వందల్లోకి , వేలల్లో లభిస్తున్నాయి. రాఖీతో పాటు మిఠాయి డబ్బాలు, చాక్లెట్ బాక్సులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.

పురాణ కథలు: ఒకసారి రాక్షసులు దేవతలపై దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసిసొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవడం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధంలో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందిగా త్రిమూర్తులను ప్రార్థించింది. ఆ క్రమంలో ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, తిరిగి యుద్ధానికి వెళ్లమని ఆయనను ఉత్సాహపరిచింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు. రక్షాబంధన ప్రాశస్తాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో అప్పటి నుంచి ప్రతి శ్రావణ పూర్ణిమ నాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కోరుకుంటున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి రక్షణనివ్వవలిసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షా కంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారి నుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలబడాలని కోరుతూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రాఖీని కట్టడం, వారికి తీపి తినిపించడం, నీకు అండగా నేను ఉన్నానని అభయమిస్తూ సోదరులు వారి శక్తిమేరకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారం రూపుదిద్దుకుంది.

– ద్రౌపది కృష్ణుడి అన్నాచెల్లెళ్ల బంధం చాలా గొప్పది. శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అదిగమనించిన దౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడు.

-భారత్ మీద క్రీస్తుపూర్వం 326 లో దండెత్తిన అలెగ్జాండర్ భార్య రొక్సానా భారతీయ రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టి, తన భర్తకు హాని తలపెట్టవద్దని కోరిందట. అందువల్ల యుద్ధ రంగంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు ప్రాణాలతో విడిచిపెట్టినట్లు కథనం. మొఘల్ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తు శకం 1535లో చిత్తోర్ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయాన్ని పొందిందట. భర్త మరణించగా, చిత్తోర్ రాజ్యపాలనా బాధ్యతలు చేపట్టిన రాణికి గుజరాత్ సుల్తాన్ బహదూర్‌షా నుంచి బెడదగా ఉండేదట. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ కర్నావతి హుమయూన్‌కు రాఖీ పంపిందట. దీంతో హుమాయున్ ఆమెను సోదరిగా అంగీకరించి రక్షణ కల్పించినట్లు కథనం.

-సిక్కు పాలకుడైన రాజా రంజిత్‌సింగ్ భార్య మహారాణి జిందన్ కౌర్ 18 వ శతాబ్దిలో నేపాల్ రాజుకు రాఖీ పంపింది. ఆమెను సోదరిగా అంగీకరించిన నేపాల్ రాజు ఆ సోదర భావంతోనే, బ్రిటిష్ సైన్యాలు పంజాబ్‌ను ఆక్రమించుకున్నప్పుడు రాజా రంజిత్‌సింగ్ దంపతులకు తన రాజ్యంలో ఆశ్రయం కల్పించాడు. బ్రిటిష్ పాలకులు 1905లో బెంగాల్‌ను రెండుగా విభజించారు. ఈ విభజన హిందూ ముస్లింలలో విభేదాలను సృష్టించింది. ఉభయ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి సోదర భావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్ ఒక్కటే సరైనదని భావించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అప్పట్లో ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన రక్షాబంధన్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో రక్షాబంధనం..
కాలం మారడంతోపాటు రక్షాబంధనం తీరుకూడా మారింది. విద్య, ఉపాధి ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్‌లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్‌లైన్ ద్వారానే కానుకలు స్వీకరించే విధానం ప్రస్తుతం నడుస్తోంది.

వివిధ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారంటే… -పశ్చిమబెంగాల్ ఒడిశా రాష్ట్రాలో రాఖీ పండుగ రోజున రాఖీని కట్టుకోవడంతోపాటు రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనిని వారు ఝులన్ పూర్ణిమ (ఊయల పూర్ణిమ) గా వ్యవహరిస్తారు.

ఒడిశాలో కొన్ని చోట్ల గుమ్మా పున్నమిగా కూడా చేసుకుంటారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, రెండువై పులా పొడవైన వెదురు బొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్దీ మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టికొట్టడం లాంటిదే.

