సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి

State Finance Department has to steps to prevent seasonal diseases

మన తెలంగాణ/కరీంనగర్ : అన్ని పురపాలక సంఘాలలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. పట్టణాలలో పారిశుధ్ద అమలు, ఖాళీ స్థలాల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల పై సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసే విధంగా అన్ని మున్సిపాలిటిలలో తగు చర్యలు తీసుకోవాలని, పొడి చెత్తను కొనే వారిని గుర్తించాలని చెత్తను తీసుకోపోవటానికి కావలసిన ఆటోలు, రిక్షాలు, దినసరి కార్మికులు సరిపడినంత లేకపోతే తాత్కాలికంగా కార్మికులను తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విషయాలు సమగ్రమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డుల వలన చుట్టు ప్రక్కల ప్రజలకు హాని కలుగకుండా చూడాలని, ఎప్పటి చెత్త అప్పుడే తరలించి నగరాలను సుందరంగా ఉంచాలని తెలిపారు. వర్షం పడిన చోట డ్రైనేజి నీళ్లు నిలువ వుండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం బ్లీచింగ్ పౌడరు చల్లించాలని, దోమల నివారణ కొరకు రెగ్యూలర్‌గా ఫాగింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఖాళీ స్థలాలు
ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ వాటిని శుభ్రం చేయాలని అట్టి ఖాళీ స్థలాల వలన చెత్త పేరుకుపోయి ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశమున్నదని, ఖాళీ స్థలాలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని శుభ్రం చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని ఖాళీ స్థలాల వారు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రాకపోతే అట్టి స్థలం మున్సిపల్ పరిధికి చెందుతున్నట్లు చిన్న బోర్డు ఏర్పాటు చేయమని సూచించారు.

పందుల బెడద
అన్ని మున్సిపాలీటిలలో పందుల కొరకు స్థలాలను కేటాయించాలని పట్టాణానికి 5-10 కి.మి దూరంలో ఉండే విధంగా చూడాలని అన్నారు. పందుల కొరకు ఎస్‌డిఎఫ్ నిధులు వినియోగించుకోవాలని భూమిని కొనుగోలు చేసి వారికి ఇవ్వాలని, ప్రభుత్వం సీజన్‌లో కోటి రూపాయలు ఖర్చు చేస్తే పందుల వలన డెంగ్యూ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి ప్రజలు కోట్ల రూపాయలు హాస్పిటల్స్ వైద్యం కొరకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అనంతరం మంత్రి కలెక్టరేటు సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగర పంచాయతీలు, మున్సిపాలీటిలు, కార్పోరేషన్లతో సమీక్షించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటి ఇంటికి నల్లా నీరు మిషన్ భగీరథ 70-80 శాతం పనులు పూర్తయ్యాయని, దసరాలోపు రక్షిత మంచినీటి కార్యక్రమం సఫలం కావాలని దానికి తక్షణమే పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేయుటకు పనులను వేగం చేయాలని అధికారులకు ఆదేశించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు
అన్ని పట్టణాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రోగ్రస్‌లో ఉన్నాయని దసరా, దీపావళి లోపు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పనులను వేగవంతంగా పూర్తి చేయుటకు తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. శానిటేషన్ విషయంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైతే తాత్కాలిక కార్మికులను నియమించుకోవాలని, పట్టణాలలో మంచి డ్రైన్లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసుకోవాలని, అన్ని మున్పిపాలీటీలలో తడి, పొడి చెత్తలను వేరు చేసే విధంగా చూస్తున్నట్లు అన్నారు. నాలుగ విడత హరితహారంలో అనుకున్న లక్షం పూర్తి స్థాయిలో సాధించాలని, ప్రతి ఇంటిలో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని సూచించారు. సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్, శాసన సభ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్,కృష్ణభాస్కర్, శ్రీ దేవసేన, ప్రభుత్వ సలహాదారు వివేక్ , ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, మేయర్లు సర్ధార్ రవీందర్ సింగ్, లక్ష్మీనారాయణ, ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.