సీక్రెట్ సూపర్ స్టార్

టీవీ మన లివింగ్ రూం సభ్యురాలై చాల యేళ్ళు గడిచిపోయాయి. నలుపు తెలుపు నుంచి రంగులతో వందల ఛానల్స్ తో చిన్నవి పెద్దవి బాగా పెద్దవి యిలా అనేక పరిమాణాల్లో యెప్పటికప్పుడు కొత్త టీవిసెట్స్ కోసం తప్పనిసరిగా మన బడ్జెట్ లో మనం కొంత కేటాయిస్తూనే వున్నాం. అందులో వచ్చేకొన్ని షోస్ మనలని పిల్లలని భలే ఆకట్టుకోవటం మనందరికి అనుభవమే. ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ మొదలైనప్పుడు అమితాబ్ గారి గంభీర్య మైన స్వరంకి అతని స్క్రీన్ […]

టీవీ మన లివింగ్ రూం సభ్యురాలై చాల యేళ్ళు గడిచిపోయాయి. నలుపు తెలుపు నుంచి రంగులతో వందల ఛానల్స్ తో చిన్నవి పెద్దవి బాగా పెద్దవి యిలా అనేక పరిమాణాల్లో యెప్పటికప్పుడు కొత్త టీవిసెట్స్ కోసం తప్పనిసరిగా మన బడ్జెట్ లో మనం కొంత కేటాయిస్తూనే వున్నాం. అందులో వచ్చేకొన్ని షోస్ మనలని పిల్లలని భలే ఆకట్టుకోవటం మనందరికి అనుభవమే.
‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ మొదలైనప్పుడు అమితాబ్ గారి గంభీర్య మైన స్వరంకి అతని స్క్రీన్ ప్రేజెంస్ కి మనం సమ్మోహితులయి మన కళ్ళని చెవులని బై అపాయింట్ మెంట్ ప్రేక్షకులమైపోయాం. కానీ ఆ ప్రోగ్రాం మొదలైనప్పుడు ఆ షో మన పిల్లలని రెడ్ కార్పెట్ మీద నడిపించే సినిమా కథ అవుతుందని మనం వూహించలేదు. మన రెహమాన్ గారికి ఆస్కార్ ని యిచ్చి జై హో అంటుందనీ అనుకోలేదు. ‘స్లం డాగ్ మిలినీర్’ కి అన్ని ఆస్కార్స్ రావటం వెనక వున్నది వొక టీవీ ప్రోగ్రాం పిల్లలలో జిజ్ఞాసని యెంతలా ప్రభావితం చేస్తుందో మనం ఆ సినిమాలో చూసాం.

తమిళ నాడులో వొక పేద కుటుంబానికి వొక టీవిని యిచ్చినప్పుడు ఆ యింట్లో పిల్లలకి పిజ్జా ప్రకటన బాగా ఆకర్షిస్తుంది. పిల్లలు పిజ్జాని రుచి చూడాలనుకొంటారు. ఆ పిజ్జా కోసం వాళ్ళు డబ్బులు కూడపెట్టటం, అక్కడ వర్గభేదపు అడ్డుని చూపిస్తూ వాళ్ళని ఆ పిజ్జా అవుట్ లెట్ వాళ్ళు లోపలి రానివ్వరు. అప్పుడు అవుట్ లెట్ వారికి యేమవుతుంది, ఆ పిల్లల కుతూహలం యెలా తీరుతుంది అని తమిళంలో ‘కాకముటై’ అనే సినిమా వచ్చింది.

యిప్పుడు యెంతో మందిని ఆకట్టుకొన్న ‘సీక్రెట్ సూపర్ స్టార్‘ సినిమా కూడా టివీ లో వచ్చే వొక సూపెర్ సింగర్ ప్రోగ్రాం నేపథ్యంలో వచ్చింది. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రోమో చూసినప్పటి నుంచి యెప్పుడెప్పుడు యీ సినిమాని చూద్దామాని యెంతో ఆసక్తిగా యెదురు చూసిన నేను, దీపావళి రోజు విడుదలైన యీ సినిమాకి మార్నింగ్ షో కి ఆత్రంగా వెళ్లాను. సినిమా అయి బయటకి వస్తుంటే లలితమైన వెలుగు మనసంతా.

సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఆద్యంతం నూతన దర్శకుడు అద్వైత్ చందన్ యీ సీక్రెట్ సూపెర్ స్టార్ ని మలచిన తీరు అనేక రకాల భావోద్వేగాలకి లోను చేసింది. అనేక సార్లు పాత్రలతో మమేకమై నవ్వా. కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నా. ముఖ్యంగా అతను కథని చూపించిన తీరు ఆద్యంతం
తల్లీ కూతురు కథ. భార్యా భర్త కథ. తల్లితండ్రి పిల్లలు కథ. అక్కా తమ్ముని కథ. అత్తా కోడలి కథా. పసి స్నేహాల మృదువైన ఆకర్షణల కథ. గాయపడిన సంగీత దర్శకుడు కలలు కనే నూతన గాయనీ కథ.

వెరసి మన జీవితాల్లోని ఆశానిరాశలు. సంతోష సమయాలు. ఆకాశపు అంచులు దాక యెగిరే కలలు. సహనంగా నిరీక్షించటం. యిరిటేట్ అవ్వటం. ఆ కలల సాకారం కోసం చేసే సాహసాలు. తోడు నిలిచే స్నేహం. నిషేధాల పరదాల్ని తొలగించుకొనే లేత చేతి వేళ్ళ విజయపు స్పర్శా. ఆధునిక టెక్నాలజీ వేదికగా నిలవటం. ప్రశంసకి పొంగిపోవటం. ప్రపంచం ముందు విజేతలుగా యెవరు నిలుస్తారు. ఆ విజయం వెనుక యెవరుంటారు.