మహారాష్ట్రలో ఇదే రోజున నారాలీ పూర్ణిమ
( కొబ్బరి పున్నమి) వేడుకలు చేస్తారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచి పెట్టి , వరుణ దేవుడికి పూజలు నిర్వహిస్తారు.

నేపాల్‌లో జునై పూర్ణిమ అని పిలుచుకుం టారు. సోదరులకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడా మగా పిల్లాపెద్దా అందరికీ అక్కడి పూజా రులు పవిత్ర రక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తి కొద్దీ కానుకలు సమర్పించుకుంటారు.

-జమ్ము కశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరు బయటకు వచ్చి గాలిపటాలను ఎగురవేస్తారు.

జంద్యాల పౌర్ణమి.. యజ్ఞోపవీతం ధరించవలసిన రోజు.  శ్రావణి అంటే యజ్ఞోపవీతం. ఒక నియమాన్ని సూచించే ప్రతీక యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం ధరించిన వ్యక్తి బ్రహ్మవిద్యా అభ్యసనంలో ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తుంది. జంద్యాన్ని ఎవరికి వారు సిద్ధం చేసుకోవాలి. నూలును వడికి 96 బెత్తలు చుట్లు చుట్టి, దాన్ని తిరిగి మూడు వరుసలు మార్చి, దాన్ని మళ్లీ  ఒకే దారంగా సిద్ధం చేసుకోవాలి. మనిషి దేహంలో 96 గుణాలు ఉన్నాయని వేదాంత ధర్మం చెబుతోంది. ప్రాజాప్యత్యాధి మహర్షులను అర్చించి, నాలుగు వేదాల ప్రారంభ మంత్రాలను స్తోత్రం చేసి, పిమ్మట యజ్ఞోపవీతాన్ని ధరించాలి. పాత జంద్యాన్ని శిరస్సు నుంచి కాకుండా కింద నుంచి తొలగించాలి.

సోదరప్రేమకు హెల్మెట్ రక్ష: సిస్టర్ ఫర్ ఏ ఛేంజ్ ఆలోచన ఎలా వచ్చిందంటే.. వరంగల్లుకు చెందిన వంశీ  ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. దాంట్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల తన అన్న చనిపోవడాన్ని ఓ చెల్లి గుర్తుకు చేసుకుంటుంది. హెల్మెట్ ఇచ్చి ఉంటే అన్నయ్య బతికి ఉండేవాడు అనుకుంటుంది. ఆ కాన్సెప్ట్‌ను తీసుకుని వంశీ నన్ను కలిశాడు. ఎలాగైనా హెల్మెట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరాడని నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపింది. ఈ రోజుల్లో ఎన్ని ఫైన్‌లు వేసినా, జైల్లో పెడతామని బెదిరించినా చాలా మంది హెల్మెట్ వాడటంలేదు.  రూల్స్‌ను బ్రేక్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. వంశీ  ఐడియాతో మా అన్న కెటిఆర్ పుట్టినరోజు  జూలై 24న సిస్టర్ ఫర్ ఏ ఛేంజ్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టి రాఖీ వరకు కొనసాగించాను.  పోయిన సంవత్సరం ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు ఏడెనిమిది రాష్ట్రాలు మద్దతునిచ్చాయి. ఈసారి కూడా ఇస్తున్నాయి. ఎంత స్టయిల్‌గా ఉండాలన్నా ముందు తల ఉండాలికదా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ నిర్లక్షం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది యువత. అందుకనే కొంతమంది సెలబ్రిటీల చేత హెల్మెట్‌పై అవగాహన కల్పించాం. ఈసారి మహేష్‌బాబును అప్రోచ్ అయ్యాం.  ప్రతి రోజూ దాదాపు 28 మంది యువతీయువకులు రోడ్ ఏక్సిడెంట్స్‌లో  హెల్మెట్ ధరించక పోవడం వల్ల మరణిస్తున్నారు.  ఈ ఏడాది కూడా సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటై ఎంపీ కవిత వెల్లడించారు. ఈ ఏడాది కూడా అన్న కెటిఆర్‌కు రాఖీ కట్టి హెల్మెట్ బహూకరిస్తానని కవిత ట్విట్టర్ ద్వారా తెలిపింది.

-మల్లీశ్వరి వారణాసి