సాహిత్య మేరుగిరి వేదగిరి రాంబాబు

vedagiri rambabu is telangana famous poet

వేదగిరి రాంబాబు సముద్రం లాంటివాడు. బహుముఖీన ప్రజ్ఞావంతుడు- ఆ సముద్రం అలలు తగ్గవు.. తపన తగ్గదు అన్నట్లు కొనసాగించాడు. అతనిదో మహా అక్షరరమ్య యాత్ర’ అంటారు వీరాజీ రాంబాబును గురించి రాస్తూ. ఇతరులకు ఏమో కానీ దగ్గరనుండి వేదగిరిని చూసిన ప్రతి ఒక్కరికి అది తెలుసు. 1992లో ఉస్మానియా తెలుగుశాఖ విద్యార్థిగా హైదరాబాద్ వచ్చిన నాకు అదే సంవత్సరం పరిచయమైన వారిలో వేదగిరి రాంబాబు గారొకరు. ఆ స్నేహం ఇప్పటిదాకా కొనసాగింది. ‘కథానికా జీవి’గా నిరంతర చలనశీలిగా కథకోసం పనిచేసిన రాంబాబు ప్రవృత్తిపరంగా కథకులుగా కొనసాగుతూ ‘కొత్త కథ’, ‘నవతరం కథ’, ‘సరికొత్త కథ’, ‘వినూత్న కథ’, ‘పంచసప్తతి’ మొదలగు డైరెక్ట్ కథా సంపుటాలను వెలువరించారు. కథపట్ల అపారమైన ప్రేమకలిగిన రాంబాబు దాదాపు మూడువేల తెలుగు కథలను వందలాది మంది రచయితల చేత సమీక్ష చేయించి ఒక వినూత్న ప్రయత్నంగా నాలుగు సంపుటాలుగా వాటిని ప్రచురించారు.

ఏ పనైనా చేపడితే అది పూర్తయ్యేవరకు ఊరుకునేస్వభావం ఆయనకు లేదు. అందుకు ఒక్క ఉదాహరణ, దాదాపు రెండు మూడు సంవత్సరాలు ప్రతిరోజు జైలుకు వెళ్ళి జైలుగోడల మధ్య మగ్గుతున్న ఎన్నో బతుకులను పరామర్శించి ‘జైలు గోడల మధ్య’ అనే పరిశోధనాత్మక గ్రంథం రాయడం. ఒక సందర్భంలో నాతో మాట్లాడుతూ ఇంటికి ఎవరైనా మిత్రులు వచ్చి ‘మీ నాన్నగారు ఉన్నారా’ అని అడిగితే రాంబాబు పిల్లలు ‘నాన్నగారు జైలుకు వెళ్ళారు’ అని చెప్పేవారట. విన్నవాళ్ళు అయ్యో, ఏమయింది అని అడిగేవారట. అంతలా మమేకమై పనిచేసేవారాయన. వేదగిరి కమ్యూనికేషన్ ద్వారా కథానికా ప్రచారం కోసం చేసిన కృషిని, నాలుగు వందల సంవత్సరాల హైదరాబాద్ పైన తెచ్చిన పుస్తకాన్ని గురించి ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే.

కేంద్ర సాహిత్య అకాడమి కోసం అయిదు రోజుల కథా కార్యశాల నిర్వహించడమేకాక వేదగిరి రాంబాబు, వాకాటి పాండురంగారావులు సంపాదకత్వంలో ‘బంగారు కథ’ సంకలనం వెలువరించారు. అదే కోవలో ఇటీవల నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం సంపాదకత్వం వహించి ప్రచురించిన ‘శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఉత్తమ కథలు’ కూడా రాంబాబు పనిని తెలుపుతాయి. ముఖ్యంగా ‘కథానికా శతజయంతి’ని. శ్రీపాద, గురజాడ, గిడుగు, బుచ్చిబాబు, పాలగుమ్మి వంటి తెలుగు ప్రసిద్ధుల జయంతులు, శతజయంతులు, పండుగలు 23 జిల్లాలో నిర్వహించడమే కాక వారిపై ప్రత్యేక సంచికలు తెచ్చారు. గతంలో విహారి, డా. పోరంకిలతో కలిసి గిడుగు రచనలను తెలుగు అకాడమి ద్వారా ప్రచురించిన రాంబాబు రెండు తెలుగురాష్ట్రాల్లో కథానిక కార్యశాలలు జరపని ప్రాంతం లేదనడం అతిశయోక్తి కాదు. జర్నలిజం రంగంలో డాక్టరేటు పొందిన వేదగిరి రాంబాబు వందకు పైగా పుస్తకాలను ప్రచురించారు. దృశ్యమాధ్యమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు.

చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. వేదగిరి రాంబాబు రచయితగా, ప్రచురణకర్తగా, అచ్చువేసుకోలేని రచయితల పుస్తకాలను స్వంత ఖర్చులతో ప్రచురించే ప్రచురణకారునిగా మాత్రమే తెలుసు. ఆయన వదాన్యతను ప్రత్యక్షంగా చూసినవాళ్ళలో నేనొకడిని. ఒకసారి మేమిద్దరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళితే అక్కడ వాళ్ల తండ్రిగారి పేరుమీద తాను నిర్మింపజేసిన డయాబెటిక్ రిసెర్చ్ సెంటర్, హిమోఫీలియా క్లినిక్‌లను చూపించారు. రాంబాబు చేసిన ఇలాంటి పనులు ఒకటి, రెండు అని చెప్పలేం… విజయనగరంలోని గురజాడ ఇంటిని మరమత్తు చేయించి స్టీలు గ్రిల్లు లు నిర్మంచడం నుండి రాజమహేంద్రవరం లో ని కోటిపల్లి బస్‌స్టాండ్‌లో శ్రీపాద సుబ్రహ్మణ్మశాస్త్రి విగ్రహాన్ని నెలకొల్పడం వరకు చేసిన పనుల చిట్టా తయారుచేస్తే శ్రీపాదవారి పెద్ద కథంత లిస్టు తయారవుతుంది.

రచయితగా 11 కథా సంపుటాలు వెలువరించిన రాంబాబు 400కు పైగా కథలు రాసారు. ముఖ్యంగా ఇవ్వాళ్ళ అవయవ దానం గురించిన స్పృహ ను మనం పత్రికల ద్వారా చూస్తున్నాం. ఇదే విషయం ప్రధానంగా ఏకంగా కథా సంపుటాన్ని దశాబ్ధం క్రిందటే వెలువరించిన కథకులు రాంబాబు.

రాంబాబు కథా రచయిత, పరిశోధకులు, ప్రచురణకర్తయే కాక బాల సాహితీవేత్త. గురజాడ గేయా న్ని తలపై జెండాలాగా మోసిన రాంబాబు దానిని 24 భాషల్లో అచ్చువేసి దానిని ప్రచారంచేశాడు. 1993లో జవహర్ బాలభవన్ ‘ఇంద్రధనుస్సు’ పేరుతో వెలువరించిన మొట్ట మొదటి పిల్లల వీడియో మ్యాగజైన్‌కు సంబంధించిన ఎనిమిది వీడియో క్యాసెట్లు రాంబాబు దర్శకత్వంలో రూపొందాయి. ఆంధ్రప్రభలో పిల్లల కోసం రెండు సీరియల్లు రాంబాబు రాసారు. తరువాత వీటిని బాల భవన్ ‘బాలరాజు’, ‘అడవి మనిషి’ పేర్లతో ప్రచురించింది. బాల సాహితీవేత్తగా రాంబాబుకు ఇవి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. 2002లో రాంబాబు రూపొందించిన ‘పాపం పసివాళ్ళు’ సీరియల్ విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ సీరియల్‌కు దర్శకత్వంలో బంగారునంది, దర్శకునిగా రాంబాబుకు బంగారు నంది లభించాయి.

ఏ మనిషి పుట్టుకతో నేరస్తుడుగా పుట్టడనీ, పిల్లల్ని అడుక్కునే పరికరాలుగా తీర్చిదిద్దేవారే పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారన్నవిషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన రాంబాబు దర్శకునిగా బంగారు నంది అందుకున్నారు. ఇదే కోవలో సమాజంలోని ఎన్నో రుగ్మతలను కళ్ళకు కట్టినట్టు చూపించిన రాం బాబు చిత్రించి న బాలల టెలీఫిలిం ‘అడవి మనిషి’. మొదట ఇది ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచరించబడింది. తరువాత మాటివి ద్వా రా ప్రసారం కాబడింది. దీనికి దర్శకునిగా రాం బా బు నంది అవార్డును అందుకున్నారు. పిల్లలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని నమ్మిన రాంబాబు వాళ్ళలో కమ్యూనికేషన్ స్కి ల్స్ పెరిగినప్పుడే అవగాహన పెరుగుతుందని నమ్మి పిల్లల కోసం నాటికలు వేయించారు. ఈ కోవలో ‘తప్పెవరిది’అనే కథను దృశ్య నాటికగా, శ్రవ్యనాటికగా మలి చి పిల్లలచేత ప్రదర్శింపజేసారు. పిల్లల కోసం కథలు, నవలలు రాసారు రాం బాబు.

పైన చెప్పిన బాలరాజు పేరుతో రెండు నవలలు రాసిన రాంబాబు పిల్లల కోసం ‘అలవాట్లు, పొరపాట్లు’, ‘ఐదు కథలు’,‘మన హైదరాబాద్’, ‘చిన్ని కథ లు’, ‘బాలల బొమ్మల గురజాడ’, పిల్లల నవల ‘విజయచంద్ర’, ‘బుజ్జి కథలు’, ‘ఆబాల గోపాలం’, ‘మన హైదరాబాద్’ మొదలగునవి రాంబాబు బాల సాహితీవేత్తగా పిల్లలకు అందించిన తాయిలాలు.కేవలం పిల్లలకు పుస్తకాలు కథలు రాయడంతోనే రాంబాబు సరిపెట్టుకోలేదు. పిల్లల కోసం నిర్వహించిన కార్యశాలలకు హాజరయ్యా రు. పిల్లల రచనలు పుస్తకాలుగా ప్రచురింపబడాలని, పిల్లలు రచనలు చేయాలని కోరుకున్న వారిలో ఈయన ఒకరు. స్వయంగా వ్యాసరచయితతో పలు కార్యశాలల్లో పాల్గొన్నారు. పిల్లల కోసం రచనలు చేయడమే కాక వాళ్ళకోసం పలు అనువాదాలు కూడా చేసారు. ఇరవై అయిదేండ్ల క్రితమే ముల్కరాజ్ ఆనంద్ రాసిన ‘మన వీథి ఆటలు’పుస్తకాన్ని మరియు ఇటీవల హైదరాబాద్‌కు చెం దిన ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి జిలానీ బానో పిల్లల కథలను ‘జిలానీ బానో రెండు పిల్లల కథలు’ పేరుతో అనువదించారు. ఈ రెంటిని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం నుండి తెలుగునాట వివిధ సంస్థల సత్కారాలు పురస్కారాలు అందుకున్న రాంబాబు స్వయంగా ‘బుచ్చిబాబు అవార్డు’ను నెలకొల్పి ఇప్పటికి ఏడు మందికి పురసార్కాలు అందించారు. ఇది కథకులకు అందించే పురస్కారం. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన అక్టోబర్ 14 ను ‘కథానికతో ఒక సాయంత్రం’ పేరుతో వైభవంగా జరిపే రాంబాబు ఆరోజంతా కథల పండుగచేసి, కథకులను సత్కరించే సంప్రదాయాన్ని నెలకొల్పి మొన్నటి ఏప్రిల్ దాకా ఆరో గ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కొనసాగించారు. బాల సాహిత్య వికాసం జరిగితేనే బాలల అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వేదగిరి రాంబాబు మీద గౌరవంతో సింహప్రసాద్ సాహిత్య సమితి గత సంవత్సరం నుండి బాల సాహిత్య రచన, వికాసం కోసం పనిచేసినవాళ్ళకు ‘డాక్టర్ వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం’ను 5000 వేల రూపాయల నగదుతో అందిస్తోంది. దీనికి తోడుగా యువ రచయితలను ప్రోత్సహించేందుకు ‘యువ పురస్కారం’ను నెలకొల్పింది.

వేదగిరి రాంబాబు తొలి బాలసాహిత్య పురస్కారం చిలకలూరిపేటకు చెందిన బాల సాహితీవేత్త, దార్ల బుజ్జిబాబుకు గత సంవత్సరం అందించారు. 2018 సంవత్సరానికి బాల సాహిత్య వికాసం, ప్రచారం కోసం పనిచేస్తున్న ఈ వ్యాసకర్తకు ప్రకటించారు. అక్టోబర్ 14న దీనిని అందించనున్నారు. రాంబాబు కేవలం కథానికకే పరిమితమై పోలేదు,వైద్య గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విమర్శా గ్రంథాలు, జీవిత చరిత్రలు, అనువాదాలు, చరిత్ర రచనలు, జర్నలిజం గ్రంథాలు, పరిశోధనా గ్రంథాలు, బాలల సాహిత్యం వెలువరించారు. ఆ బహుముఖీనమైన ప్రజ్ఞ రాంబాబును ఇతరుల కంటె భిన్నంగా చూపిస్తోంది. తెలుగు కథానిక ప్రచారం, వికాసం కోసం నిరంతరం తపించిన రాంబాబు తెలుగు కథ నిలిచిఉన్నన్ని రోజులు ఉంటారు. సుప్రసిద్ధ కథకులు, డా. వేదగిరి రాంబాబును నూటాయాభై మంది కథకుల సమక్షంలో విజయనగరంలో ‘కథానికా జీవి’ బిరుదుతో సత్కరించిన విహారిగారు అన్నట్లు ‘రాంబాబు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో కథానికా వికాసం కోసం పని చేసిన పదహారణాల కథానికా జీవి’.