సూపర్ సింగర్ ప్రోగ్రామ్ టివీ లో చూస్తూ వొక తల్లి మెహర్ , కూతురు జైరా వసీం యెవరు సూపర్ స్టార్ అవార్డ్ గెలుచుకొంటారోనని వాళ్ళిద్దరూ పందెం వేసుకుంటారు. పాటలని శ్రావ్యంగా పాడే ఆ పదిహేనేళ్ళ జైరాకి సూపర్ సింగర్ ప్రోగ్రాం లో పాడాలని వుంటుంది. తల్లికీ జైరా పాడాలనే ఆసక్తి వుంటుంది. జైరా పాడటానికి సంబంధించిన ఆసక్తిని, పాడే నైపుణ్యాన్ని మెహర్ యెంకరేజ్ చేస్తుంటుంది. కానీ ఆ బాలికకి అసలు ఆ పోటీ వరకు వెళ్ళడానికే ఆ కుటుంబ వాతావరణంలోని మానసిక పరిస్థితుల వల్ల చాల స్ట్రగుల్ అవాల్సి వస్తుంది.

జైరా క్లాస్ మేట్ చింతన్ గా తిర్త్ శర్మ నటన భలే ముద్దుగా వుండటంతో మన పెదవులపై చిన్ని చిన్ని నవ్వులని పూయిస్తూనే వుంటుంది. అలానే తండ్రి రాజ్ అర్జున్ నటన మన చెంపల్ని చెళ్ళు చెళ్ళు మనిపిస్తూనే వుంటుంది.
అమీర్ ఖాన్ కి సినిమాల పట్ల వున్న యిష్టం గౌరవం అంతాయింతా కాదు. తను వెయ్యాల్సిన పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు… ఆ పాత్రలో యిమిడి పోవటమే అతనికి తెలుసు. యిందులోనూ హృదయంతో పాడాలా బాడీ తో పాడాలా అన్నది యెవరు నిర్ణయిస్తారు… యేది ట్రెండ్ యేది పాత… అనేక సందిగ్ధ్దాల నడుమ అతనికి జైరాకి నడుమ సాగే సంభాషణలు చూస్తే అలాంటి వొక పాత్ర చేసిన అమీర్ ఖాన్ గారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపించింది యెప్పటిలానే.

మన వికాసం కోసం మన పిల్లల వికాసం కోసం మనం చిన్ని చిన్ని తిరుగుబాటులని చేస్తాం. మన కాళ్ళ కింద నేల కదులుతున్నప్పుడు తిరుగులేని నిర్ణయాలని ప్రకటిస్తాం. అలానే యీ సినిమాలో కూడా ఆ తల్లీ కూతుర్లు చిన్న చిన్న సరదాలు ఆసక్తుల కోసం చేసే చిన్నిచిన్ని తాత్కాలిక మైన తిరుగుబాట్లు సర్దుబాట్లు చేస్తూనే యెప్పుడైతే తమ జీవన ఆకాంక్ష మూర్ఖత్వానికి బలై పోతుందో అప్పుడు వొక శాశ్వత పరిష్కారానికి ఖచ్చితమైన అడుగు వేస్తారు యీ తల్లీకూతురు.

పాటని హృదయంతో పాడతారా బాడీ తో పాడతారాలానే సినిమాలని మనసుపెట్టి తీస్తారా మైనస్ మనసు తీస్తారా అన్నది యెవరికి వారే నిర్ణయించుకోవలసిందే. సినిమానే కాదు జీవిత పార్శ్వాలని పూర్తి గా అర్థం అయితే తప్పా ఆ సున్నితత్వం సత్యంగా హృదయంతరాళాల్లో నిండుగా వుంటే తప్పా అమీర్ ఖాన్ కాలేరు యెవ్వరు. అతనికి జేజేలు. ముఖ్యంగా చాలా తెలుగు సినిమాల్లో మన హీరోయిన్స్ ని మేరీ ప్యారీ అమ్మి… అవును అమ్మలు ప్రియమైన వాళ్ళే కాదు… అమ్మ అసలుసిసలు అద్భుతం. మన నిజమైన సూపర్ స్టార్స్.

మన ఆకాంక్షలు, మన కలలు రూపుదిద్దుకోవటంలో యీ రోజుటివీ, సినిమా, టెక్నాలజీల పాత్ర చాలా వుంది. అవి యెలాంటి అభిరుచులని, స్వప్నాల్ని, లక్షాలని మన ముందు వుంచుతుందనే విషయాన్ని మనం మాటాడుకోవాలి. అలానే మాతృత్వం అన్నది సహజంగా జన్యుపరంగా తరతరాల సంసృ్కతి ద్వారా కాకుండా టీవి ద్వారా ప్రచార సాధనాల ద్వారా సినిమాల ద్వారా రూపు దిద్దుకొంటోంది. కాబట్టి మాతృత్వపు విలువలు తల్లి ప్రేమలు, యిలానే అనేక విషయాలకి సంబంధించిన విషయాల గురించి మాటాడుకొంటున్నప్పుడు టివీలు సినిమాలు అవి యేం ప్రచారం చేస్తున్నాయి, యెవరి ప్రయోజనం కోసం చేస్తున్నాయి అన్నది కూడా మాటాడుకోవటం చాల అవసరం.

Comments

comments