సెల్‌ఫోన్‌ డ్రైవింగ్…ప్రాణంతో చెలగాటం

Motorists who die of death
తల్లాడ: చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోతే ఏదో పోగొట్టుకున్నామనే ఆలోచన. ఎప్పుడు ఎక్కడ నుండి ఫోన్ వస్తుందోనని ఒకటే దిగులు. మానవ జీవితంలో సెల్‌ఫోన్ ఓ భాగమయింది. నేటి యాంత్రిక ప్రపంచంలో సెల్‌ఫోన్ లేకుండా క్షణమైనా గడవని పరిస్థితి నెలకొందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఫోన్ తీసుకోకపోయినా, స్విచ్ఛాఫ్ అయినా మనలో ఉత్కంఠత పెరుగుతుంది. దీంతో మనస్సులో అలజడి మొదలై ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడుతుంది. అదే సెల్‌ఫోన్ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా దానిని వీడేందుకు ఇష్టపడని పరిస్థితి వాహనదారుల్లో నెలకొంది. వాహనదారులు కారు నడిపేటప్పుడు స్టిరింగ్‌ను ఒక చేతితో పట్టుకొని మరో చేతితో సెల్‌ఫోన్‌ చెవివద్ద పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ సంభాషిస్తుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు గమనించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై జరిగే ప్రమాదాలలో సెల్‌ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపే వారే గాయపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అధికంగా ఉన్నాయి. పోలీసులు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వాహన దారులను ఆపి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వాహన దారుల్లో ఎటువంటి మార్పు, చైతన్యం కలగకపోవడం గమనార్హం. ద్విచక్ర వాహనంపై యువత ట్రిపుల్‌డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, అతి వేగంగా వాహనాన్ని నడపడంతో మరో వాహనాన్ని ఢీ కొడుతున్నారు. సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఆలోచన ప్రక్కదారి పట్టడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. బస్సు ఎక్కే సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే ఆ సమయంలో సెల్‌ఫోన్‌తీస్తూ పుట్‌బోర్డుపైనుండి క్రింద పడి ప్రాణాలు గాలికొదిలిన సంఘటనలు ఉన్నాయి. రోడ్లపై వెళ్లే పాదచారులుసైతం ఇయర్‌ఫోన్స్‌తో సెల్‌లో మాట్లాడుకుంటూ నడుస్తుండడంతో ప్రక్కన ఏ వాహనం వస్తుందో గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. సమాజంలో వున్న వ్యక్తులతో ఇంతగా పెనవేసుకుపోయిన సెల్‌ఫోన్‌ను వాహనదారులు డ్రైవింగ్ సమయంలోపైన సెల్‌పోన్ ప్రక్కన పెడితే కోంతవరకైనా ప్రమాదాలను అరికట్టవచ్చును.