సిఎస్‌ఆర్ నిబంధనలను పరిశీలిస్తాం

Nirmala Sitharaman

 

ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య స్నేహపూర్వక వాతావరణం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ఇటీవల కంపెనీల చట్టానికి చేసిన మార్పుల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్)పై నేరపూరిత శిక్షా నిబంధనలను సమీక్షిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమకు హామీ ఇచ్చారు. రెట్రాస్పెక్టివ్ ప్రభావంతో వచ్చిన సిఎస్‌ఆర్ నోటీసులు ఆమోదించదగినవి కాదని, నిలిపివేయనున్నామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సభ్యులతో ఆమె అన్నారు. సిఎస్‌ఆర్ నిబంధనలను పాటించకపోతే జరిమానాలు విధించడమే కాకుండా కంపెనీల చట్టానికి చేసిన సవరణలు సంబంధిత అధికారులను మూడేళ్ల వరకు జైలులో పెట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చాయి. కొత్త సవరణల తర్వాత సంస్థలు సిఎస్‌ఆర్ కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది.. అలా చేయడం లేదని వాటాదారులకు వివరించే పద్ధతి కేంద్రం నిలిపివేసింది.

ప్రభుత్వం ఆదాయ గణాంకాలు ఆశించినరీతిలో ఉంటే కార్పొరేషన్ పన్ను రేటును 25 శాతానికి తగ్గిస్తామని దేశీయ పరిశ్రమకు సీతారామన్ హామీ ఇచ్చారు. పెద్ద సంస్థలలో 1 శాతం కన్నా తక్కువగా కార్పొరేషన్ పన్నును 30 శాతం, మిగిలినవి 25 శాతం చెల్లిస్తున్నాయి. ‘కార్పొరేట్లపై పన్ను తగ్గించడం మా ఉద్దేశం. ఈ విషయంపై రెండో ఆలోచన లేదు‘ అని సీతారామన్ అన్నారు. పన్నుల ఆదాయాలు పెరుగుతున్న ధోరణిలో ఉంటే అన్ని వర్గాల కార్పొరేట్‌లకు 25 శాతం రేటును ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని, ఇది పెట్టుబడులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పన్నుల వేధింపులపై ఫిర్యాదులు
పన్ను వసూలులో వేధింపుల వంటి ఫిర్యాదులపై సీతారామన్ స్పందించారు. వచ్చే వారం నుంచి ఈ అంశంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలను కలుస్తామని, అత్యవసర సందర్భాలలో మనోవేదనలను పరిష్కరిస్తామని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఆమె దృష్టికి రావడానికి త్వరలో సాంకేతిక వేదికను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. పన్ను వేధింపుల ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయాలని, ఆటోమొబైల్ రంగానికి జిఎస్‌టి రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని పరిశ్రమ కోరింది.

ఆగస్టు 15న నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యక్ష పన్నుల కోడ్‌పై టాస్క్‌ఫోర్స్ సిఫారసులను ప్రభుత్వం తక్షణమే పరిశీలిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం పన్నుల సరళీకరణ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. పన్ను వేధింపుల సమస్యలను వినడానికి, అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు సీతారామన్ సిఐఐకి తెలియజేశారు. పన్ను వేధింపుల సమస్యల కోసం టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఎఫ్‌పిఐలకు పన్నుపై త్వరలో ప్రకటన
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు (ఎఫ్‌పిఐ) విధించే సర్‌చార్జీని తొలగించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే వారం దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పన్నును సమానంగా ఉంచడానికి ప్రభుత్వం ఒక మార్గాన్ని అన్వేషిస్తుంది. దాని ప్రభావం పెట్టుబడిదారులపై తక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డివిడెండ్ పంపిణీ పన్నుపై పునరాలోచించాలని, ఎల్‌టిసిజిని తగ్గించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే ఎఫ్‌పిఐలకు కెవైసి ప్రమాణాలలో సడలింపు కూడా పరిశ్రమ వర్గాలు కోరాయి.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎస్‌ఆర్ నిబంధనలను పరిశీలిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.