సిన్మ చూసి ఉన్నదన్నట్టు కత చెప్పుడు

Cinema

ఊరిదస్తూరి: ఇయ్యాల రేపు అందరు సినిమాలు చూస్తరు. లేదంటే అండ్ల పాటలు హిట్ అయితే అప్పుడప్పడు పాడుతరు. ఎన్కట సినిమా చూసి వచ్చినంక ఉన్నదున్నటు కత మొత్తం చెప్పెటోల్లు ఉండేది. అయితే సినిమా చూసిన వాల్లు అందరు చెప్పుతరని కాదు. ఆ కథను కతగా విడమరచి చెప్పేవాల్లు ఉందురు. పేర్లు పడ్డప్పటి నుంచి ఫైటింగ్ నుంచి పాటల నుంచి అన్ని అంశాలను సమగ్రంగా చెప్పేవాల్లు ఉందురు. సినిమాల ఫైటింగ్ అయితే అప్పడు ఎన్టీగాడు వచ్చి డిష్యుం.. డిష్యుం తన్నంగనే సత్తిగాడు ఎల్లెల్కల ఎక్కన్నో పడేది. అంతలనే కృష్ణగాడొచ్చి అంటు కతను అండ్ల పాత్రలలో గాకుండా నటుల పేర్లలో చెప్పక పోయే కళ కొందరికే ఉంటది. అట్లనే పాట వస్తే కూడా పాట సూపెచ్చుడు ఉంటది.
పూర్వం సినిమా ఒక కళగానే అభిమానించే వాల్లు ఇప్పడు కళ కాదు గని ఏదో చూస్తాం అంటే చూస్తున్నరు. అందులో ఒక కుటుంబ కథ లేదా ఊరి కథ లేదా ఒక సామాజిక సమస్యను ఇతి వృత్తాలలో ఉండేది. అట్లాంటి కథలు చెప్పుతాంటే కూడా వినసొంపుగ ఉండేది.
ఇట్లాంటి సినిమా కథలను ఎవుసం పనుల కడ నాట్లేసే టప్పడు కూడా చెప్పుకుందురు. సోపతిగాళ్ళు యువకులు ఎక్కువగా ముందుగ సూసె వచ్చిన వాల్లు చెప్పుతరు. ఆ రోజుల్లో ఎక్కడనో తాలూక కేంద్రంలో సినిమా టాకీసు ఉంటే రాత్రి 9 గంటలకే ఒకే ఆట ఉండేది. దానికి ఇంటికాడ అన్నం తిని నాలుగైదు కిలోమీట్ల దూరం నడిచిపోయి సూసేవాల్లు. కొందరు ఉన్నోల్లు మాత్రం సైకిల్ల మీద సినిమా చూసేందుకు పోయేవాల్లు. రాత్రి సినిమాకుపోయేటప్పడు ఒక్క సైకిల్ మీద పోయేది. సైకిల్ తొక్కేవాల్లు ఒకలు బొంగు మీద ఒక్క కాలు పైడి ఏసేవాల్లు లేదా ఎనుక క్యారెల్ మీద కూసోని పూడి వేసేవాల్లు. ఇట్లా సినిమా పల్లె టూల్ల వాల్లు ప్రాణం వలె ప్రేమించేది. సినిమా కూడా సంక్షిప్త శద్ర చిత్రం పేరిట రేడియోలో కూడా వచ్చేది. అట్లా రేడియోల విన్న అనుభవంలోని సినిమా కథ లాగా చెప్పేవాల్లు. కథలు నవలు రాసిన రచయితలు నాటకలు రాస్తేన వాటిని పల్లెల పూర్తి వినేవాల్లు అట్లా నాటికలను జానపద కార్యక్రమాలను విన్న అనుభవవం తోటి పల్లెతోడి సినిమా కథలు చెప్పతుంటుంరి.
ఇయ్యాల రేపు సినిమాలల్ల చెప్పేందుకు కుటుంబ సంబంద కతలే లేవు. రాత్రి పూట వాకిట్ల కూసొని ఎన్నిల ఎలుగుకు కతలు చెప్పే పెద్ద మనుషులు ఉందురు. కతలను శాత్రాలు అందరు. ఒక్క శాత్రం చెప్పుత ఉంటే ఆయన గడెంత సుట్టు మనుమలు మనుమరాండ్లను కూసుండ పెట్టుకుని ఊ అనుమనుకుంట చెప్పతుండిరి. అట్ల కతలను వినే అలవాటు చెప్పే అలవాటు అలవోకగ నచ్చింది. రేడియో వచ్చినంక ఇక పల్లెల్లో ఈ కథలను చెప్పేవాల్లతో చెప్పచ్చుకున్నరు. రేడియో వాల్లను చెడగొట్ట్లలేదు. అట్లానే పాటల పాడేవాల్లు రాగయుత్తంగా పాడుతుంటే పనులు కాడ పాడిచ్టుకుంటరు. వీల్లనే బతుకమ్మకాడ ఇతర ప్రజ ఉత్సవాలకడ పాడిచ్చుకుంటరు. శాత్రాలు చెప్పేవాల్లు పాటలు పాడివాల్ల పట్ల ఊల్లో ఒక రకమైన గౌరవం కూడా ఉండేది.
నిజానికి కళ ఉన్నవాల్లను పనుల వచ్చే వాల్లను పనికి వచ్చే వాల్లను ఎవరైనా ఏ కాలంలోనైనాప్రత్యేక గౌరవంగానే సూస్తరు. అట్ల సినిమా కథను చేప్పే వాల్లు. ఎక్కువగా యువతరం ఉండేది. సినిమా ఒక బలమైన వాహికగా పల్లెల్లో కూడా ప్రభావం చూపెట్టింది. ఊల్లల్ల సినిమా పట్ల శ్రద్ద ఆ కాలంలో కూడా ఉండేది. ఎన్కట ‘జయచిత్ర’ అంటి సినిమా పత్రికలు డిటెక్టివ్ నవలలు కూడా ఎడ్ల కాడికి పోయేటప్పడు తీసిక పోయేవాల్లు. సినిమా కతలు చెప్పడమే కాదు సినిమా పాటలు పాడేవాల్లు కూడా ఊల్లల్ల అక్కడక్కడ ఉంటరు. అదే పాటల పాడే రాగయుక్త సమయంలోనే పల్లెలకు ఆరోజుల్లో వచ్చిన ఉద్యమాలకు ఆకర్షణకు వెళ్లిన వాల్లు ఉన్నరు. పాట ఆకర్షించి అన్యాయాలపై తిరుగుబాటు చేసేవాల్లు పల్లెల్లో ఉన్నరు.
పల్లెటూర్లలో ఇప్పటికీ కళాత్మకత నూతన ఆవిష్కరణలు కొత్త కొత్త ఆలోచనలు ప్రజా ఉపయోగమైన పనులు ఎల్లవేలలా కొనసాగుతున్నాయి. సినిమా కథను కతలాగ వినసొంపుగా చెప్పేవాల్లు ఇప్పడు ఎవరన్న ఉన్నరో లేదో లేవో కని ఆరోజుల్లో ఉండేవాలు. కతలే కాదు చిరతల రామాయణం, సారంగధర పౌరాణిక కతలు చెప్పేవాల్లు. నాటకాలు ఆడేవాల్లు కళాకారుల మేల్లం ఉండేది. టెలివిజన్ వచ్చినంగ ఊరు కల పురాగ పోయింది. స్మార్ట్ ఫోన్ వచ్చినంక అంతా నాశనం అయితుంది.

అన్నవరం దేవేందర్ 94407 63479

Comments

comments