సినిమా షూటింగ్ స్పాట్ మహేశ్వరం గడికోట

Ancient Maheshwaram Gadikota Fort

తెలంగాణ చరిత్ర ఆనవాళ్లపై పాలకులు ఎంత అశ్రద్ధ చూపినా వాటికున్న ప్రాధాన్యంతో పేరు ప్రఖ్యాతులు సాధించాయి కొన్ని ప్రాంతాలు. ఆ కోవలోకే వస్తుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోట. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి కానీ నాటి పాలనకు, సంస్కృతికి దర్పణం పడుతూ చారిత్రక అవశేషాలుగా మిగిలిన కోటలలో ఇది ఒకటి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా వుండటం రియల్ బూమ్‌తో ఇక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తరుణంలోనే సినిమా పెద్దలను ఆకర్షించింది ఈ కోట. పలు చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుని విజయవంతమయ్యాయి. సినిమా ఇండస్ట్రీని ఆకర్షించిన మహేశ్వరం గడికోట పర్యాటకంగా అభివృద్ధి కావాల్సి ఉంది.

సినిమా షూటింగులు ఒకప్పుడు కేవలం స్టూడియోలకే పరిమితమయ్యేవి. నేడు ఏ గ్రామంలో మంచి లొకేషన్ ఉన్నా, చారిత్రక కట్టడాలు ఉన్నా సినిమా బృందాలు అక్కడ వాలిపోతున్నాయి. నగరానికి అత్యంత చేరువలో వున్న మహేశ్వరంతో పాటు పలు గ్రామాలు చారిత్రకంగా ప్రాముఖ్యత పొందడం, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడం షూటింగులకు స్పాట్‌గా మారాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రానికి చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. చారిత్రక కట్టడాలు, శివగంగా రాజరాజేశ్వరాలయ పరిసర ప్రాంతాలు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యాబ్ సిటి, అవుటర్ రింగురోడ్డు వల్ల మహేశ్వరానికి గుర్తింపు రావడంతో సినీ పరిశ్రమ కన్నుపడింది. ఇటీవల సినిమా షూటింగులకు, షార్టు ఫిలింలకు వేదిక అయింది. మొట్టమొదటిసారిగా మహేశ్వరంతో పాటు రావిరాల ప్రాంతంలో కృష్ణంరాజు, మోహన్‌బాబు నటించిన సర్దార్ ధర్మన్న చిత్రం షూటింగ్ జరుపుకొని మంచి గుర్తింపు పొందింది.

కొంతకాలం సినిమా షూటింగ్‌లకు దూరంగా మహేశ్వరం ఉన్నా రియల్ బూమ్‌తో ఒక్కసారిగా కళ వచ్చింది. రాజశేఖర్ నటించిన సింహరాశి, గోపీచంద్ నటించిన ఆంధ్రుడు, జగపతిబాబు హరికృష్ణలు నటించిన శివరామరాజు మంచి విజయాన్ని సాధించడంతో పాటు వెంకటేష్ నటించిన చంటి సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇవే కాకుండా ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని, రాజా, స్నేహం కోసం, పిస్తా, ఫిల్మ్‌నగర్, ఎవ్వడైతే నాకేంటి, చమక్ చలో చిత్రాల షూటింగ్‌లతో మహేశ్వరానికి మంచి గుర్తింపు వచ్చింది. ఎక్కువగా సూపర్ గుడ్ ఫిల్మ్, మయూరి ఫిల్మ్ వారు ఈ షూటింగ్ స్పాట్‌పై దృష్టి సారించడంతో మహేశ్వరం లోని శ్రీ శివగంగాఆలయం గడికోట, చారిత్రక కట్టడాలు సందర్శకుల రాకను పెంచాయి. భవిష్యత్‌లో మరిన్ని సినిమా షూటింగ్‌లతో మహేశ్వరం ప్రాంతం, సినిమా స్పాట్‌గా పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి నిధులు విడుదల చేస్తే నగరానికి అతిచేరువలో ఉన్నందున తక్కువ ఖర్చుతో పర్యాటకులు వచ్చి సేదతీరడానికి అవకాశం ఉంది.

ఎలా వెళ్లాలి: హైదరాబాద్ నుండి నేరుగా మహేశ్వరానికి బస్సు సౌకర్యం ఉంది.

-జగన్‌రెడ్డి, మహేశ్వరం, మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments